Breaking News

ఇంటిని నడిపే ఆమెకు నడుము నొప్పి..!

Published on Tue, 09/16/2025 - 10:40

ఈ రోజుల్లో నడుమునొప్పి సాధారణంగా కనిపించే సమస్య.అయితే మహిళల్లో రోజువారీ పనుల వల్ల నడుమునొప్పివచ్చే అవకాశాలు మరింత ఎక్కువ.ఉదాహరణకు వాళ్లు రోజంతా నిలబడి వంట చేయడం లేదా బట్టలు ఉతకడం లేదా రొట్టెల కర్ర (బేలన్‌)తో రోటీలు తయారు చేయడం నడుమును చాలాసేపు అదేపనిగా ముందుకు వంచి ఆ పనులు చేయాల్సి రావడం వంటి కారణాలతో వారిలో నడుమునొప్పి ముప్పు మరింత ఎక్కువ. దీనికితోడు మహిళల్లో ప్రతి నెలా రుతుస్రావం నొప్పి వారి నడుము నొప్పిని మరింతప్రభావితం చేస్తుంది. ఇలాంటి అనేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళల్లో కాస్త ఎక్కువగానే కనిపించే నడుము నొప్పులు, వాటికి కారణాలూ, వాటి పరిష్కారా
లేమిటో తెలుసుకుందాం...

పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు కాస్త ప్రత్యేకంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయి. ఈ హార్మోన్లు సైతం  వాళ్లలో నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్‌ఫ్లమేషన్‌ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుందనే అంశం కూడా ఇందుకు మరో కారణం. 

ఈ కారణం వల్లనే... పురుషుల్లో మహిళల్లో ఒకేలాంటి నొప్పి వస్తున్నప్పటికీ... మహిళల్లో ఆ నొప్పి తాలూకు తీవ్రత కాస్తంత ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా మహిళల్లో హార్మోన్లు, వారికే ప్రత్యేకమైన కొన్ని జన్యువులు, వారి మనస్తత్వం, నొప్పిని తెలిపే వ్యవస్థ వంటి అంశాలను  పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుమునొప్పి తీవ్రత పురుషుల్లో కంటే ఎక్కువే.

వైద్యపరమైన కారణాలతో నడుము నొప్పుల్లో కొన్ని...

టెయిల్‌బోన్‌ పెయిన్‌ : మనం కుదురుగా కూర్చున్నప్పుడు సరిగ్గా మన నడుము కింద... పిరుదుల మధ్యగా కాస్తంత పైభాగంలో నొప్పి వస్తుంటే దాన్ని ‘టెయిల్‌బోన్‌ పెయిన్‌’గా చెప్పవచ్చు. అంటే ఇది సరిగ్గా వెన్నుపూసల్లోని చివరి ఎముక దగ్గర వచ్చే నొప్పి. వైద్యపరిభాషలో దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు.  పురుషులతో ΄ోలిస్తే ఇది మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో΄ాటు మహిళల్లో గర్భధారణ అంశం కాక్సిడైనియా ముప్పును మరింత పెంచుతుంది. అందుకే పురుషల కంటే మహిళల్లో ఇది ఎక్కువ.

ఆస్టియోఆర్థరైటిస్‌ : ఇది కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి. రెండు ఎముకలు కలిసే జాయింట్లలోని ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. నడుముభాగంలోని ఎముకల అరుగుదల కారణంగా ఈ తరహా నడుమునొప్పి వస్తుంది. ఇదే తరహాలో  మోకాలు, తుంటి భాగంలో కీళ్లు (జాయింట్లు) అరిగినప్పుడు వచ్చే నొప్పిలాగే నడుము ప్రాంతంలోని ఈ నొప్పి వస్తుంటుంది.

శాక్రో ఇలియాక్‌ జాయింట్‌ సమస్యలు : శాక్రమ్, ఇలియాక్‌ అనే ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్‌ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్‌)ను తుంటితో కలుపుతూ... ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కొద్దిగా విస్తరించినట్లుగా ఉంటాయి. ఈ భాగంలో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం పాకుతున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. మహిళల్లో గర్భధారణ అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. దాంతో ఈ తరహా నొప్పి మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.

