ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..
Published on Sat, 04/04/2026 - 11:41
ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఏమిటీ వివాదం?
ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది.
అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలు
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.
తగ్గుతున్న రాయితీలు
మరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్‌తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?
Tags : 1