ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
ఆపరేషన్ సమయంలో పేషెంట్ ప్రాణాలు ఎవరి చేతుల్లో ఉంటాయి?
Published on Tue, 10/20/2026 - 10:23
‘‘కనిపించని ఆ నాలుగో సింహమేరా... పోలీస్’’ అనే ఈ సినిమా డైలాగ్ చాలా పాపులర్. వైద్యవిజ్ఞానానికి మన అశోక చక్రంలోని సింహాలకు అనువర్తిస్తే... ఆ కనిపించని నాలుగో సింహమే అనస్థిసిస్ట్ అన్నది అక్షరాలా నిజం. ఎందుకంటే... ఓ సర్జరీకి అనస్థసిస్ట్ ఎంత కీలకం, అతడి ప్రాముఖ్యం చాలామందికి తెలియదు.
ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడే పనిలో... సర్జరీ సమయంలో పేషెంట్ శ్వాసను కొనసాగించడం, ఆక్సిజన్ సరిగా అందేలా చూడటం, గుండె పనిని పర్యవేక్షించడం, రక్తపోటు నియంత్రించడం, నొప్పి తెలియకుండా చూడటం... ఇలాంటి కీలకమైన బాధ్యతలన్నీ అనస్థీషియాలస్ట్ లేదా అనస్థసిస్టువే. ఒక్కమాటలో చెప్పాలంటే... సర్జన్ ఆపరేషన్ చేసే కీలక భూమిక పోషిస్తాడు.... ఇక అనస్థీషియాలజిస్టు పేషెంట్‌ను తాత్కాలికంగా దాదాపుగా ఓ స్పృహలేని స్థితిలోకి పంపి, మళ్లీ బతికించి తెచ్చే ప్రాణదాత అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అనస్థీషియాతో పాటు... అనస్థిసిస్ట్‌ల గురించి సాధారణ ప్రజలకు తెలియని అనేక ఆసక్తికరమైన విషయాల సమాహారమే ఈ కథనం.
మత్తు మందు ఇవ్వడమంటే...
పేషెంట్ స్పృహ కోల్పోయేలా చేయడం కాదు. ఆపరేషన్ కు ముందు నుంచి తర్వాతి వరకు పేషెంట్ భద్రతను చూసుకునే ప్రత్యేక వైద్యశాస్త్రం ఇది. మత్తు వెనక ఉన్న ఆ మహావిజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి... పేషెంట్‌కు బాధ తెలియకుండా చేయడమే కాదు, పేషెంట్ ప్రాణాలను తాత్కాలికంగా తన చేతుల్లోకి తీసుకుని... ఆపరేషన్ పూర్తయ్యాక తన చేతి వేళ్లలోంచి ఆ పంచ్రపాణాలను శరీరంలోకి పంపి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసేవాడే అనస్థసిస్ట్. ఆ మహావిజ్ఞానమైన మత్తుశాస్త్రం (అనస్థీషియా) గురించీ, ప్రాణాలు కాపాడే ఆ అనస్థసిస్టు గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం.
అనేక రకాల మత్తు ప్రక్రియల సమాహారమే అనస్థీషియా...
అనస్థీషియా అంటే కేవలం ఒక మందు ఇచ్చి పేషెంట్‌ను మత్తులోకి పంపడం కాదు. ఆపరేషన్ స్వభావాన్ని బట్టి వివిధ రకాల మందుల్ని, అనేక పద్ధతులను వాడతారు. ఉదాహరణకు...
జనరల్ అనస్థీషియా : ఈ ప్రక్రియలో దేహం మొత్తం ప్రభావితమవుతుంది. మత్తుమందు సహాయంతో పేషెంట్‌ను స్పృహలేని స్థితిలోకి తీసుకెళ్తారు. ఆపరేషన్ సమయంలో నొప్పి తెలియకుండా చేసి అతడిలో కదలికలు లేకుండా చూస్తారు. కొన్ని సందర్భాల్లో శ్వాసనాళంలో ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ సహాయంతో శ్వాసను అందిస్తారు. కీలకమైన కొన్ని ఆపరేషన్లలో దీన్ని ఉపయోగిస్తారు.
