ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
ఎదుటివారి సంతోషాన్ని చూసి మీరు సంతోషించగలరా?
Published on Fri, 10/02/2026 - 11:03
మనసును శుద్ధంగా ఉంచుకోవటం ఆధ్యాత్మిక సాధనలన్నింటికీ కీలకమైన తొలి మెట్టు. శుద్ధ చిత్తం అన్ని సాధనలకూ ఆధారం. అందువలన చిత్తాన్ని శుద్ధి చేసుకొనేందుకు ప్రాచీన ఆచార్యులు ఎందరో, ఎన్నో విధాలైన సాధనలూ, అభ్యాసాలూ బోధించారు. పతంజలి మహర్షి క్రోడీకరించిన యోగ సూత్రాలలో చిత్తశుద్ధిని పెంచుకొనేందుకు ఒక చక్కని సూత్రం చెప్పారు. మనశ్శాంతికి దోహదం చేస్తుంది కనక, ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనలకే కాదు, దైనందిన ప్రాపంచిక జీవితంలో కూడా ఉపయోగకరం. సూత్రం ఇది:
‘మైత్రీ కరుణా ముదితా ఉపేక్షాణాం, సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం భావనాతః చిత్త ప్రసాదనమ్’. సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాలు తారసిల్లినపుడు, వాటిపట్ల మైత్రి కరుణ ముదితా ఉపేక్ష అనే భావనలతో స్పందించే అభ్యాసం ద్వారా చిత్తానికి శుద్ధి... అని సూత్రానికి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. జీవితంలో సుఖంగా సంతోషంగా ఉన్న ప్రాణులు మనకు తటస్థ పడే సందర్భంలో, అలాంటి ప్రాణులన్నిటి పట్లా మైత్రీ భావంతో స్పందించటం అభ్యాసం చేయాలి. అసూయ లేకుండా, నిష్కల్మషమైన స్నేహ భావనతో వాళ్ళ ఆనందాన్ని చూచి, ఆనందించాలి.
అలాగే, దుఃఖాలను ఎదుర్కొంటున్న వాళ్ళు తటస్థపడినప్పుడు, కరుణ భావనతో స్పందించటం అభ్యాసం చేయాలి. ఆ దుఃఖితుల పట్లా, దీనుల పట్లా దయ అన్న భావనతో ప్రతిస్పందించి, ఓదార్పు కలిగించే మాటల తోనూ, దయగల చేష్టలతోనూ, మనఃపూర్వకమైన సానుభూతితోనూ వ్యవహరించటం అభ్యాసం చేయాలి. అదే విధంగా లోకహితమైన సత్కార్యాలనూ, పుణ్య కార్యాలనూ ఆచరించే సజ్జనులను చూసినప్పుడు, వాళ్ళ ధర్మాచరణ గమనించి, హృదయపూర్వక మైన మోదం, సంతోషం అనుభవిస్తూ వాళ్ళను అభినందించగలగటాన్ని – ముదితాభావం – అలవరచుకోవాలి.
అందుకు విరుద్ధంగా, పాపిష్ఠి పనులలో మునిగి తేలే పాపాత్ములు ఎప్పుడయినా ఎదురయితే, వాళ్ళ పట్ల నిర్లిప్తతా, ఉపేక్ష చూపుతూ, అలాంటి వారి చర్యల గురించిన భావనలే మనసులో చొరనీయకుండా ఉండాలి. అలాంటి మాలిన్యాల ప్రభావాలు మనసుకెక్కితే, మనసు అపరిశుద్ధమౌతుంది. మనశ్శాంతి చెదిరిపోతుంది. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళకు కూడా పై సూత్రం ఉపకరిస్తుంది. లలితా సహస్ర నామాలలో ‘మైత్రాది వాసనా లభ్యా...' (మైత్రి మొదలైన సంస్కారాలు అలవరచు కొన్నవారికి సులభ సాధ్యురాలు) అని ఒక నామం.
– ఎం. మారుతి శాస్త్రి
Tags : 1