జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
Published on Thu, 01/22/2026 - 09:23
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్‌ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్‌ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్‌గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్‌లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్‌తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్‌లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.
ఏఐపై ఆసక్తి ఉన్నా..
లింక్డ్‌ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.
జాబ్ సెర్చ్‌ను ఈజీ చేస్తున్న లింక్డ్‌ఇన్ ఏఐ టూల్స్
ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్‌ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.
ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్‌లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్‌ఇన్ వెల్లడించింది.
అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.
హైదరాబాద్‌లో టాప్ 10 ఉద్యోగాలు
1. ఏఐ ఇంజనీర్
2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్
3. సొల్యూషన్స్ అనలిస్ట్
4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ
5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్
6. మర్చండైజర్
7. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్
8. ఫైనాన్స్ స్పెషలిస్ట్
9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్
10. సర్వీస్ డెలివరీ మేనేజర్
Tags : 1