Breaking News

ప్రాణాంతక నిర్లక్ష‍్యం

Published on Fri, 06/06/2025 - 00:35

హద్దులెరుగని అభిమానం, నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం, తన బాధ్యతేమిటో పూర్తిగా మరి చిన ప్రభుత్వం... వెరసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సాయంత్రం 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, అందులో అయిదుగురి స్థితి ఆందోళనకరంగా ఉన్నదంటున్నారు. దుర్మరణం పాలైన వారిలో ఎక్కువమంది టీనేజ్‌ వయస్కులు. 

ఎంతో భవిష్యత్తుగల యువత ప్రాణాలు ఇలా హఠాత్తుగా కడతేరిపోవటం వారి తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ మాత్రమే కాదు... సమాజం మొత్తానికి తీవ్ర దుఃఖం కలిగించే అంశం. ఒక కథనం ప్రకారం ఈ కార్యక్రమానికి రాయల్‌ చాలెంజెర్స్‌బెంగళూరు(ఆర్‌సీబీ), కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ), డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల్లో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోలేదు! 

ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇప్పుడు సిటీ పోలీసు కమిషనర్‌నూ, డెప్యూటీ కమిషనర్‌నూ సస్పెండ్‌ చేశామంటున్నారు. మంచిదే. ఇతరుల మాటేమిటి? సెలబ్రిటీలు వచ్చినప్పుడూ, రాజకీయ సభలప్పుడూ, మతసంబంధ ఉత్సవాల సంద ర్భాల్లో భారీయెత్తున జనం గుమిగూడటం... తొక్కిసలాటలు, మరణాలు రివాజుగా మారాయి. కానీ ప్రభుత్వాలు, పోలీసులు నేర్చుకున్నదేమీ ఉండటం లేదని ఇవి పునరావృతం అవుతున్న తీరు చూస్తే తెలుస్తుంది. 

ఈ ఏడాది జనవరి మొదట్లోనే తిరుపతిలో టీటీడీ నిర్వాకం కారణంగా తొక్కి సలాటకు ఆరుగురు బలయ్యారు. ఆ నెలాఖరులో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా వద్ద ఇలాంటి దుర్ఘటనలోనే 30 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట వల్ల 18 మంది కన్నుమూశారు. ఎన్ని ప్రాణాలు పోతే ప్రభుత్వాలు మేల్కొంటాయి?  

సామాజిక మాధ్యమాల ప్రభావమేమిటో అందరికీ తెలుసు. వాటిల్లో ఆ కార్యక్రమం గురించి ఆర్‌బీసీయే విస్తృత ప్రచారం చేసింది. తామున్నచోటికి అభిమాన ఆటగాళ్లు రాబోతున్నారని యువత ఉవ్విళ్లూరటం అసాధారణమేమీ కాదు. మన దేశంలో క్రికెట్‌కు మరే క్రీడకూ లేనంత ఆకర్షణ ఉంది. విరాట్‌ కోహ్లీ వస్తున్నాడంటే అది మరిన్ని వందల రెట్లు పెరుగుతుంది. 

ఇవి చాలవా పకడ్బందీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటానికి? నిజానికి బెంగళూరు, దాని శివారు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే అభిమానుల కోలాహలం మొదలైందని, బుధవారం ఉదయం నుంచి అది క్రమేపీ పెరుగుతూ పోయిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 

ఇదంతా గమనించాక సాయంత్రం కార్యక్రమానికి అభిమానులు పోటెత్తుతారన్న అంచనా వుండొద్దా? బుధవారం వీధులన్నీ కిక్కిరిసిన వైనం గమనించి క్రికెటర్ల ర్యాలీని రద్దుచేసి కూడా 35,000 మందికి మాత్రమే సరిపడే స్టేడియంలో వేడుకలు సజావుగా ముగుస్తాయని ఎలా అనుకోగలిగారు? అందులోనూ ఈ కార్యక్రమానికి టిక్కెట్‌ విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ లేవు. మొత్తానికి స్టేడియంకు వెళ్తే తమ అభి మాన క్రికెటర్లనూ, వారు గెల్చుకున్న కప్పునూ స్వయంగా చూడొచ్చన్న సందేశం ప్రచారమైంది. పర్యవసానంగా నియంత్రణకు అందని రీతిలో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.

కార్యక్రమం కోసం 5,000 మంది పోలీసులను మోహరించామని, అయినా ఈ విషాదం చోటు చేసుకున్నదని కంటతడి పెడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెప్పారు. పోలీసులు తమ శాయశాక్తులా విధులు నిర్వర్తించారని, దాదాపు మూడు లక్షలమంది రావటంతో విఫల మయ్యామని ఆయన వివరించారు. 

కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది పోలీసుల్ని రంగంలోకి దించామని ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర హైకోర్టులో చెప్పారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయాన్ని సూచిస్తోంది. అసలు ఆ వేయి మందైనా ఉన్నారా అనే సంశయాన్ని కలగజేస్తోంది. 

ప్రత్యక్ష సాక్షులైతే పోలీసుల సంఖ్య మొదటి నుంచీ తక్కువేనంటున్నారు. ఇంతమంది గుమిగూడే సందర్భాల్లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సలహా తీసుకోవాలి. కానీ అదీ జరిగినట్టు లేదు. అసలు ఎవరు ఏ గేటువైపు వెళ్లాలో, ఎవరెక్కడ కూర్చోవాలో సూచించే బోర్డులు లేవు. మహిళలు, పిల్లల కోసమైనా విడిగా ప్రవేశద్వారం ఉండాలని నిర్వాహకులకు తోచలేదు. అభిమానుల్ని క్యూలో నియంత్రించేవారూ లేరు, పకడ్బందీ బ్యారికేడ్లూ లేవు. ఉన్న కొన్ని బ్యారికేడ్లూ తొక్కిసలాటలో ధ్వంసమయ్యాయి. 

ఇన్ని లోపాలు పెట్టుకుని ఊహించని స్థాయిలో జనం వచ్చిపడటంవల్లే ఇదంతా జరిగిందని చెబితే సరిపోతుందా? అసలు ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన 24 గంటలలోపే క్రికెటర్లకు నగరంలో సన్మానం చేయాలన్న తొందరెందుకు? అందుకోసం ఒకటి రెండు రోజుల వ్యవధి తీసుకుంటే జరిగే నష్టమేమిటి? జనం వేలంవెర్రిగా అభిమానించే క్రికెటర్లు వస్తున్నప్పుడూ, వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడూ తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వుంటుందన్న అంచనా లేకపోవటం సహించరానిది. 

అప్పుడెప్పుడో ఆఫ్రికా దేశాల్లోనూ, వర్తమానంలో పాలస్తీనాలోనూ రోజుల తరబడి పస్తులుండి అనుకోకుండా ఆహార పదార్థాలతో వచ్చిన వ్యాన్‌ కోసం జనం ఎగబడి తొక్కిసలాటలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి. ప్రాణాలు నిలుపుకోవా లన్న వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వెర్రి అభిమానం కోసమో, విశ్వాసాల కోసమో ఎగబడటం, ప్రాణాలు కోల్పోవటం, ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్టు ప్రవర్తించటం, మళ్లీ మరో విషాదం చోటుచేసుకునేవరకూ అంతా సవ్యంగా వున్నట్టు నటించటం ఎంతకాలం? కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. ఇలాంటివి జరగనీయరాదని సంకల్పించాలి. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)