Breaking News

సొంతకథను చెప్పుకున్న 'పరదేశి'!

Published on Sun, 08/02/2026 - 09:59

కెజువో ఇషిగురో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్‌ రచయిత. కవనం లాంటి వచనం రాయగలిగిన ఈ నవలా రచయిత మొదట్లో కథానికలతోనే పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకోవడానికి ముందు కెజువో తను రాసుకున్న పాటలను తానే స్వరబద్ధం చేసుకుని గిటారు మీద వాటిని పలికిస్తూ అనేక యూరపియన్‌ దేశాల్లో పర్యటించాడు.

అయితే, కెజువోను వాగ్గేయకారుడిగా గుర్తించడానికి యూరప్‌ పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ దశలోనే అతనికి స్టేసీ కెంట్‌–జిం టాంలిన్సన్‌ దంపతులతో పరిచయం ఏర్పడింది. ఆశావాదంతో పొంగిపొర్లే గీతాలను మాత్రమే పాడాలన్నది వారి నియమం! దాంతో, కెజువో భావనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినట్లయింది. అయినప్పటికీ, కెజువో వాళ్ళకోసం 16 ఆల్బమ్‌లను రూపొందించారు! అది వేరే విషయం. తన జీవితానుభవంలోని చీకటినీడలను చిత్రించే నిమిత్తం కెజువోకు వచనాన్ని ఆశ్రయించక తప్పలేదు! 

చిత్రమేమిటంటే, అతగాడికి కథానికలూ– నవలల రచయితగానే ఎక్కువ పేరొచ్చింది. బుకర్‌ ప్రైజ్‌ మొదలుకొని నోబెల్‌ సాహిత్య పురస్కారం వరకూ అతన్ని వరించి వచ్చాయంటే అందుకు కెజువో వచన రచనలే కారణం. 1950 దశకం నాటి ఇతివృత్తాలతో రూపొందించిన నవలలూ కథానికలవి. అంతకన్నా నాలుగడుగులు వెనక్కి వేసి, మరికొన్ని రచనలు కూడా చేశాడు కెజువో. బహుశా ఆ కారణంగానే జేన్‌ ఆస్టిన్, చార్ల్స్‌ డికెన్స్, షార్లట్‌ బ్రాంట్, జార్జ్‌ ఇలియట్‌ లాంటి పందొమ్మిదో శతాబ్ది మహామహులతో కెజువో ఇషిగురోను పోల్చింది పాశ్చాత్య ప్రపంచం!

రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న తరుణంలో, అమెరికా తను రూపొందించిన అణుబాంబు విధ్వంసం ఎంత తీవ్రంగా వుంటుందో ప్రపంచానికి చూపించాలనుకొంది. 1945, ఆగస్ట్‌ తొమ్మిదో తేదీన ఈ దారుణానికి వేదిక అయిన దౌర్భాగ్యం నాగసాకి నగరానిది. అదే కెజువో స్వస్థలం. ప్రపంచయుద్ధం ముగిసిన తొమ్మిదేళ్ళకు, 1954లో కెజువో అక్కడ పుట్టాడు. 1959లో అయిదేళ్ళ కెజువోను వెంటబెట్టుకొని అతని తల్లితండ్రులు బ్రిటిష్‌ గడ్డపైకి వలస వచ్చేశారు. పరాయిగడ్డపై తన జాతీయతకు సంబంధించిన కెజువో ఆలోచనలే అతని తొలి రెండు నవలలకు ఇతివృత్తంగా అమిరాయి. ఆ మాటకొస్తే అతని మొత్తం సాహిత్య జీవితమంతా ఇవే నీడలు పరుచుకుపోయాయి.

నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి మూడున్నర దశాబ్దాలకు ముందే –1982లో– కెజువో ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’ అనే నవల రాశారు. ‘అది చదివినప్పటి నుంచీ కెజువో రచనారీతిని నేను అభిమానిస్తున్నాన’న్నారు సల్మాన్‌ రష్డీ. ఎత్సుకో అనే నడివయసు జపనీస్‌ మహిళ విషాద గాథ ఈ నవలకు ఇతివృత్తం. తన కుమార్తె ఆత్మహత్య సంఘటన మిగిల్చిన గాయం నుంచి బయటపడేందుకు ఎత్సుకో చేసే ప్రయత్నాన్నే ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’లో కవితాత్మకంగా వర్ణించారు కెజువో. రెండో ప్రపంచయుద్ధం ముగింపు సందర్భంగా 1945లో నాగసాకి నగరం ఎలావుండేదో ఎత్సుకో నెమరేసుకోవడం ఈ నవలకు ఇతివృత్తం. ఈ నవలలో, ఎత్సుకో జ్ఞాపకాలుగా చిత్రితమైన చాలా విషయాలు వాస్తవానికి కెజువో తల్లితండ్రుల అనుభవాలేనంటారు.

1986లో కెజువో తన రెండో నవల ‘తేలుతున్న ప్రపంచంలో మునుగుతున్న చిత్రకారుడు’ రాశారు. మసూజీ ఓనో అనే వృద్ధ చిత్రకారుడి ఉత్తమ పురుష కథనంగా ఈ నవలను రాశారు కెజువో. టోజో నియంతృత్వానికి చెక్కభజన చేసేందుకే తన కళను వినియోగించిన గతం మసూజీది. ఆ రోజుల్లో గొప్ప చిత్రకారుడిగా ఓ వెలుగు వెలిగిన మసూజీ, తర్వాతి రోజుల్లో అప్రతిష్ఠ పాలవుతాడు. ఆ విషయమే తలచుకుని బాధపడుతుంటాడు మసూజీ. ఈ వృద్ధ చిత్రకారుడు చివరికి సమాధానపడి, టై కట్టుకుని కూలిపని చేసుకునే ఆధునిక కార్మికులను గౌరవించి, తప్పుకున్నట్లు చిత్రిస్తూ ఈ నవలను ముగించాడు కెజువో.

మొత్తం మీద, కెజువో నాలుగుసార్లు బుకర్‌ బహుమతి కోసం నామినేట్‌ అయినప్పటికీ ఒక్కసారి మాత్రమే ప్రైజు పొందారు. 1989లో వెలువడిన ‘పగళ్ళ మిగుళ్ళు‘ అనే నవలకే కెజువో బుకర్‌ ప్రైజ్‌ గెల్చుకున్నారు. 1930 దశకం నాటి ఓ ప్రేమపురాణాన్ని– అదేకాలంలో ఆసియన్‌ దేశాల్లో వ్యాపించిన బ్రిటిష్‌ ప్రభుభక్తి గాథనూ పడుగుపేకలుగా అల్లిన యాత్రాచరిత్ర ఈ నవల. కథానాయకుడు స్టీవె¯Œ ్స అనే జపనీస్‌ బట్లరు. చివరికి, అటు ప్రేమపురాణం వల్ల కానీ, ఇటు బ్రిటిష్‌ ప్రభుభక్తివల్ల గానీ మన బట్లరు దొర బావుకున్నదేమీ లేదని తేల్చి, 1950 దశకంలో కథ ముగిస్తాడు కెజువో. సల్మాన్‌ రష్డీతో సహా, ఎందరో ప్రముఖులు ఈ నవలను కెజువో సాధించిన పరిణతికి నిదర్శనంగా ఎంచారు.

కెజువో నవలల్లో, ప్రయోగాత్మక రచన ‘నెవర్‌ లెట్‌ మి గో‘ (నన్నెన్నడూ పోనియ్యకు!) అంటారు విమర్శకులు. 1990 దశకంలో పాశ్చాత్య దేశాల్లో విశేషంగా చర్చకు వచ్చిన విషయాల్లో ‘ఆర్గన్‌ హార్వెస్టింగ్‌‘ ఒకటి. కోరుకున్న మొక్కలను అంటుకట్టడం– లేదా ఆయా మొక్కల జన్యు కణ ప్రతిరూపాలను వేరే మొక్కల్లో పెంచడం లాంటిదే ‘ఆర్గన్‌ హార్వెస్టింగ్‌‘ కూడా. లోపభూయిష్ఠమైన అవయవాలకు జన్యు ప్రతిరూపాలను రూపొందించి, వాటిని వేరే శరీరాల్లో ‘పెంచుతారు.‘ మూల వ్యక్తులకు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేసి అవయవాల మార్పిడి చేస్తారు. ఈ ప్రక్రియనే ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలే ‘నెవర్‌ లెట్‌ మి గో‘. 2005లో ఈ నవలకు ఆర్థర్‌ క్లార్క్‌ పురస్కారం దక్కింది. వివాదాస్పదమైన ఇలాంటి అంశాలపై రాసే నవలలు దూషణభూషణలు రెండింటినీ స్వీకరించక తప్పదు కదా!

‘ఈ ప్రపంచంతో మనకు ఉందనుకునే కల్పిత సంబంధానికి అట్టడుగున ఉన్న అధోలోకం పైన మూతను తొలగించిన రచయిత’గా కెజువో ఇషిగురాను అభివర్ణించింది స్వీడిష్‌ ఎకాడెమీ. 2017లో నోబెల్‌ సాహిత్య పురస్కారం గురించిన ప్రకటనలో సారా డేనియస్‌ చెప్పిన మాటలివి. అవి అక్షర సత్యాలు!

- మందలపర్తి కిషోర్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)