లోకల్ అనస్థీషియా : ఇందులో మొత్తం దేహానికి కాకుండా శరీరంలోని ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే మత్తు ఇస్తారు. పేషెంట్ మెలకువతోనే ఉంటాడు. శస్త్రచికిత్స జరుగుతున్న ప్రాంతంలో మినహా మిగతావన్నీ పేషెంట్‌కు తెలుస్తుంటాయి. పన్ను తొలగింపు, చిన్న గాయాలకు కుట్లు వేయడం, కొన్ని చర్మ శస్త్రచికిత్సల్లో దీన్ని ఉపయోగిస్తారు.
స్పైనల్ అనస్థీషియా : వెన్నెముక దిగువ భాగంలో సెరెబ్రోస్పైనల్ ద్రవం ఉండే ప్రదేశంలోకి మత్తు మందు ఇస్తారు. దీంతో సాధారణంగా నడుము దిగువ భాగంలో నొప్పి అనుభూతి తాత్కాలికంగా నిలిచిపోతుంది. సిజేరియన్ ప్రసవం, కొన్ని కాలి, తుంటి, మూత్రాశయ శస్త్రచికిత్సల్లో దీన్ని ఉపయోగిస్తారు.
ఎపిడ్యూరల్ అనస్థీషియా : వెన్నెముక చుట్టూ ఉండే ఎపిడ్యూరల్ ప్రదేశంలో మత్తు మందు ఇస్తారు. అవసరాన్ని బట్టి సన్నని కాథెటర్ ద్వారా మందు ఇవ్వడాన్ని కొనసాగిస్తుంటారు. ప్రసవం సందర్భాల్లో నొప్పి నియంత్రణలో ఇది ముఖ్యమైన పద్ధతి.
రీజినల్ అనస్థీషియా, నర్వ్ బ్లాక్స్ : శరీరంలోని ఒక ప్రాంతానికి నొప్పి తెలియకుండా చేసేందుకు ఆ నొప్పిని చేరవేసే సంకేతాలకు అడ్డకట్ట వేస్తారు. ఇలా సంకేతాలను బ్లాక్ చేయడం కోసం సంబంధించిన నరాల దగ్గర మత్తు మందు ఇస్తారు. చేయి, భుజం, కాలు వంటి భాగాల శస్త్రచికిత్సల్లో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.
సెడేషన్ (మగతలో ఉంచడం) : పేషెంట్‌లో ఆందోళన తగ్గి అతడిని ప్రశాంతంగా ఉంచడానికీ లేదా అతడు మగతగా ఉండేందుకు అతడికి ఇచ్చే మందును సెడెషన్ అంటారు. ఇది జనరల్ అనస్థీషియాతో సమానం కాదు. మత్తు మోతాదును బట్టి పేషెంట్‌కు జరిగిన విషయాలు గుర్తుండవచ్చు లేదా గుర్తుండకపోవచ్చు.
అయితే ఈ అన్ని పద్ధతుల్లో దేన్ని ఎంచుకోవాలన్నది చేస్తున్న ఆపరేషన్ ను బట్టి, పేషెంట్ ఆరోగ్య పరిస్థితి,
ప్రయోజనాలు, ఎదురయ్యే ముప్పు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అనస్థీషియా ఆవిర్భావానికి ముందు...
నొప్పిని జయించిన ఈ వైద్యవిజ్ఞానశాస్త్రం ‘అనస్థీషియా’ ఒక్క రోజులో రాలేదు. అనేకానేక మైలురాళ్లను దాటుకుంటూ పురోగమించింది. ఉదాహరణకు... మత్తుమందులు అందుబాటులో లేని సమయంలో ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సివచ్చినప్పుడు మద్యం, నల్లమందు వంటివి వాడేవారు. నేటి ఆధునిక అనస్థీషియాతో పోలిస్తే వాటికి నొప్పిని నియంత్రించడం అంతగా సాధ్యమయ్యేది కాదు. అందుకే ఆ టైమ్‌లో సర్జన్ ఎంత వేగంగా ఆపరేషన్ చేయగలడనే అంశానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది.
