Breaking News

జగన్‌ వర్సెస్‌ డర్టీ డజన్‌!

Published on Sun, 02/22/2026 - 00:30

ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్‌ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!

అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్‌సిక్స్‌’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.

ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్‌ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్‌ ఫర్‌ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌’ (ఏడీఆర్‌)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్‌ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.

‘ఓట్‌ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్‌ గాంధీ కూడా వీఎఫ్‌డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్‌ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్‌ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్‌ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.

వీఎఫ్‌డీ వెలికి తీసిన పోలింగ్‌ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్‌ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్‌’ అనే స్వతంత్ర వెబ్‌సైట్‌కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ అదే వెబ్‌సైట్‌ కోసం పరకాల ప్రభాకర్‌ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్‌ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.

పరకాల ప్రభాకర్‌ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్‌ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్‌ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్‌లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్‌ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్‌గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్‌ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.

రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్‌ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్‌ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్‌లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!

ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్‌ జరిగిన 3500 పోలింగ్‌ బూత్‌లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్‌లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్‌లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్‌ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్‌ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.



ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. 

సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్‌ రేట్‌ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.

తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్‌ మోహన్‌రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్‌ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్‌ నెంబర్‌ వన్‌ – జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్‌గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్‌కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.

ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్‌కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్‌’ కాంపౌండ్‌లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్‌’ పేలుళ్లు వినబడుతున్నాయి.

జగన్‌ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్‌ సోషల్‌ మీడియా, ఒక పేటీఎమ్‌ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్‌మోహన్‌ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్‌ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్‌ ప్రెస్‌మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)