Breaking News

ఐఎంగా ఏఆర్‌సీఎఫ్‌!

Published on Sat, 02/14/2026 - 22:29

ఢిల్లీలోని తీహార్‌ జైలులో మసూద్‌ అజర్, ఒమర్‌ షేక్, అహ్మద్‌ జర్గర్‌లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్‌ అన్సారీ, ఆసిఫ్‌ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్‌ అధినేత పార్థ్‌ ప్రతిమ్‌ రాయ్‌ బర్మన్‌ సహా పలువురిని కిడ్నాప్‌ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్‌ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్‌ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 

2001లో ఆసిఫ్‌ రజా ఎన్‌కౌంటర్‌ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్‌... ఐఎంగా ఎలా మారిందంటే..!

కోల్‌కతాకు చెందిన కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్‌ పెద్ద కొడుకు ఆసిఫ్‌ రజా ఖాన్‌ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్‌ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. 

హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్‌ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్‌ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్‌ సలీం కూడా హాజరయ్యాడు. 

ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్‌గఢ్‌ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్‌ సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ (2007 నాటి హైదరాబాద్‌ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్‌ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్‌ సలీంతో సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. 

సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్‌ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్‌ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్‌ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్‌ మెయిల్‌ ఐడీని ఆసిఫ్‌ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్‌ పంపిన ఆసిఫ్‌– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. 

చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్‌ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్‌... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్‌ చేరిన మసూద్‌ అజర్‌ జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్‌ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్‌ గ్యాంగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. 

2001 అక్టోబర్‌ 29న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్‌ రజా ఖాన్‌ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్‌ పరేఖ్, పరేష్‌ షా కిడ్నాప్‌ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్‌ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్‌ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్‌ రజా ఖాన్‌ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్‌ కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. 

ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్‌ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్‌ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్‌ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్‌ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్‌ ఔట్‌ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్‌ రజా ఖాన్‌ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్‌ మరణించాడు.

ఆసిఫ్‌ మృతితో అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్‌ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్‌ కోల్‌కతాలోని అమెరికన్‌ కాన్సులేట్‌ సమీపంలోని యునైటెడ్‌ స్టేట్స్‌ గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌పై (యూఎస్‌ఐఎస్‌) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్‌ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. 

ఇలాంటి దాడులతో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అమీర్‌ రజా ఖాన్‌ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్‌ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్‌ రజా ఖాన్‌ 2003లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. 

అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!
2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్‌ ముజాహిదీన్‌ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌–లుంబినీ పార్క్‌ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్‌–4 ‘అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!’ వచ్చేవారం.

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )