Breaking News

బంగ్లాకు పరీక్షా సమయం

Published on Wed, 02/11/2026 - 01:10

ఏణ్ణర్థంక్రితం విద్యార్థి ఉద్యమం ధాటికి మాజీ ప్రధాని షేక్‌ హసీనా అధికారాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టిన నాటినుంచీ రాజకీయ, సామాజిక అస్థిరతలో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు అయిన మహ్మద్‌ యూనస్‌ ప్రధాన సలహాదారుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఉన్న వైషమ్యాలను మరింత పెంచి పోషించింది. జవాబుదారీతనం లేని అధికారంతో ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిళ్లు పెరగటంతో ఇవి తప్పనిసరి అయ్యాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్‌ రెహ్మాన్‌ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) గెలుపుగుర్రంగా కనబడటమే గత ఎన్నికలకూ, ప్రస్తుత ఎన్నికలకూ కొట్టొచ్చి నట్టు కనబడుతున్న తేడా. పదిహేనేళ్లపాటు దేశాన్నేలిన షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం విధించటంతో ఆ పార్టీ జాడలేదు.
 
పాకిస్తాన్‌ నుంచి విడివడి 1971లో స్వతంత్ర ప్రయాణం ప్రారంభించిననాటి నుంచీ బంగ్లాదేశ్‌కు ఆటుపోట్లు తప్పడం లేదు. సైనిక కుట్రలు, మత ఛాందసవాదం షరా మామూలైన పాకిస్తాన్‌ చీడ దానికి కూడా అంటి, ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. 17 కోట్ల 30 లక్షల జనాభాతో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు ప్రశంసిస్తూ ఉండేవి. అదే జరిగుంటే హసీనా పదవికి ముప్పు వచ్చి ఉండేది కాదు. కానీ ఆర్థిక అసమానతలకు తోడు పేదరికం, అవినీతి, కక్షసాధింపు ఆమెను దెబ్బతీశాయి. 2022  నుంచి బంగ్లా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి వందలకోట్ల డాలర్ల రుణాలు తీసు కొస్తున్నా మారిందేమీ లేదు. ఆ డబ్బంతా పాలకపార్టీని ఆశ్రయించుకున్నవారి జేబుల్లోకి పోయింది. అధిక ధరలు, ఉపాధిలేమి సగటు మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబా లను తీవ్రంగా దెబ్బతీశాయి. 

బీఎన్‌పీయే విజేతగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నా ఆ పార్టీకి అంత మంచి పేరేమీ లేదు. తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నకాలంలో అప్పటి పాక్‌ పాలకులు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినా, అనంతరకాలంలో అధికారంలోకొచ్చిన బీఎన్‌పీ ఆ దేశంతో అంట కాగిందనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ జనం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే రెహ్మాన్‌ కొత్త బాణీ అందుకుని అన్ని సభల్లోనూ గత తప్పులకు క్షమాపణ కోరుతున్నారు. 1971 విముక్తి పోరాటంలోనూ, 2024 ప్రజాస్వామ్య ఉద్యమంలోనూ మరణించిన వారికి నివాళులర్పిస్తున్నారు. బీఎన్‌పీ మాదిరే పాకిస్తాన్‌ అనుకూల పార్టీగా పేరున్న జమాతే ఇస్లామీ(జేఈఐ)కు ఉన్న అనుకూలాంశమల్లా ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలో లేకపోవ టమే! మహిళల హక్కుల విషయంలో ఆ పార్టీది ఛాందసవాద ధోరణి. దీన్ని బీఎన్‌పీ తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పాలనలో లింగవివక్ష ఉండబోదంటోంది. అయితే యూనస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందువులపై పెరిగిన దాడుల్ని తామే దృఢంగా ఎదిరించి, రక్షణగా నిలిచామని జేఈఐ చెప్పుకుంటోంది. కానీ ఆ దాడులు ఆగింది లేదు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక అవి మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం హిందూ వ్యాపారి సుసేన్‌ చంద్ర సర్కార్‌ను ఆయన దుకాణంలోనే దుండగులు కాల్చిచంపారు. 

బంగ్లాలో ఎవరు పాలకులైనా చైనా, పాకిస్తాన్‌ల ప్రభావం దండిగానే ఉంటుంది. బీఎన్‌పీ ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పకపోయినా, జేఈఐ తన పాక్‌ అనుకూలతను చాటుకోవటంతో పాటు ఇటీవల చైనా దౌత్యవేత్తలతో భేటీ అయింది. విషాదమేమంటే, హసీనాను పదవీచ్యుతురాలిని చేయటంలో కీలకపాత్ర పోషించిన జెన్‌ జీ తరానికి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లేదు. విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్‌ సిటిజెన్‌ పార్టీకి ఆశించినంత మద్దతు లభిస్తున్న దాఖలా లేదు. నిరుడు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో పాటు 30 రాజకీయ పార్టీలు పాల్గొన సదస్సు ఆమోదించిన ‘జూలై ఛార్టర్‌’పై కూడా గురువారం రిఫరెండమ్‌ జరగబోతోంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చేందుకే, చరిత్ర వక్రీకరించేందుకే దీన్ని తీసుకొచ్చారని వామపక్షాల విమర్శ. మొత్తానికి బంగ్లాదేశ్‌ భవితవ్యం ఎలా ఉండబోతున్నదో ఈ ఎన్నికలూ, రిఫరెండమ్‌ తేల్చబోతున్నాయి. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)