5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
దేవుడిని వెతకాల్సింది ఎక్కడంటే?
Published on Thu, 11/26/2026 - 07:31
దేవుడున్నాడా లేదా అని వాదులాడుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రతివాడూ తన అనుభవం విషయంలో పూర్తి స్వతంత్రుడు. సత్యపదార్థాన్ని చూడాలనే కోరిక ఉంటే ధర్మ మార్గాన్ని అనుసరించాలి. సద్భక్తుల, సద్గురువుల సేవ చేస్తే సాధకునికి స్వతంత్రమైన దివ్యా నుభూతి కలుగుతుంది. పరమాత్మ తత్త్వం సత్యమైనది, ధర్మనిష్ఠమైనది, అనుభవగోచర మైనది. భగవంతుని నిరంతరం స్మరిస్తూ సాధన చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఒక జన్మలో నారదుడు దాసీ పుత్రుడుగా జన్మించాడు. తల్లి సాధు సత్పురుషుల సేవ చేస్తూ కొడుకు చేత కూడా అలాగే చేయించేది. సాధు సత్పురుషుల సేవ చేస్తూ ఉండటం చూచి మునులు నారదునికి బ్రహ్మసూత్రాలను ఉపదేశించారు. ‘దైవ దర్శనం లక్ష్యాన్ని పదే పదే అనుకుంటూ తపస్సును, యోగాన్ని అనుసరించు’ అని వాళ్ళు బోధించారు. అలాగే తు.చ. తప్పకుండా చేసి అతడు మరుజన్మలో బ్రహ్మమానస పుత్రుడ య్యాడు. మహానుభావుల సాంగత్యం వల్ల జీవితం ధన్యమవుతుందని దీని ద్వారా తెలుస్తుంది.
తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు వారిననుసరిస్తారు. రామాయణం, భారత, భాగవతాది గ్రంథాలను ఇంట్లో పెద్దలు చదివితే పిల్లలు కూడా చక్కగా వింటూ అభ్యాసం చేస్తారు. ఆధ్యాత్మిక విద్యయే అసలైన విద్య. దానియందు ఆసక్తితో పెద్దలుంటే పిల్లలు కూడా అభిరుచిని పెంచుకుంటారు. దానివల్ల వాళ్ళకు నైతిక శక్తి కలుగుతుంది.
పెద్దవాళ్ళు సహస్రనామాలు శ్రద్ధాసక్తులతో చదివితే పిల్లలు కూడా భక్తితో చదువుతారు. మంచి సంగీతం విన్నా, సద్గ్రంథ పారాయణం చేసినా, జపతపాలు చేసినా... క్రమశిక్షణ కలిగి మనస్సు శుభ్రమవుతుంది. వ్రతాదుల్లో ఆహారనియమం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం కలుగుతుంది. మౌనం వల్ల కాసేపైనా ఏకాగ్రత అలవడుతుంది. టన్ను బరువైన బోధలకంటే కొంచెమైనా ఆచరణ గొప్పది. మానవ జీవితంలో నడవడిక, మంచి అలవాట్లే ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
ఇదీ చదవండి: తెలిసి చేసినా... తెలియక చేసినా...
Tags : 1