తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..
Breaking News
ఇట్స్ ‘ఫ్యామిలీ’ టైం! కుటుంబ బంధాల్లో భారత్ టాప్!
Published on Mon, 10/26/2026 - 10:59
ప్రస్తుత ఆధునిక కాలంలో డిజిటల్ విప్లవం ఎంతో వేగంగా దూసుకుపోతున్నప్పటికీ, భారతీయ సమాజంలో కుటుంబ బంధాల ప్రాధాన్యత తగ్గలేదని వార్కీ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఫ్యామిలీ ఫస్ట్ గ్లోబల్ సర్వే–2026’వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని నాలుగు తరాలకు చెందిన 18,013 మంది అభిప్రాయాలను సేకరించి తయారుచేసిన ఈ అధ్యయనం, భారతీయ కుటుంబాల జీవనశైలిలోని ఆసక్తికరమైన అంశాలను, అలాగే ఆధునిక ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న బంధాల వైరుధ్యాలను కళ్లకు కట్టింది.
కుటుంబ బంధాల్లో భారత్ టాప్
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ‘జెన్ జీ’యువత కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న భారతీయ యువతలో ఏకంగా 84 శాతం మంది కుటుంబంతో గడిపే సమయం తమ జీవితంలో అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఈ విషయంలో భారత్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. అంతేకాకుండా, కలిసి భోజనం చేసే సమయంలో అందరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారని 81 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు పేర్కొన్నారు.
విడదీయరాని అనుబంధం
భారతీయ కుటుంబాల్లో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో పిల్లలకు ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. సర్వేలో పాల్గొన్న చిన్నారుల్లో 76 శాతం మంది తమ తాతయ్యలు, అమ్మమ్మలతో మరికాసేపు సమయం గడపాలని ఆరాటపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిగిన దేశాల్లో ఇది అత్యధికం.
అలాగే 76 శాతం మంది తాతయ్యలు, అమ్మమ్మలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే నివసిస్తుండగా, 65 శాతం మంది ప్రతిరోజూ తమ మనవళ్లు, మనవరాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు, తల్లిదండ్రుల్లో 85 శాతం మంది తమ తల్లిదండ్రులతో కనీసం వారానికి ఒకసారైనా సమయం గడుపుతున్నామని, 65 శాతం మంది ప్రతిరోజూ కలుస్తున్నామని వెల్లడించారు.
సమయం చాలడం లేదు!
కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, కుటుంబంతో నాణ్యమైన సమయం గడుపుతున్నామని సంతృప్తిగా చెప్పిన భారతీయ పిల్లలు కేవలం 22 శాతమే కావడం ఆందోళన కలిగిస్తోంది. సర్వేలోని అన్ని దేశాల కంటే భారత్లోనే ఈ సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉంది. తల్లిదండ్రులు తమ పనుల్లో తీవ్ర బిజీగా ఉండటం వల్ల వారితో సమయం గడపలేకపోతున్నామని 29 శాతం మంది పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే స్కూలు హోంవర్క్, చదువుల ఒత్తిడి వల్ల కుటుంబ సమయానికి దూరమవుతున్నామని 43 శాతం మంది పిల్లలు తెలిపారు. పిల్లల బిజీ షెడ్యూళ్లు, ట్యూషన్లు, ఇతర యాక్టివిటీస్ వల్ల తాము వారితో అనుకున్నంతగా సమయం గడపలేకపోతున్నామని 44 శాతం మంది తల్లిదండ్రులు, 54 శాతం మంది తాతయ్యలు–అమ్మమ్మలు అభిప్రాయపడ్డారు.
కుటుంబాల్లో ‘డిజిటల్’ఆందోళన
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల వాడకం కుటుంబ అనుబంధాలకు అతిపెద్ద సవాలుగా మారింది. స్క్రీన్ టైమ్, డిజిటల్ పరికరాల పరిమితి దాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మానసిక బంధాలు దెబ్బతింటున్నాయని 70 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగే స్క్రీన్ వాడకం వల్ల కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతోందని 45 శాతం మంది పిల్లలు, 60 శాతం మంది పెద్దలు అంగీకరించారు.
ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పిల్లల స్క్రీన్ వినియోగం, ఆన్లైన్ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు లేదా నిబంధనలు తీసుకురావాలని 38 శాతం మంది తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు ఒకే ఇంట్లో కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా సమయాన్ని కేటాయిస్తూ కలిసిమెలిసి ఉండటమే నిజమైన కుటుంబ సమయమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. డిజిటల్ వినోదాన్ని పక్కనబెట్టి, రోజులో కొంత సమయమైనా ఆత్మీయంగా మాట్లాడుకుంటేనే ఈ అంతరాన్ని పూడ్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
– సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: గిరిజనుల్లో శతాబ్దాల సూక్ష్మజీవులు...
Tags : 1