పేషెంట్ నొప్పితో కదలడం వల్ల ఆపరేషన్ మరింత కష్టమయ్యేది. అందుకే పెద్ద శస్త్రచికిత్సల్ని ఆ టైమ్‌లో అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించేవారు. అయితే ఒక్క అనస్థీషియా మాత్రమే కాకుండా... ఇన్ఫెక్షన్ల నివారణ, స్టెరిలైజేషన్ ప్రక్రియలు, మెరుగైన శస్త్రచికిత్సా పద్ధతులు, రక్తమార్పిడి, ఆధునిక పర్యవేక్షణ పరికరాలు... ఇవన్నీ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
ఈథర్ నుంచి ఈనాటి ఆధునిక అనస్థీషియా వరకు...
అనస్థీషియా ఆవిర్భావం కేవలం ఒకే ఒక వ్యక్తి చేసిన ఒకే ఒక ప్రయోగంతో జరగలేదు. అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు చేసిన పరిశోధనలు, ప్రయోగాలు, వైఫల్యాలు, విజయాలు కలిసి ఈ వైద్యశాస్త్రానికి పునాది వేశాయి. ఉదాహరణకు...
21799లో బ్రిటిష్ శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ నైట్రస్ ఆక్సైడ్ అనే వాయువుపై పరిశోధనలు చేశాడు. దాన్ని పీల్చినప్పుడు నొప్పి తగ్గుతుందని గమనించాడు. దీన్నే ‘లాఫింగ్ గ్యాస్’ అని కూడా అంటారు. అయితే దాన్ని వెంటనే వైద్యరంగంలో వాడలేదు.
21842లో క్రాఫర్డ్ లాంగ్ అనే అమెరికన్ వైద్యుడు ఈథర్‌ను వాడి శస్త్రచికిత్స చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అతడు తన అనుభవాలను వెంటనే నమోదు చేయకపోవడంతో ఆయనకు దక్కాల్సిన గుర్తింపు విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి.
21844లో హోరేస్ వెల్స్ అనే దంతవైద్యుడు నైట్రస్ ఆక్సైడ్‌ను ఉపయోగించి పన్ను తొలగించే ప్రయోగాలు చేశాడు. తనపై తాను కూడా ప్రయోగం చేసుకున్నాడు. అయితే ఓ బహిరంగ ప్రదర్శనలో అతడు విఫలం కావడంతో అతడి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
21846లో విలియం మోర్టన్ అనే వైద్యుడు ఈథర్‌ను ఉపయోగించి శస్త్రచికిత్స సమయంలో నొప్పిని నియంత్రించవచ్చని బహిరంగంగా ప్రదర్శించాడు. 1846 అక్టోబరు 16న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆధునిక అనస్థీషియా చరిత్రలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా గుర్తింపు ΄÷ందింది. అందుకే ఈ రోజును ‘అనస్థీషియా డే’ గా ప్రకటించారు.
21847లో స్కాట్లాండ్‌కు చెందిన జేమ్స్ యంగ్ సింప్సన్ అనే వైద్యుడు క్లోరోఫామ్‌ను ప్రసూతి వైద్యంలో వాడటం మొదలుపెట్టాడు. ప్రసవ సమయంలో నొప్పి నియంత్రణకు ఇది కొత్త దారి తెరిచింది. అయితే క్లోరోఫామ్ గుండెకు సంబంధించిన కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుందని తర్వాత స్పష్టమైంది.
గుండె ఆపరేషన్లలో అనస్థసిస్ట్‌ల భూమిక మరింత కీలకం...
గుండె శస్త్రచికిత్సల్లో అనస్థీషియాలజిస్టు బాధ్యతలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. పేషెంట్ తాలూకు గుండె పనితీరు, రక్తప్రసరణ, రక్తపోటు, ఆక్సిజన్ సరఫరా వంటి అంశాలను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఆపరేషన్ రకాన్ని బట్టి ప్రత్యేక మానిటరింగ్, వెంటిలేషన్ , ద్రవాల నిర్వహణ, రక్తం పోకుండా నియంత్రించడం వంటి చర్యలు అవసరమవుతాయి. కొన్ని గుండె శస్త్రచికిత్సల్లో కార్డియాక్ అనస్థీషియాలో నైపుణ్యం కలిగిన మత్తు వైద్యనిపుణులు ప్రత్యేక పాత్ర పోషిస్తారు.
