రీల్స్ చేయను క్షమించండి..
Breaking News
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
Published on Mon, 01/26/2026 - 08:52
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..
రియల్టీ..
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?
రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.
బ్యాంకింగ్..
ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?
మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం.
బంగారం
సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?
సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.
స్టాక్ మార్కెట్...
1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్‌కు, స్టాక్ మార్కెట్‌కు సంబంధమేంటి?
బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్‌లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్...
సాధారణ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?
షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్‌ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్‌లు దృష్టిలో పెట్టుకోవాలి.
ఇన్సూరెన్స్
ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?
మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్‌పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
Tags : 1