ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు
Breaking News
ఉద్యోగం ఐటీ..నాట్యంలో మేటి..
Published on Wed, 11/19/2025 - 12:28
రంగమేదైనా రాణింపే లక్ష్యంగా దూసుకుపోతున్నవారు ఎందరో ఉన్నారు.. అయితే ఏక కాలంలో భిన్న రంగాల్లో రాణిస్తున్న వారూ కొందరున్నారు. ఆ జాబితాలోకే వస్తారు నగరంలోని మణికొండ నివాసి శ్రావ్యమృదుల. తన మాతృమూర్తికి నివాళిగా ఈ నెల 24న నగరంలో పెద్ద సంఖ్యలో ఔత్సాహిక నృత్యకారులను ప్రోత్సహించేందుకు భారీ నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ సారాంశం..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేయడం అంటే వారాంతంలో రెండు రోజుల పాటు దొరికే సెలవుల కోసం ఆత్రుతగా ఎదురు చూడడం.. వీకెండ్‌లో పబ్బులూ, క్లబ్బులూ, రిసార్టులూ అంటూ పరుగులు తీయడం.. తెలుసు మనకు. కానీ శ్రావ్యమృదుల మాత్రం అలాకాదు.. ఆఫీసు పనులను మించి అత్యంత బిజీగా గడిపే సమయం.
ఓ వైపు గృహిణిగా, నటిగా, మరోవైపు నర్తకిగా, ఔత్సాహిక నృత్య కళాకారులకు గురువుగా.. ఇలా ఏకకాలంలో భిన్న పాత్రలు పోషించే సమయం. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఇంటర్నేషనల్ ప్రదర్శనలకూ సై అనేందుకు సన్నాహాలు చేసే సమయం.
‘భుక్తి కోసం ఉద్యోగం.. తృప్తి కోసం కళాసేవ.. నా ఖాళీ సమయం అంతా కళ కోసమే’ అంటారు శ్రావ్యమృదుల. కళ పట్ల నిజమైన భక్తిని తనలో నింపుకుని.. తన గురువుల మార్గదర్శకత్వంలో వైఎంసీఏ జాతీయ శాస్త్రీయ నృత్య పోటీల్లో మొదటి బహుమతి సహా ఎన్నో పురస్కారాలు గెలుచుకోగలిగానని చెబుతారు ఈ నృత్యగురు. సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ..
‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో మాస్టర్స్ (పోస్ట్–గ్రాడ్యుయేషన్) అదే విధంగా జేఎన్‌టీయు నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీ.టెక్ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కూచిపూడి డ్యాన్సర్ అనే భిన్న రంగాలైన రెండు పడవల ప్రయాణాన్ని సమర్థవంతంగా సాగిస్తూనే.. నటనను కూడా కొనసాగిస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’, ‘సదా నన్ను నడిపే’ సినిమాలతో పాటు ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌లోనూ ఆమె నటించారు. నృత్యంలో అభినయం భాగమే కదా అనే శ్రావ్య.. నటన తనకు అభిరుచి మాత్రమేనని స్పష్టం చేస్తారు. ఢిల్లీలో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాలు, దుబాయ్, షార్జా, మాల్దీవులు, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్ తదితర అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శన ఇచ్చే అవకాశం తనకు లభించిందన్నారు.
30 ఏళ్లుగా.. కళకళ లాడుతూ..
‘మూడేళ్ల వయసులో ప్రారంభమైన కళాత్మక ప్రయాణం.. గత 15 సంవత్సరాల నుంచి గురువుగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రదర్శకురాలిగా వ్యవహరిస్తూ వచ్చాను. మా శ్రీ నటరాజ కళానికేతన్ ద్వారా భావి తరాలను సంప్రదాయ కళల వైపు నడిపించడం, నన్ను తీర్చిదిద్దిన కళను నా వంతుగా సంరక్షించడం నా లక్ష్యం’ అంటున్న ఈ కళా పిపాసి స్ఫూర్తివంతమైన కల సాకారం కావాలని కోరుకుందాం.
(చదవండి: ఇంటి పైకప్పుపై విదేశీ కూరగాయలు, పండ్లు..)
Tags : 1