Breaking News

సభాపర్వం నిరాశాజనకం

Published on Sat, 02/07/2026 - 03:48

‘మీ స్వరాన్ని పెంచకండి... చట్టసభల్లో మెరుగుపరుచుకోవాల్సింది మీ వాదనను మాత్రమే’ అన్నారు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా హక్కుల యోధుడు డెస్మండ్‌ టుటు. దేశంలో చట్టసభల తీరుతెన్నులు చూస్తున్నవారికి ఎప్పుడూ ఖేదమే మిగులుతోంది. చట్టసభల పేరుచెబితే వాగ్యుద్ధాలూ, వాకౌట్లూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పటిలాగే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కూడా ఆ ధోరణిలోనే సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు లోపలే కాదు, వెలుపల కూడా ఆధిక్యతా ప్రదర్శన కనబడుతోంది. 

కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు, అధికార విపక్షాలు ప్రత్యర్థుల్లాకాక శత్రుపక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. చివరకు ఎక్కడివరకూ పోయిందంటే... కాంగ్రెస్‌ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవాంఛ నీయ చర్యకు పాల్పడే అవకాశం ఉందంటూ తనకు సమాచారం అందటంతో ఆయన్ను సభకు రావొద్దంటూ తానే సూచించానని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్‌ వాదన. నిజానిజాల సంగతలా ఉంచి లోక్‌సభ స్పీకర్‌ ప్రధానిని సభకు రావద్దని సూచించటం ఊహకందనిది. ఇలాంటి పరిణామాలు ప్రపంచం దృష్టిలో మన ప్రజాస్వామ్యాన్ని పలచబారుస్తాయి. 

కాంగ్రెస్‌ తీరుచూస్తే సభను సాగనివ్వకపోవటమే దాని ఏకైక వ్యూహంగా కనబడు తోంది. దీనిద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం పంపదల్చుకున్నదోగానీ, కీలకమైన బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. పద్దులు గిలెటిన్‌ అవుతున్నాయి. పాలక పక్షం పని సులభమవుతోంది. సభలో మెజారిటీయే దేన్నయినా నిర్ణయిస్తుంది. విపక్షాలు దాన్ని అడ్డుకోలేవు. క

నీసం అర్థవంత మైన చర్చంటూ జరిగితే ఎలాంటి బిల్లులు వస్తున్నాయో, వాటి లోటుపాట్లేమిటో,అందువల్ల కలిగే పరిణామాలేమిటో సామాన్యులు అర్థం చేసుకునే వీలుంటుంది. తమ వ్యూహం సామాన్య పౌరులకు ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్నదని కాంగ్రెస్‌ గ్రహించటం లేదు. యూపీఏ హయాంలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. దాన్నే తామూ ప్రయోగించి పైచేయి సాధించాలని చూడటం ద్వారా కాంగ్రెస్‌ ఆశిస్తున్న ప్రయోజనమేమిటో అర్థంకాదు. 

తోచింది చేసుకుంటూ పోవటం, జరిగే ఘటనలపై అప్పటికప్పుడు అనాలోచితంగా స్పందించటం తప్ప కాంగ్రెస్‌కు పకడ్బందీ వ్యూహం ఉన్నట్టు కనబడదు. బుధవారం పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్‌ బిట్టూతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జగడం నివారించదగింది. బిట్టూ అక్కడ ధర్నాకు కూర్చున్న కాంగ్రెస్‌ ఎంపీలనుద్దేశించి అవహేళనగా వ్యాఖ్యానించి ఉండొచ్చు. కానీ అవి యథాలాపంగా అన్న మాటలు కాదు. 

ఇరుపక్షాల మధ్యా యుద్ధం సాగుతున్న వేళ వ్యూహాత్మకంగా మాట్లాడినవి. రాహుల్‌ గాంధీ ఆయన్ను కాస్తా ద్రోహి అంటూ నిందించటం ద్వారా బీజేపీకి పదునైన ఆయుధం ఇచ్చారు. పార్టీ మారటం ద్రోహమైతే, అలాంటివారు కాంగ్రెస్‌లో లేరా? అసలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి పట్ల అధినేతలుగా తాము చేసిన, చేస్తున్న ద్రోహం మాటేమిటి? అవసరార్థం పక్క పార్టీలతో కుమ్మక్కవుతూ మొత్తంగా పార్టీలో ఉన్నవారందరికీ చేస్తున్న ద్రోహమెంత? రాహుల్‌గాంధీ ఆలోచించారా? పరిస్థితులు మళ్లీ చక్కబడితే బిట్టూ లాంటివారు తిరిగి కాంగ్రెస్‌ లోకి రారనీ, రాహుల్‌ తీసుకోబోరనీ ఎవరైనా చెప్పగలరా?

ఎందుకో ఈసారి పార్లమెంటులోనూ, వెలుపలా ‘పుస్తక ప్రదర్శన’ జరిగింది. చైనా నుంచి ముప్పు ముంచుకొస్తున్నవేళ బాధ్యతంతా రాజకీయ నాయకత్వం అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణేపై వదిలేసి, చేతులు దులుపుకొన్నదని రాహుల్‌ ఆరోపించారు. జనరల్‌ నరవణే పుస్తక సారాంశాన్ని సభలో చెబుతానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అన్నారు. దీనికి పోటీగా బీజేపీ సభ్యులు సభలో పుస్తకాలు ప్రదర్శించారు. 

ఈ దఫా పుస్తకాల ప్రస్తావన రావటం బాగున్నా, వాటిని ప్రదర్శించటంతో సరిపెట్టక ఇరుపక్షాలవారూ ఎవరికివారు చదువుకోవాలి. అప్పుడు మన చట్టసభల తీరు ఇంత అధ్వాన్నంగా అయితే ఉండదు. కనీసం సభల నిర్వహణకయ్యే వ్యయాన్నయినా దృష్టిలో ఉంచుకుని సమావేశాలను వృథా కానీయరాదని రెండు పక్షాలూ గ్రహించటం అవసరం.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)