ఇది YS జగన్ విజన్.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 'ది డెక్'
Breaking News
కన్నీళ్లకే కన్నీరొచ్చె..
Published on Wed, 09/17/2025 - 16:49
ఈ ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది ఇదో విషాద సందర్భమని. స్నేహితుడి లాంటి భర్తకు చివరిసారిగా భార్య కన్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘట్టమిది. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పెనిమిటి చివరి చూపు కోసం స్ట్రెచర్‌పై వచ్చింది ఆమె. మరో స్ట్రెచర్‌పై నిర్జీవంగా ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వరకు తనతో ఎంతో సంతోషంగా గడిపిన భర్త.. శాశ్వతంగా తిరిగిరాడన్న బాధతో ఆమె పడిన వేదనకు అక్కడున్నారంతా కదిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్పత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘట్టానికి వేదికయింది.
ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్యక్రియలు మంగళవారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘటనలో ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి చిక్సిత పొందుతున్నారు. అంత్యక్రియలకు ముందు నవజ్యోత్ పార్థీవదేహాన్ని చివరి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచర్‌పై నుంచే తన చేతులతో భర్త ముఖాన్ని తడిమి కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పింది. తన కొడులిద్దరి పుట్టినరోజు నాడే భర్తకు చివరి వీడ్కోలు చెప్పాల్సిరావడంతో ఆమె బాధ వర్ణణాతీతం.

గురుద్వారా, లంచ్.. విషాదం
టీచర్‌గా పనిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) తన భర్తతో కలిసి బైకుపై ఆదివారం బయటకు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన తర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్‌లో భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రతాప్ నగర్‌లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నవజ్యోత్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే దగ్గరలో కాకుండా 19 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి తీసుకెళ్లడంతోనే తన భర్త మరణించారని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణించి జీటీబీ నగర్‌లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వీరిని తరలించారు.
అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు
కొడుకు మరణంతో నవజ్యోత్ తల్లి గుర్పాల్ కౌర్ శోకసంద్రంలో ముగినిపోయారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కోడలు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆస్పత్రిలో ఉందని వాపోయారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికివుండేవారని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. తన తల్లికి కూడా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు చెప్పారని, హెల్మెట్ (Helmet) ధరించినప్పటికీ తలకు గాయమైందని బాధ పడ్డాడు.
కొడుకుల పుట్టినరోజు నాడే..
నవజ్యోత్ సింగ్ (52) మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి లోటని సహోద్యోగులు అన్నారు. ఆయన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడే నవజ్యోత్ అంత్యక్రియలు జరపాల్సి రావడం విషాదమని ఆవేదన చెందారు. నవజ్యోత్ అంత్యక్రియలు మంగళవారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమయాత్రలో నవజ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు పాల్గొన్నారు.

కావాలని చేయలేదు..
నిర్లక్ష్యంగా కారు నడిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మరణానికి కారణమైన నిందితురాలు గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వారిద్దరి పిల్లలు కూడా కారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామని.. ప్రమాదంలో కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తాను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిపోయిందని పోలీసులతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురయ్యానని, అందుకే తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కోవిడ్ సమయంలో తన పిల్లలు అక్కడే చికిత్స పొందారని తెలిపారు.
చదవండి: టికెట్ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త రిజర్వేషన్ విధానం
ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్‌లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్‌ను బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్దరు పిల్లలు, పనిమనిషి ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్‌ప్రీత్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేశారు.
Tags : 1