యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే
Breaking News
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
Published on Fri, 03/27/2026 - 08:27
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆర్థిక ప్రయాణం కూడా. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి ఆస్తులు కొంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బంధం విడాకుల వరకు వెళ్తే.. మరి వారు ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఎవరిది? అనే ప్రశ్న వివాదంగా మారుతోంది.
ఇటీవల ‘1 ఫైనాన్స్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విడాకులు తీసుకున్న వారిలో 67 శాతం మంది తాము విడిపోకముందే తీవ్రమైన ఆర్థిక విభేదాలు ఎదుర్కొన్నట్లు తేలింది. అంతేకాకుండా, 43 శాతం కేసుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైవాహిక ఆస్తుల యాజమాన్యంపై చట్టం ఏం చెబుతోంది? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను చూద్దాం.
టైటిల్ డీడ్ వర్సెస్ కంట్రిబ్యూషన్: చట్టం ఏం చెబుతోంది?
1955 హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారే యజమాని అనేది ప్రాథమిక సూత్రం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త ఆస్తిలో భార్యకు లేదా భార్య ఆస్తిలో భర్తకు సగం వాటా దానంతట అదే రాదు. ఇటీవల అమిష్ అగర్వాలా కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. భర్త పేరు మీద ఉన్న నివాస ఆస్తిలో తనకూ వాటా కావాలని భార్య కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘వివాహం జరిగినంత మాత్రాన స్థిరాస్తిపై ఉమ్మడి యాజమాన్యం ఏర్పడదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలులో తమ ఆర్థిక భాగస్వామ్యం ఉందనడానికి బ్యాంకు స్టేట్మెంట్లు వంటి పక్కా ఆధారాలు చూపాలని న్యాయస్థానం పేర్కొంది.
వినీతా సక్సేనా కేసు మినహాయింపు
సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిపై విభిన్నంగా స్పందించింది. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (2006) కేసులో ఆస్తి భర్త పేరు మీద ఉన్నప్పటికీ భార్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గృహిణిగా ఆమె అందించిన సేవలు, ఇంటి నిర్వహణలో ఆమె పడిన శ్రమను ‘పరోక్ష సహకారం’గా గుర్తించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమెకు హక్కు కల్పించింది.
నేటికీ చాలామందిలో ఆస్తి విషయంలో కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి. 1 ఫైనాన్స్‌లో విల్, ఎస్టేట్ ప్లానింగ్ హెడ్ శ్రద్ధా నీలేశ్వర్ కొన్ని కీలక విషయాలను వివరించారు. తాను తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పెళ్లయ్యాక కొన్న ఆస్తిలో భాగస్వామికి ఆటోమేటిక్‌గా 50% వాటా రాదు.
‘షమీమా ఫరూకీ వర్సెస్ షాహిద్ ఖాన్ (2015)’ కేసు ప్రకారం, ఆస్తిలో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, పూర్తి యాజమాన్య హక్కులు ఉండవు.
చాలామంది పన్ను ఆదా కోసం ఒకరి పేరు మీదనే ఆస్తులు కొంటారు, కానీ విడాకుల సమయంలో ఇది రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది.
ప్రస్తుతం 42 శాతం మంది పురుషులు తమ సంపాదనలో సగటున 38 శాతాన్ని భరణం లేదా వివాహ సంబంధిత రుణాలకే వెచ్చిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రణాళికలో రికార్డుల ప్రాధాన్యతను చెబుతోంది.
నిపుణుల సూచనలు
భవిష్యత్తులో ఆస్తి తగాదాలు తప్పించుకోవడానికి కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల సెక్షన్ 80సీ, సెక్షన్ 24(b) కింద ఇద్దరూ పన్ను మినహాయింపు పొందవచ్చు.
డౌన్ పేమెంట్స్ లేదా ఈఎంఐలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్మెంట్లను భద్రపరుచుకోవాలి.
ఆస్తిలో ఎవరి వాటా ఎంతో దస్తావేజుల్లోనే పేర్కొనడం ఉత్తమం.
వివాహం అనేది నమ్మకంతో కూడిన బంధం అయినప్పటికీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం నేటి కాలంలో అత్యవసరం. చట్టపరమైన చిక్కులు రాకముందే మేల్కొని ఆస్తులకు సంబంధించిన సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.
ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!
Tags : 1