మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు వైఎస్ జగన్ నివాళి
Breaking News
వ్యవసాయంలో పరిశోధనలను ప్రోత్సహించాలి
Published on Tue, 11/11/2025 - 04:31
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వాతావరణ పరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరిన్ని నిధుల సాయం అందించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు నిపుణులు సూచించారు. ఈ దిశగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశంలో వ్యవసాయ రంగం, ఆర్అండ్డీ సంస్థల నుంచి 12 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగం ప్రస్తుత స్థాయి నుంచి మరింత ప్రగతి సాధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారు తమ సూచనలు అందించారు. వ్యవసాయరంగ కార్యదర్శి దేవేష్ చౌదరి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జట్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను నిపుణులు ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాయి.
వ్యవసాయంలో ఆర్‌అండ్‌డీకి వాస్తవ నిధుల కేటాయింపులు గత రెండు దశాబ్దాల కాలంలో తగ్గినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ తెలిపారు. పంటల బీమాను తిరిగి సమీక్షించాలని, చాలా మంది రైతులు దీని విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. వ్యవసాయ ముడి పదార్థాల విక్రయ వివరాలను వర్తకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానం ఉండాలని కోరారు. అలాగే, కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్న పంట ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలని
అభిప్రాయపడ్డారు.
ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ భేటీ
మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలైన సాజిద్ చినాయ్, నీల్కాంత్ మిశ్రా, ధర్మకృతి జోషి, రిధమ్ దేశాయ్, సోనల్ వర్మ, ఇందిరా రాజారామన్ తదితరులతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. 2026–27 బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇది తొలి సమావేశమని ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై
ప్రకటించింది.
Tags : 1