‘రేర్‌’ మ్యాగ్నెట్ల కోసం రేసు.. 

Published on Thu, 06/12/2025 - 03:29

అరుదైన లోహ అయస్కాంతాల (రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ – ఆర్‌ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్‌ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్‌ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్‌ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్‌ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. 

అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్‌లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్‌ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. 

దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్‌ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్‌ ఏటా 809 టన్నుల ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్‌ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్‌ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్‌ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్‌లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది.  

ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. 
ఆసియా దేశాల్లో చూస్తే జపాన్‌లో కూడా ఆర్‌ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. 

మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్‌–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్‌ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

స్మార్ట్‌వాచీలు, ఇయర్‌బడ్స్‌కూ ఎఫెక్ట్‌ .. 
ఆర్‌ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్‌ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్‌వాచీలు, వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ (టీడబ్ల్యూఎస్‌) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. 

అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌ వాచీలు వైబ్రేట్‌ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్‌ వాచీలు, ఇతర డివైజ్‌ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్‌పాయింట్‌ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్‌లో స్మార్ట్‌ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్‌ ఏర్పడితే స్మార్ట్‌ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం 
ఆర్‌ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్‌ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్‌ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది.     

– సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Videos

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)