అనస్థీషియా ఇచ్చినా ఆపరేషన్ గుర్తుండవచ్చా?
జనరల్ అనస్థీషియా ఇచ్చిన పేషెంట్‌కు ఆపరేషన్ సమయంలోస్పృహలో ఉండకూడదన్నదే లక్ష్యంగా అనస్థీషియా ఇస్తారు. అయినప్పటికీ, చాలా అరుదుగా కొంతమంది పేషెంట్లకు ఆపరేషన్ సమయంలో జరిగిన విషయాలు గుర్తుండవచ్చు. దీన్ని ‘అనస్థీషియా అవేర్‌నెస్’ అంటారు.
కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, ఒత్తిడిగా అనిపించడం వంటి అనుభవాలూ ఉండవచ్చు. అయితే ఇలాంటి అనుభవం ఉన్నంతమాత్రాన నొప్పి అనుభవించారని అర్థం కాదు.
అమెరికన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్స్ అనుభవాల ప్రకారం... జనరల్ అనస్థీషియా తీసుకున్న ప్రతి 1,000 కేసుల్లోనూ సుమారు ఒకటి నుంచి రెండు సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురుకావచ్చని వారి అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఇదొక సాధారణ అంచనా మాత్రమే.
ఆపరేషన్ కు ముందు పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒక ఆపరేషన్‌లో అనస్థీషియా సురక్షితంగా ఉండటానికి పేషెంట్ సహకారం కూడా ఎంతో అవసరం. గతంలో పేషెంట్‌కు ఏవైనా సర్జరీలు అయి ఉంటే... ఆ టైమ్‌లో అనస్థీషియా తీసుకున్నప్పుడు ఏమైనా సమస్యలు వచ్చాయా అన్నది డాక్టర్‌కు చెప్పాలి.
ఏవైనా మందులకు అలర్జీలు ఉంటే అది ముందుగానే తెలియజేయాలి.
మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైబీపీ), గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు, స్లీప్ అప్నియా వంటి కండిషన్స్ ఏవైనా ఉంటే డాక్టర్‌కు వివరించాలి.
ప్రస్తుతం వాడుతున్న మందులు, ఇన్సులిన్ , రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు (బ్లడ్ థిన్నర్స్), తాము తీసుకుంటున్న సప్లిమెంట్ల వివరాలు తెలపాలి.
తమ కుటుంబంలో ఎవరికైనా అనస్థీషియాకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయా అనే వివరాలు ఉంటే చెప్పాలి.
ఆపరేషన్ కు ముందు ఆహారం, నీరు ఎప్పటి నుంచి తీసుకోకూడదనే సూచనలను ఆసుపత్రి నుంచి తెలుసుకుని వాటిని తప్పక పాటించాలి.
వైద్యుల సలహా లేకుండా తాము రోజూ వాడే మందులను తమ స్వయం నిర్ణయంతో తమంతట తామే ఆపకూడదు.
అనస్థీషియాతో ప్రమాదం తప్పనిసరిగా ఎంతో కొంత ఉంటుందా?
ఆధునిక అనస్థీషియా పద్ధతులు, మానిటరింగ్ పరికరాలు, శిక్షణ ΄÷ందిన నిపుణులైన టీమ్ వల్ల అనస్థీషియాతో నష్టాలు గణనీయంగా తగ్గి భద్రత గణనీయంగా మెరుగుపడింది. అయితే అనస్థీషియాతో ప్రమాదం పూర్తిగా జీరో అని చెప్పడం కుదరనప్పటికీ... అది అత్యంత పరిమితం / చాలా కనిష్టం (లీస్ట్) అని చెప్పవచ్చు. ఎందుకంటే... మత్తు తర్వాత మగత, వికారం, వాంతులు, గొంతు నొప్పి వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు.
అరుదుగా తీవ్రమైన అలర్జీ, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత కాంప్లికేషన్లూ రావచ్చు. అయితే అవన్నీ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స రకం, ఏ రకమైన అనస్థీషియా ఇచ్చేరనే అంశాలను బట్టి ఏర్పడే ముప్పు (రిస్క్) కూడా మారుతుంటుంది. అందుకే ఆపరేషన్ కు ముందు వైద్య పరీక్షలు, సరైన అనస్థీషియా ప్రణాళిక, ఆపరేషన్ సమయంలో నిరంతర పర్యవేక్షణ, ఆపరేషన్ అనంత సంరక్షణ (పోస్ట్ ఆపరేటివ్ కేర్) వంటి అన్ని అంశాలూ చాలా ముఖ్యం.