కంప్రెషర్‌ ఫ్రాక్చర్‌ : ఇది వెన్నెముకల్లోని వెన్నుపూసల్లో ఏదైనా ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి.  అనేక వెన్నుపూసలు (అంటే వెన్నులోని చిన్న చిన్న ఎముకలు) కలుస్తూ చక్కగా అమరి΄ోతూ... ‘ఎస్‌’ ఆకృతిలో ఒకే ఎముకలా  కనిపించే వెన్నెముక ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఆస్టియో΄ోరోసిస్‌గా లేదా ఇతరత్రా ఏదైనా కారణం వల్ల ఈ వెన్నపూసల్లోని ఏదైనా ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఇలా జరగడాన్ని కంప్రెషర్‌ ఫ్రాక్చర్‌ అంటారు. ఈ కంప్రెషన్‌ ఫ్రాక్చర్స్‌కు స్త్రీ, పురుషులిరువురిలోనూ అవకాశమున్నప్పటికీ... పురుషుల్లో కంటే మహిళల్లో ఇవి రెండు రెట్లు ఎక్కువ.

ఫైబ్రోమయాల్జియా : కండరాల్లో నొప్పుల కారణంగా వచ్చే ఈ తరహా నొప్పి వెన్ను కింది భాగంతో ΄ాటు పైభాగంలో కూడా కనిపించవచ్చు లేదా నడుము భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా మహిళ్లోనే ఎక్కువ. పురుషులతో ΄ోలిస్తే మహిళల్లో కనిపించే యాంగై్జటీ ఈ నొప్పులకు కారణమవుతుంటుంది.

నివారణ / చికిత్స...
నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ కారణంగా  వస్తున్నదో తెలుసుకోవాలి. ఆ నిర్దిష్టమైన కారణాన్ని బట్టి, దానికి అవసరమైన నిర్దిష్టమైన చికిత్స అందించడం లేదా తొలిదశల్లో నివారణ మార్గాలను అనుసరించడం ద్వారా నడుమునొప్పి నుంచి దూరం కావచ్చు. అవి... 

ఫిజియోథెరపిస్ట్‌ సహాయంతో అవసరమైన వ్యాయామాలు చేయడం 

తొలిదశల్లో (ఇంటర్‌ఫెరెన్షియల్‌ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. 

టెన్స్‌ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్‌’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్‌ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్‌ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. దాంతో తగిన ఉపశమనం కలుగుతుంది. (అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్‌ అమర్చిన వాళ్లకు టెన్స్‌ చికిత్స ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి). 

తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్‌ కిల్లర్స్‌) అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. నడుమునొప్పి లేదా వెన్ను నొప్పి లేదా మెడనొప్పి లాంటి  సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడటాన్ని పూర్తిస్థాయి చికిత్సగా పరిగణించకూడదు. పైగా నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపవచ్చు. 

అందునా మరీ ముఖ్యంగా కాలేయంతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే నడుమునొప్పి లాంటివి వస్తున్నప్పుడు రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్‌ మెడిసిన్స్‌) వాడటం మేలు. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్‌ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో  మసాజ్‌లు చేయడం మంచిదే. 

మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్‌ ప్రెషర్‌ వంటివి చేస్తుంటారు. అలా నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా అక్కడి కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే  తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

పై మార్గాలతో అంతగా గుణం కనిపించనప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్‌ సర్జన్ల సహాయంతో అవసరమైన శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించే అవకాశముంది.

పోష్చర్‌ పరంగా... 
పక్కలకు అకస్మాత్తుగా ఒంగడం లేదా ఒక పక్క బరువును అపసవ్యంగా మోయడం వల్ల : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల వంటి బరువులు ఎత్తే సమయంలో, లేదా పిల్లలను అలాగే బిందెలను కూడా ఒకవైపున చంకలో మోసే సమయంలో నడుముఒంపు మీద బరువు ఆనించి చాలాసేపు అదేపనిగా నడవడం, బరువు మోస్తుండటం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చాలాసేపు అవసవ్య భంగిమలో, అందునా బరువు మోస్తూ ఉండటం వంటి అంశాలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. 

అలాగే ఇల్లు తుడిచే సమయంలో కొందరు కింద కూర్చొని తడిగుడ్డతో ఫ్లోర్‌ తుడుస్తుంటారు. దీనివల్ల తరచూ కూర్చోవడం,  లేవడం వంటి పనులతోనూ అలాగే కొన్నిసార్లు అదేపనిగా నడుము ఒంచి ఒకేభంగిమలో చాలాసేపు ఉండటం వంటివి చేస్తుంటారు. ఫలితంగా నడుము నొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో లాంగ్‌ హ్యాండిల్‌ మాప్‌లు వాడుతూ నిటారుగా నిలబడే వాటిని వాడుతూ ఫ్లోర్‌లు తుడవటం లాంటి జాగ్రత్తలతో నడుమునొప్పిని నివారించుకోవచ్చు. 

ఇక వారు అనేక పనుల్లో భాగంగా అకస్మాత్తుగా ముందుకు వంగాల్సిరావడం లేదా పక్కలకు తిరగాల్సిరావడం, ఏవైనా బరువులు ఎత్తేందుకు గబుక్కున ముందుకు ఒంగడం లాంటివి చేస్తుంటారు. ఈ అంశాలు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. వారు ఏదైనా బరువును (అంటే... బిందె,  కుండ లేదా బస్తాల వంటి బరువులు) ఎత్తే సమయంలో ముందుకు ఒంగి కాకుండా...మెల్లగా కూర్చొని నెమ్మదిగా ఎత్తుకోవడం మేలు. ఇక ఆఫీసుల్లో పనిచేసే చోట్ల మహిళల్లో ముందుకు వంగి కంప్యూటర్‌లోకి  చూస్తుండటం వల్ల కూడా  నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్‌ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచడం మంచిది.

చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి... 
కొన్ని వృత్తుల్లో ఉండేవారు ఉదాహరణకు ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే మహిళా పోలీసులు, బస్‌ కండక్టర్లు, షాపుల్లో పనిచేసే సేల్స్‌ గర్ల్స్‌ అదేపనిగా చాలాసేపు  నిలబడే ఉంటారు. ఒక్కోసారి దాదాపు ఐదారు గంటల పాటు కూడా వారు  నిలబడే ఉండాల్సి రావచ్చు. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతోపాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్‌ డిజార్డర్స్‌’ వంటివి వచ్చే అవకాశాలెక్కువ. 

అలాగే చాలాసేపు నిలబడి ఉండటం వల్ల వచ్చే స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్‌) వంటివీ రావచ్చు. ఒక్కోసారి  నడుమునొప్పితోపాటు ఈ క్రాంప్స్‌ వంటివి వచ్చినప్పుడు వాళ్ల  పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత సేపు బ్రేక్‌ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. కొంతసేపు కూర్చొని వచ్చి మళ్లీ నిలబడి తమ వృత్తిని / పనులను  కొనసాగించాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా చాలాసేపు నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో తరచూ కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. ఒక వంట వండుతూ ఉండే సమయాల్లో కూడా మహిళలు వంట ప్లాట్‌ఫారమ్‌ దగ్గర చాలాసేపు నిలబడే ఉండాల్సి వస్తుంటుంది. 

ఇలాంటి సమయాల్లో వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌ అమర్చుకోవడం, అప్పుడప్పుడూ  కూర్చోడానికి ఎత్తైన లాంగ్‌ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్‌ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండేలా చూసుకుంటూ, కూర్చున్నప్పుడు మీ కాళ్లు ఆ అడ్డుపట్టీలపైన ఉండేలా చూసుకుంటే నడుముపై భారం తగ్గి నడుమునొప్పి నివారించడానికి ఆ అంశాలు తోడ్పడుతుంటాయి.  

నడుమునొప్పిని నివారించే ఆహారం... 
చాలామందికి తెలియని విషయం, ఆశ్చర్యం కలిగించే సంగతేమిటంటే... వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతోపాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎముక సాంద్రత తగ్గకుండా చేయడం ద్వారా నడుమునొప్పి రాకుండా చేస్తుంది. ఇందుకు మీ ఆహారంలో ఉండాల్సిన పోషకాలు ఏమిటంటే... 

కాల్షియమ్‌: కాల్షియమ్‌ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పాల ఉత్పాదనలైన పెరుగు, వెన్నతోపాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్‌ ఎక్కువ. 

విటమిన్‌ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్‌ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్‌–డి బాగా సహాయపడుతుంది. స్వాభావికమైన ఎండ (నేచురల్‌ సన్‌లైట్‌)తోపాటు సాల్మన్‌ వంటి చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌–సి : చిగురు ఎముకలో ఉండే కొలాజెన్‌ వంటివి ఏర్పరచడంలోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కా΄ాడటంలో విటమిన్‌–సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల నిమ్మజాతి పండ్లతోపాటు టొమాటో, కాప్పికమ్‌ వంటి కూరల్లో ఇది ఎక్కువ. 

అలాగే గాయాలను మాన్పడం, ఏవైనా గాయాలైనప్పుడు దెబ్బతినే భాగాలను సత్వరం రిపేర్‌ చేయడానికి ప్రోటీన్లు చాలా అవసరం. మాంసాహారం, పప్పులలో ప్రోటీన్లు ఎక్కువ. 

విటమిన్‌–బి12 : మన శరీరంలోని ఎముకలను నిర్మించే కణాల రూపకల్పనకు విటమిన్‌ బి12 చాలా అవసరం. అన్ని రకాల చేపలు, మాంసంతోపాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్‌–బి 12 ΄ాళ్లు ఎక్కువ.

డ్రైవింగ్‌ – నడుమునొప్పి...
వాహనాలు నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే చాలామందిలో కొంతకాలం తర్వాత నడుము నొప్పి రావడం  చాలా సాధారణంగా కనిపించే అంశం. చాలాకాలం పాటు వాహనం నడిపేవారిలో వెన్నెముక కారు సీటుకు అనుగుణంగా అలా నిర్దిష్టమై ఒంపులా  ఒంగి ఉండటంతో వెన్నెముకలోని వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. అదీగాక వాహనం నడిపే సమయంలో కలిగే కుదుపుల వల్ల ఈ వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. 

దాంతో చాలాకాలంపాటు వాహనాలు నడిపేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశాలెక్కువ. కార్స్‌ లేదా ఇతరత్రా ఫోర్‌వీలర్స్‌ విషయంలో నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలను చూద్దాం. ఇటీవల కొన్ని కార్లలోని పైకప్పు (రూఫ్‌) చాలా కిందికి ఉంటోంది. అలాగే డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చునేవారి సౌకర్యం కోసం సీట్‌ను వెనకవైపునకు బాగా కిందికి దిగి ఉంచేలా చేస్తారు. డ్రైవింగ్‌ చేసేవారు తమ  కాళ్లను తగినంతగా చాపి ఉంచేలా చూసుకోవడం కోసం సీట్‌ను వెనక్కి వాలేలా చూస్తారు. 

దాంతో డ్రైవింగ్‌ సీటులో నిటారుగా కూర్చోవడమన్నది దాదాపుగా  జరగదు. ఫలితంగా వెన్ను మీద ప్రత్యేకంగా నడుము మీద ఒత్తిడి చాలా ఎక్కువ. ఇలా సీట్‌ను వెనక్కు వంచినప్పుడు మళ్లీ కారు ముందరిభాగంలో స్పష్టంగా చూడటం కోసం మెడను ముందుకు వంచడంతో మెడ 20 డిగ్రీలు ముందుకు వస్తుంది. దాంతో నడుము అంతా ఒక భంగిమలోనూ, మెడ మరో భంగిమలో ఒంగుతాయి. ఈ అపసవ్యతల కారణంగా డ్రైవింగ్‌ చేసేవారిలో  చాలా తరచుగా వెన్ను నొప్పి / నడుమునొప్పి వస్తుంటాయి.  

కార్‌ డ్రైవింగ్‌తో వచ్చే నడుము నొప్పి నివారణకు సూచనలు:
మీ తొడలకు సీట్‌ సపోర్ట్‌ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే తొడల నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పైనే ఉండేలా చూసుకోవాలి 

బ్రేక్, క్లచ్‌ వంటివి మీ కాళ్లు ఆనే చోటికి మరీ దూరంగా ఉండేలా కూర్చోవడం సరికాదు. అవి సరిగ్గా కాళ్ల చివరలో అందుబాటులో ఉండాలి 

మీ కాళ్ల పోడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి 

మీ ఎత్తుకు అనుగుణంగా సీట్‌ ఎత్తును అడ్జెస్ట్‌ చేసుకోవాలి ∙మీ సీట్‌ను వీలైనంత మేరకు నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్‌ వంచాలి. ఆ సీట్‌ ఒంపు ఎంత అవసరం అంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా సౌకర్యంగా ఉండాలి 

మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్‌) భాగంలో ఒక కుషన్‌ ఉంచుకోవాలి. ఆ లంబార్‌ సపోర్ట్‌ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్‌ ఉండాలి.

సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్‌ కాస్త మారుస్తూ ఉండాలి ∙అదేపనిగా డ్రైవ్‌ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్‌ తీసుకుంటూ ఉండాలి ∙ఇక డ్రైవ్‌ చేస్తున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడమన్నది అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. 

మోటార్‌ సైకిల్‌ విషయంలో... 
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బైక్‌లు నడిపే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ.  సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్‌ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలుగానీ నొప్పులుగానీ రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు  సరైన ప్రమాణాలు లేక΄ోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్‌ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. 

బైక్‌ల హ్యాండిల్స్‌ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులతో సౌకర్యంగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో ముఖ్యంగా నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ 

మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు 

బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ ముందుకు వాలినట్టుగా ఉండేలా అమరి ఉంటాయి. దాంతో బాగా ముందుకు  వాలిపోతునట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. 

ఇలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ 

బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌ప్యాక్స్‌ / ల్యాప్‌టప్‌ బ్యాగ్స్‌) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. అందువల్ల ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి.  

మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి దూరం  కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. 
డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి, సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌    

(చదవండి: Shubhanshu Shukla: స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్‌నెస్‌ను ఎలా నిర్వహిస్తారంటే..! )                                   

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే