CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?
Published on Fri, 01/30/2026 - 12:50
త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.
ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?
రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.
గతంలో ఉన్న రాయితీ వివరాలు..
పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.
మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.
వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.
రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?
మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.
బడ్జెట్ 2026పై ఆశలు
ప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.
ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
Tags : 1