Breaking News

వాట్సప్‌ జానపదం

Published on Mon, 07/06/2026 - 00:04

‘తోడేలు వచ్చింది’ అని అరిచిన కుర్రాడి కథ మనకు తెలుసు. ఆ అబద్ధం మొదటిసారి ఊరిని నవ్వించింది. రెండోసారి ఊరికి అలవాటు అయ్యింది. మూడోసారి నిజంగానే తోడేలు వచ్చినప్పుడు ఊరు నిద్రపోయింది. గొర్రెలు పోయాయి. కుర్రాడి మాటకు శాశ్వతంగా విలువ పోయింది. అది జానపదం మనకు నేర్పిన మొదటి పాఠం. అబద్ధానికి కాళ్లు ఉండవు. ఉన్నా ఎక్కువ దూరం నడవవు. కానీ, ఈరోజు ఆ కుర్రాడు మనలోని ప్రతిఒక్కరి జేబులో ఉన్నాడు. ప్రతి గ్రూపులో ఉన్నాడు. ప్రతి ఫార్వర్డ్‌లో ఉన్నాడు. వాట్సాప్‌ ఇప్పుడు కొత్త జానపద వేదిక అయింది. కానీ ఇక్కడున్నది అమ్మమ్మ చెప్పిన కమ్మని కథ కాదు. ఇది భయం కథ, ద్వేషం కథ, అనుమానం కథ. చదివిన వెంటనే గుండె కొట్టుకునేలా చేసి చివర్లో ‘పదిమందికి పంపు’ అని ఆజ్ఞాపించే బెదిరింపు కథ. ఇది జానపదం కాదు, అబద్ధాల జానపదం.

మనం సులభాన్ని ఎంచుకున్నాం. ఫలితంగా మన మెదడు అనే కండరం క్షీణించి పోతోంది. ఏది పడితే అది నమ్మే బలహీనమైన మనస్తత్త్వంగా కుంగిపోతోంది. అబద్ధాలతో భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నించనివాడు బానిస అవుతాడు. ఒకప్పటి జానపదం ‘భయపడకు... చివరికి మంచే గెలుస్తుంది’ అని ధైర్యం చెప్పేది. ఈ కొత్త జానపదం ‘భయపడు... నువ్వు ఒంటరివి’ అని విషం ఎక్కిస్తోంది. దీంతోపాటు డిజిటల్‌ ప్రపంచంలో గుర్తింపు కోసం ఆరాటపడే మానసిక పేదల బెడద ఒకటి. నిజజీవితంలో కనీసం మాట విననివాడు గ్రూపులో అడ్మిన్‌  కావాలని చూస్తున్నాడు. ‘నేను అందరికంటే ముందు పంపాను’ అనే చిన్న కామెంట్‌ కోసం ఆత్మను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడ సత్యం కంటే స్పందన (రియాక్షన్‌) ముఖ్యం అయింది. ఒక అబద్ధం పదివేల లైక్స్‌ తెస్తే ఒక నిజం పది లైక్స్‌కు కూడా నోచుకోవడం లేదు. మనం సంఖ్యలకు అలవాటు పడ్డాం. ఆత్మగౌరవాన్ని సోషల్‌ మీడియా మెట్రిక్స్‌కు అమ్మేశాం.

‘అబద్ధాలకోరుకు శిక్ష ఏమిటంటే అతను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు’ అని ఆఫ్రికా సామెత. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగిరాదు. అదే పడాల్సిన శిక్ష. కానీ శిక్ష అక్కడితో ఆగడం లేదు. ఈ అబద్ధాల జానపదంలో నిత్యమునకలు వేసేవాడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. మొదట అనుమానం... తర్వాత కోపం... ఆ తర్వాత వాస్తవానికి క్రమంగా దూరమవుతాడు. ఆపై డాక్టర్‌ చెప్పినా, సైన్‌ ్స నిరూపించినా ‘వాట్సాప్‌లో వేరేగా ఉంది’ అని వాదించే మొండితనం హెచ్చురిల్లుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎందుకంటే మెదడు ఎప్పుడూ అలర్ట్‌ మోడ్‌లోనే ఉంటుంది. ఆఖరిగా నైతికత మొద్దుబారుతుంది. ‘అందరూ పంపుతున్నారు కదా’ అనే సమాధానం లోపలి గిల్ట్‌ను చంపేస్తుంది.

ఒకప్పటి జానపదం మనల్ని కలిపింది. ఒకే వెన్నెల్లో రాజు కొడుకు, రైతు కొడుకు కూర్చుని ఒకే కథ విన్నారు. ఒకే పాటకు కన్నీరు పెట్టుకున్నారు. అది సమానత్వ వేదిక. కానీ ఈ అబద్ధాల జానపదం మనల్ని చీలుస్తోంది. ఒకే ఇంట్లో తండ్రి ఒక గ్రూపు, కొడుకు ఒక గ్రూపుగా విడిపోతున్నారు. ఇద్దరూ వేర్వేరు అబద్ధాలు నమ్మి పరస్పరం శత్రువులు అవుతున్నారు. ఇంతకంటే పెద్ద మానసిక, సామాజిక పతనం ఇంకేముంటుంది? దీనికి పరిష్కారం వాట్సాప్‌ను పూర్తిగా చెరిపేయడం కాదు. మన వేలుకు మెదడును అతికించడం. ఒక మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేయడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం. 

భయం పుట్టించే ప్రచారాలను అక్కడికక్కడే బ్లాక్‌ చేయడం. లోకంలోని మంచిని స్వయంగా జానపదం చేయడం. మనిషి ఉన్నంత కాలం కథ ఉంటుంది. కథ ఉన్నంత కాలం మనిషి బతుకుతాడు. రాయి నుండి తాళపత్రానికి, తాళపత్రం నుండి పుస్తకానికి, పుస్తకం నుండి స్క్రీన్‌ కు వచ్చినట్లే... ఇప్పుడు ఆ కథను స్క్రీన్‌  నుండి మళ్లీ మనిషి గుండెల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. మనమే కొత్త కథకులం కావాలి. మానవీయ జానపదం రాయాలి. గుర్తుంచుకోండి, మీరు ఫార్వర్డ్‌ చేస్తున్నది కేవలం ఒక సందేశం కాదు. అది ఒక తరం మనసు, ఒక జాతి భవిష్యత్తు! బటన్‌  మీ చేతిలోనే ఉంది. కొత్త కథను మీరే రాయాలి!  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)