Breaking News

పోలీసులూ జైలుకెళ్లారు!!

Published on Sun, 12/07/2025 - 06:32

లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. 

హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్‌ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.

హైదరాబాద్‌లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ (సిక్‌) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్‌పై సిక్‌లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్‌ – వీరి విచారణ కోసం హైదరాబాద్‌ శివార్లలోని అనేక గెస్ట్‌ హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు ఇంటరాగేషన్‌ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్‌ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్‌లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్‌లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. 

ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్‌లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. 

ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ పోలీసుస్టేషన్‌లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్‌కు బదిలీ కావడంతో సిక్‌ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. 

ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్‌ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) హైదరాబాద్‌ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు నిందితుల షెల్టర్‌ గుర్తించారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లాహౌస్‌ ఎల్‌–18 ఫ్లాట్‌లో 2008 సెప్టెంబర్‌ 15న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆతిఖ్‌ అలియాస్‌ బషర్‌ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్‌ డీల్‌ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్‌లపై 2018 సెప్టెంబర్‌ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

శ్రీరంగం కామేష్‌

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు