Breaking News

పోలీసులు చితకబాదడం వల్లే నా తమ్ముడు చనిపోయాడు

Published on Thu, 07/16/2026 - 05:52

చంద్రబాబు కర్కశ పాలనలో ఖాకీలు కాలాంతకుల్లా మారుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసుస్టేషన్లు బడుగుజీవుల బలికోరే వధశాలలవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగరంలో పోలీసుల అధికారమదానికి బలైన కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతి­కుమార్‌ మరణాలను మరిచిపోకముందే శ్రీపొట్టి­శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై దాష్టీకానికి మరో దళిత యువకుడు ఏడుకొండలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వేధింపులకు మైనార్టీ ఉద్యోగి దరియా హుసేన్‌ అసువులు­బాశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఖాకీలు మోగిస్తున్న ఈ మరణ మృదంగం రాష్ట్రంలో బాబు సర్కారు సాగిస్తున్న రెడ్‌బుక్‌ నరమేధానికి సజీవసాక్ష్యమై నిలుస్తోంది. రక్షణ చట్టాలకు ఉరితాడు బిగించి వికటాట్టహాసం చేస్తోంది.    

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఎస్‌కే హనీఫ్‌ ఖాకీ దుస్తులు ధరించిన క్రిమినల్‌ మాదిరిగా అరాచకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని చర్చించుకుంటున్నారు. తప్పు చేస్తే నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరు పర్చాల్సిన ఎస్సై.. నిందితులను, అమాయకులను చచ్చే వరకు కొడుతున్నాడని పేర్కొంటున్నారు. ఆయన అరాచకాలకు ఎన్నో ఉదంతాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.  

బదిలీపై వచ్చి.. 
ఈ ఏడాది మే 9వ తేదీన పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన గాలం హరికృష్ణ అనే రైతును టీడీపీ నేతల ఆదేశాల మేరకు అకారణంగా స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీలతో చితకబాదాడు. ఈ సన్నివేశాలను వీడియో కాల్‌ ద్వారా టీడీపీ నేతలకు లైవ్‌లో చూపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గూడూరు ఇన్‌చార్జి డీఎస్పీ దీనిపై విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో ఆ ఎస్సైను మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో 6వ తేదీన బాధ్యతలు చేపట్టారు. 

చోరీ కేసులో పైశాచికత్వం 
బంగారం చోరీ కేసులో మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హనీఫ్, కానిస్టేబుళ్లు రెండు రోజుల పాటు స్టేషన్‌లో వారిని లాఠీలతో కుళ్ల బొడిచారు. ఈ క్రమంలో వారిని ఆదివారం రాత్రి వదిలేసి.. మర్నాడు రావాలంటూ హెచ్చరించారు. సోమవారం ఇద్దరు మాత్రమే స్టేషన్‌కు రాగా ఏడుకొండలు రాలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాధవరావు, మరో కానిస్టేబుల్‌ కారులో ఏడుకొండలు ఉన్న గ్రామానికి చేరుకుని విచక్షణారహితంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన ఏడుకొండలను కారు డిక్కీలో కుక్కి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్పృహలో లేకపోవడంతో నీళ్లు చల్లి మరీ చావబాదినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఏడుకొండలును గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

చోరీ కేసులో కొట్టి చంపొచ్చా..?   
చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలును అదుపులోకి తీసుకున్న మనుబోలు పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచాలి. కానీ ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. నాలుగు సవర్ల బంగారం పోయిందని కేసు నమోదైతే.. నిందితులను కొట్టి, హింసించి 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. 

వారి నుంచి బంగారం కొనుగోలు చేసిన వారిని బెదిరించి కేసులు పెడతామని మరో 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. చివరకు 2 సవర్లు మాత్రమే రికవరీ చూపించారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్‌కు తరలించి చావబాదడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని స్పష్టమవుతోంది. ఎస్పీ అజిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ అది లాకప్‌ డెత్‌ కాదన్నారు. మరి ఎలా చనిపోయాడనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? 

మనుబోలు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఏడుకొండలు మృతదేహంతో ఆందోళనకు దిగిన కాకాణి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌  

గడ్డి మందు తాగి చనిపోయాడంటూ.. 
ఏడుకొండలు మృతి చెందాడని గుర్తించిన పోలీసులు అతడి సోదరుడికి ఫోన్‌ చేసి మీ అన్న గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోయాడని, ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టాలని తొలుత చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గడ్డి మందు తాగి ఎలా చనిపోతాడని బాధితులు స్టేషన్‌ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. చంపేసి గడ్డి మందు తాగాడని చెబుతున్నారంటూ మండిపడ్డారు. 

గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోతే  నిబంధనల ప్రకారం స్థానిక వీఆర్వో ద్వారా ఫిర్యాదు తీసుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించాలి. కానీ ఏడుకొండల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అసలు గడ్డి మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు.  పోలీసుల అదుపులో వ్యక్తి ఆస్పత్రిలో శవంగా తేలటాన్ని బట్టి దెబ్బలకు తాళలేకే చనిపోయాడన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 

పంచనామా రిపోర్టులో ఆ వివరాలేవి? 
ఏడుకొండలు మృతిపై పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలేనని శవ పంచనామా రిపోర్టే తేటతెల్లం చేస్తోంది.  ఏడుకొండలును మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని డ్యూటీ డాక్టర్‌ చెప్పినట్లు పంచనామా రిపోర్టులో పొందుపరిచారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్లు నిజంగానే గడ్డి మందు తాగి ఉంటే.. పాయిజన్‌ వాసన వస్తుంది. శరీరం రంగు మారడం లాంటివి జరగాలి. కానీ ఇవేవి లేవు. 

కానిస్టేబుల్‌ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్‌ కలిసి ఏడుకొండలను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఎక్కడ ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారనే విషయం పంచనామా రిపోర్టులో రాయలేదు. పోలీసులు మొదట చిత్రీకరించిన ప్రకారం.. గడ్డి మందు తాగి చనిపోయి ఉంటే వీఆర్వో ఫిర్యాదు లేకుండా ఎలా తరలించారు? ఎవరి ద్వారా సమాచారం లేకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రాథమికంగా చేపట్టాల్సిన శవ పంచనామా చేయకుండా నేరుగా ఆస్పత్రికి ఎలా తరలించారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)