వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
కాఫీ కప్పు చూసి అభ్యర్థిని అంచనా వేస్తారా?
Published on Sat, 09/26/2026 - 13:17
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? అయితే దుస్తులు, రెజ్యూమ్, మాట తీరు.. ఇలా అన్నింటిపైనా జాగ్రత్త పడతాం. కానీ చేతిలో ఉన్న కాఫీ కప్పు కూడా మనపై ఓ అభిప్రాయం కలిగిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా ఐస్‌డ్ కాఫీతో ఇంటర్వ్యూకి వెళ్లడం సరైనదేనా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
అమెరికాకు చెందిన రిక్రూటర్ కైట్లిన్ వెహ్నియానెన్ ఈ అంశంపై చేసిన ఓ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూకి ఐస్‌డ్ కాఫీతో రావడం.. ఆ అభ్యర్థి ఉద్యోగాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదనే భావన కలగవచ్చని ఆమె పేర్కొన్నారు. రోజువారీ పనుల్లో ఇదీ ఒక పని అన్నట్టుగా కనిపించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ‘గ్రేట్ ఐస్‌డ్ కాఫీ డిబేట్–2026’ అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం.. ఇంటర్వ్యూకి ఐస్‌డ్ కాఫీ, ఐస్‌డ్ మాచా వంటి పానీయాలు చేతిలో పట్టుకుని రావడం అనేది అభ్యర్థి ఉద్యోగాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే భావన కలగవచ్చునని అంటున్నారు. మరికొందరు మాత్రం అభ్యర్థి చేతిలో ఏ పానీయం ఉందన్నదానికంటే ఇంటర్వ్యూలో అతడు ఏం మాట్లాడుతున్నాడు, తన నైపుణ్యాలను ఎలా చూపిస్తున్నాడన్నదే ముఖ్యమని చెబుతున్నారు. లండన్‌కు చెందిన కొందరు యువ ఉద్యోగులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, కాఫీ తీసుకెళ్లడంలో వ్యక్తిత్వం కనిపించే అవకాశం కూడా ఉందని మరికొందరు అంటున్నారు.
ఉద్యోగ నియామక నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ఐస్‌డ్ కాఫీ ఒక్కటే అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రమాణం కాదు. అలాగే, వాటర్ బాటిల్, కాఫీ లేదా నోట్‌బుక్ వంటి చిన్న విషయాల ఆధారంగా అభ్యర్థిపై వెంటనే ఓ నిర్ణయానికి రావద్దని వారు సూచిస్తున్నారు. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, అనుభవం, ప్రవర్తన ముఖ్యమని చెబుతున్నారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సంస్థ, ఉద్యోగం, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి గురించి తెలుసుకోవడం, సమయానికి చేరుకోవడం, ముందుగానే సిద్ధం కావడం మాత్రం చాలా అవసరమని అంటున్నారు.
ప్రస్తుతం యువతకు ఉద్యోగం దొరకడం అంత సులభంగా లేదు. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లోనూ ఎంట్రీ లెవల్ ఉద్యోగాల విషయంలో పోటీ పెరిగింది. ఇలాంటి సమయంలో ఇంటర్వ్యూలో ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా.. మనం ఇచ్చే మొదటి అభిప్రాయం మాత్రం ముఖ్యమే. అందుకే కాఫీ ఐస్‌డ్‌దా.. హాట్‌దా అన్నదానికంటే, మన మాట తీరు, సమయపాలన, పద్ధతి, ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని చూపించడమే అసలైన విషయం.
ఇదీ చదవండి: ప్రపంచ వేదికపై ముంబై తాజ్!
Tags : 1