Breaking News

సాయికృష్ణ కేసులో సంచలనం

Published on Thu, 07/30/2026 - 05:35

సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్‌డెత్‌ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్‌ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్‌ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్‌వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్‌వోసీ లేకుండానే వకాలత్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. 

ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్‌ వేశారు..
తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్‌డెత్‌ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్‌ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఐదుగుర్ని అరెస్ట్‌ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..
తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్‌ ఉపసంహరణకు పిటిషన్‌ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

దర్యాప్తు పురోగతిని మా ముందుంచండి
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ అప్పటి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్‌స్టిట్యూషనల్‌ రైట్స్‌ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)