సర్జరీకి ముందు తినడం, తాగడం వద్దని చెప్పడం ఎందుకంటే...
ఆపరేషన్ కు ముందు ఫలానా టైమ్ నుంచి తినడం, తాగడం వద్దని చెబుతుంటారు. అలా ఆపమని చెప్పడానికి ముఖ్యమైన కారణాల్లో ముఖ్యమైనది ఏమిటంటే... మత్తు సమయంలో కడుపులోని పదార్థాలు తిరిగి గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాసను ఆపేసే ముప్పు ఉంటుంది. దాంతో ఊపిరి ఆడక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఇలా తినడం, తాగడం చేయకుండా ఉండాల్సిన టైము కేసును బట్టి మారవచ్చు. అందుకే ఈ విషయంలో ఆసుపత్రివర్గాలు ఇచ్చిన సూచనల్ని పేషెంట్లు తప్పక పాటించాలి.
ఆపరేషన్ తర్వాత అనస్థీషియా కేర్ ఇలా...
ఆపరేషన్ పూర్తయిన వెంటనే అనస్థసిస్ట్ బాధ్యత అంతటితోనే ముగిసిపోదు. పేషెంట్ రికవరీ గదిలో ఉన్నప్పుడు శ్వాస, స్పహ, రక్తపోటు, నొప్పి, వికారం వంటి అంశాలను అతడు పర్యవేక్షిస్తూ ఉండాల్సిందే. సర్జరీ తర్వాత కొందరు త్వరగా కోలుకుంటారు. మరికొందరికి మందుల ప్రభావం తగ్గడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. పేషెంట్ పరిస్థితిని బట్టి అదనపు పర్యవేక్షణ లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరం కావచ్చు. అందువల్ల అనస్థీషియాలజిస్టు పని కేవలం ఆపరేషన్ థియేటర్‌కే పరిమితం కాదు. అలాగే అతడి నైపుణ్యం శస్త్రచికిత్సకే పరిమితం కాదు. ఇక మహిళల ప్రసవ సమయంలో నొప్పి నియంత్రణ, ఆపరేషన్ తర్వాతి నొప్పి నివారణ, దీర్ఘకాలిక నొప్పి చికిత్స, కొన్ని అత్యవసర పరిస్థితులు, ఇంటెన్సివ్ కేర్ వంటి రంగాల్లోనూ అనస్థసిస్ట్ పాత్ర ఉంటుంది.
పిల్లలకు అనస్థీషియా ఇవ్వడంలో...
పిల్లలకు అనస్థీషియా ఇవ్వడం అంటే కేవలం పెద్దవారికి ఇచ్చే మందుల మోతాదును తగ్గించడం మాత్రమే కాదు. పిల్లల వయసు, బరువు, శ్వాసనాళ నిర్మాణం, శరీర ఉష్ణోగ్రతను నిలుపుకునే సామర్థ్యం, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మత్తుమందు మోతాదు, శ్వాసప్రక్రియ పర్యవేక్షణ, ద్రవాల నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అందుకే పిల్లల అనస్థీషియాలో అనుభవం, తగిన పరికరాలు చాలా కీలకమైన భూమిక పోషిస్తాయి.
అనస్థీషియాలజిస్టు ఏం చేస్తాడంటే...
ఆపరేషన్ థియేటర్‌లో సర్జన్ పేషెంట్‌కు శస్త్రచికిత్స చేస్తుంటే, అనస్థీషియాలజిస్ట్ / అనస్థిసిస్ట్ పేషెంట్ తాలూకు కీలకమైన దేహ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షిస్తుంటాడు.
అనస్థిసిస్ట్ పని ఆపరేషన్ కు ముందు నుంచే మొదలవుతుంది. ఆపరేషన్ కు ముందు పేషెంట్ వైద్య చరిత్రను (మెడికల్ హిస్టరీని) క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరునూ; డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలను పరిశీలిస్తాడు. గతంలో అనస్థీషియా తీసుకున్నప్పుడు ఏవైనా సమస్యలు వచ్చాయా, ఏవైనా మందులకు అలర్జీలు ఉన్నాయా, ప్రస్తుతం ఏ మందులు వాడుతున్నారు వంటి వివరాలు అడిగి తెలుసుకుంటాడు.
పేషెంట్ ఉన్న కండిషన్‌లో అతడికి ఏ రకమైన అనస్థీషియా అనుకూలమో నిర్ణయించి, దాని ప్రయోజనాలు, ప్రమాదాలను, ఎదురయ్యేందుకు అవకాశమున్న ముప్పు (రిస్క్‌లను) వివరిస్తాడు.
ఆపరేషన్ సమయంలో గుండె వేగం, గుండె లయ, రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులను గమనిస్తుంటాడు. అవసరమైనప్పుడు శ్వాసనాళాన్ని సురక్షితంగా ఉంచి, వెంటిలేటర్ సహాయంతో శ్వాసను అందిస్తారు. శ్వాస నిరంతరం అందుతూ ఉండటం అవసరం కాబట్టి... శ్వాసనాళంలోకి గొట్టం పంపించడం ఎంత వేగంగా జరుగుతుందంటే... క్షణాల్లో ఆ గొట్టాన్ని లోనికి ప్రవేశపెట్టేంతటి నేర్పు అనస్థసిస్ట్‌కు ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత, దేహంలోని ద్రవాల సమతుల్యత, పేషెంట్ ఏ మేరకు రక్తాన్ని నష్టపోతున్నాడు వంటి అంశాలను కూడా పర్యవేక్షిస్తుంటాడు.
పేషెంట్‌ను సురక్షితంగా స్పృహలోకి తీసుకురావడం కూడా...
ఇక ఆపరేషన్ పూర్తయ్యాక పేషెంట్‌ను సురక్షితంగా మెలకువలోకి తీసుకురావడం, శ్వాస సరిగా కొనసాగేలా చూడటం, రక్తపోటు స్థిరంగా ఉండేలా చూడటం, నొప్పి, వికారం వంటి సమస్యలను నియంత్రించడం... ఇవన్నీ కూడా అనస్థసిస్టు బాధ్యతలే.
ఒక్కమాటలో చెప్పాలంటే... సర్జన్ ప్రధానంగా వ్యాధిగ్రస్తమైన భాగంపై శస్త్రచికిత్స చేస్తుంటే... అనస్థసిస్ట్ మాత్రం పేషెంట్ పూర్తి దేహాన్ని తన అదుపులో ఉంచుకొని, పేషెంట్ శరీరం ఆ ఆపరేషన్ ను తట్టుకునేలా చూసి, ఆపరేషన్ పూర్తయ్యాక పూర్తిగా సురక్షితంగా మళ్లీ స్పృహలోకి తీసుకొచ్చే బాధ్యత అతడిదే. అంటే పేషెంట్ సురక్షితంగా ఉంచే పూర్తి బాధ్యతలు అతడిపై ఉంటాయనడంలో సందేహం లేదు.
అపోహలూ... వాస్తవాలు అనస్థీషియాతో జ్ఞాపకశక్తి దెబ్బతింటుందా?
అనస్థీషియా గురించి ముఖ్యంగా చాలామంది వృద్ధుల్లో ఉండే భయం ఇది. ఆపరేషన్ తర్వాత కొందరికి తాత్కాలికంగా గందరగోళం, మతిమరుపు లేదా ఏకాగ్రతలో మార్పులు రావచ్చు. దీనికి అనస్థీషియా ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఆపరేషన్ ఎంత పెద్దది, ఇన్ఫెక్షన్ , నొప్పి, నిద్రలేమి, ఇతర అనారోగ్యాలు వంటి అనేక అంశాలు జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపవచ్చు. అందుకే అందరిలోనూ... మరీముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్యలన్నింటినీ గుర్తించి తగిన పర్యవేక్షణ అందించడం అవసరం. అయితే ఒకసారి అనస్థీషియా తీసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరిలోనూ మెదడుకు శాశ్వత నష్టం జరుగుతుందనడం కేవలం అపోహ మాత్రమే.
వృద్ధుల (జీరియాట్రిక్ పేషెంట్స్) విషయంలో అనస్థీషియాలజిస్ట్ పాత్ర, ప్రాముఖ్యత...
వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని అవయవాల పనితీరులో సహజమైన మార్పులు వస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడుపనితీరు మారడంతో పాటు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల వృద్ధులకు శస్త్రచికిత్స చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ, అనుభవం, సమగ్ర వైద్య ప్రణాళిక అవసరం.
శస్త్రచికిత్సకు ముందు పేషెంట్ వయసుతో పాటు వారి శారీరక సామర్థ్యం, గుండె, ఊపిరితిత్తుల పనితీరు, ప్రస్తుతం వాడుతున్న మందులు, ఇతర అనారోగ్య సమస్యలను క్షుణ్ణంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులలో శస్త్రచికిత్స వల్ల కలిగే ముప్పునూ / ప్రమాదాలను ముందుగానే గుర్తించి, వాటిని తగ్గించేందుకు ప్రణాళిక రూ΄÷ందించడం తప్పనిసరి.
శస్త్రచికిత్స సమయంలో పేషెంట్‌కు తగిన అనస్థీషియా పద్ధతిని ఎంచుకుని, రక్తపోటు, గుండె స్పందనలు, ఆక్సిజన్ స్థాయులు, శ్వాసక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. వృద్ధుల శరీరం మందులకు భిన్నంగా స్పందించే అవకాశం ఉన్నందున, అవసరానికి అనుగుణంగా మందుల మోతాదులను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలి. రక్తనష్టం, శరీర ఉష్ణోగ్రత, ద్రవాల సమతుల్యత నిర్వహణ విషయాల్లోనూ మరింత జాగ్రత్తగా ఉండాలి.
శస్త్రచికిత్స తర్వాత నొప్పిని నియంత్రించడంతో పాటు శ్వాసకోశసమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, గందరగోళం లేదా పోస్ట్ ఆపరేటివ్ డెలీరియం, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిలో వచ్చే మార్పులను ముందుగానే గుర్తించేందుకు ప్రయత్నించాలి. అవసరమైనప్పుడు ఐసీయూలో ఉంచి తగిన సంరక్షణ అందిస్తూ, వృద్ధ పేషెంట్లు త్వరగా కోలుకుని తమ రోజువారీ కార్యకలాపాలకు తిరిగి చేరుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా, వృద్ధులలో వయసు ఒక్కటే శస్త్రచికిత్సకు అడ్డంకి కాదు. వారి మొత్తం ఆరోగ్య పరిస్థితి, శారీరక సామర్థ్యం, వ్యక్తిగత అవసరాల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.
ఒక్కమాటలో చెప్పాలంటే... వృద్ధుల విషయంలో అనస్థీషియాలజిస్ట్ పాత్ర కేవలం నొప్పి తెలియకుండా చేయడానికే పరిమితం కాదు. శస్త్రచికిత్సకు ముందు నుంచీ మొదలుకొని శస్త్రచికిత్స సమయంలో, శస్త్రచికిత్స తర్వాతి వరకు పేషెంట్ ప్రాణాలను కాపాడటం, అవయవాల పనితీరును సంరక్షించడంతో పాటు సురక్షితంగా, మరింత మెరుగ్గా కోలుకునేందుకు తోడ్పడటంలో అనస్థసిస్ట్‌ల భూమిక ఎంతో ఉంటుంది.
అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భూమిక...
భవిష్యత్తులో అనస్థీషియాలజీకి ఉన్న అవకాశాలు...
నేటి ఆధునిక వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనస్థీషియాలజీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ రంగంలోనూ ఎన్నో కీలక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు అనస్థసిస్ట్ / అనస్థీషియాలజిస్ట్ తన అనుభవం, క్లినికల్ పరిశీలన, మానిటరింగ్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవాడు.
ఇప్పుడు ఏఐ ఆధారిత సాంకేతికతలు... పేషెంట్ల డేటాను విశ్లేషించడం, ప్రమాద సూచనలను గుర్తించడం, మందుల నిర్వహణలో సహాయపడటం ద్వారా వైద్య నిర్ణయాలను మరింత సమర్థంగా తీసుకోవడంలో దోహదపడుతున్నాయి. అయితే, ఏఐ అనేది అనస్థీషియాలజిస్ట్‌కు ప్రత్యామ్నాయం కాదు; వైద్యుడి నిర్ణయ సామర్థ్యాన్ని మరింతగా పెంచే ఒక సహాయక సాధనం మాత్రమే.
అనస్థీషియాలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందంటే...
1. పేషెంట్ పర్యవేక్షణతో పాటు ప్రమాదాల ముందస్తు గుర్తింపు
ఏఐ ఆధారిత వ్యవస్థలు ఈసీజీ, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయులు, ఈటీసీవో2 వంటి మానిటరింగ్ డేటాను విశ్లేషించి, వచ్చేందుకు అవకాశమున్న కొన్ని ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించేందుకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, రక్తపోటు తీవ్రంగా పడిపోయే అవకాశం లేదా పేషెంట్ పరిస్థితి క్షీణించే సూచనలను గుర్తించేందుకు కొన్ని వ్యవస్థలను నిపుణులు అభివృద్ది చేస్తున్నారు. అయితే వాటి అంచనాలు ఎల్లప్పుడూ ఖచ్చితమైనవి కావు; వైద్యుడి నిర్ధారణ అవసరం.
2. అనస్థీషియా ఎంత లోతుగా ఇవ్వాలనే నిర్ణయంలో సహాయం...
ఏఐ అలాగే ఇతర కొన్నిఆటోమేటెడ్ కంట్రోల్ వ్యవస్థలు మెదడు విద్యుత్ కార్యకలాపాలు, పేషెంట్ తాలూకు శారీరక ప్రతిస్పందనలు, మందుల ప్రభావాన్ని విశ్లేషించి... ఆ డేటా సహాయంతో అనస్థీషియా ఎంత లోతుగా ఇవ్వాలో నిర్ణయించడానికి ఏఐ సహాయపడవచ్చు.
3. వ్యక్తిగతంగా మందును ఇవ్వడంలో (పర్సనలైజ్‌డ్ మెడిసిన్)
ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఎవరికి సరిపోయే మందులను వారికే ఇస్తూ... పర్సనలైజ్‌డ్‌గా మందును నిర్ణయించడానికి అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ఆటోమేటెడ్ వ్యవస్థలు పరిశోధనలో ఉన్నాయి. లేదా కొన్నిచోట్ల పరిమిత వినియోగంలో ఉన్నాయి. అయితే ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ ఉండే సాధారణ పద్ధతులు కావు.
4. మందుల మోతాదుల నిర్ణయంలో సహాయం...
పేషెంట్ వయసు, బరువు, అవయవాల పనితీరు, ఇతర వ్యాధులు, మానిటరింగ్ డేటాను పరిగణనలోకి తీసుకుని పేషెంట్‌కు ఇవ్వాల్సిన మందుల మోతాదుల నిర్ణయం, నిర్వహణకు ఏఐ సహాయపడవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, ముప్పు ఎక్కువగా ఉండే పేషెంట్లు (హై రిస్క్ పేషెంట్స్), క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఏఐ సహాయం మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు.
అయితే ఏఐ సూచించిన మోతాదును యథాతథంగా అనుసరించకుండా, పేషెంట్ పరిస్థితిని బట్టి అనస్థీషియాలజిస్ట్ తన అనుభవం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
5. ఆపరేషన్ తర్వాతి సంరక్షణ, ఐసీయూలో పేషెంట్ స్థితిగతులు
ఏఐ ద్వారా శస్త్రచికిత్స తర్వాత వచ్చేందుకు అవకాశమున్న ఇన్ఫెక్షన్లు, కిడ్నీ ఇంజ్యూరీలు, శ్వాసకోశ సమస్యలు లేదా ఐసీయూలోని ప్రమాదాలను అంచనా వేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది ముప్పు ఎక్కువగా ఉన్న హైరిస్క్ పేషెంట్లను ముందుగానే గుర్తించి, వారి విషయంలో తగిన పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఉపయోగపడవచ్చు.
6. అనస్థీషియా విద్య – శిక్షణ
ఏఐ ఆధారిత సిమ్యులేషన్లు, వర్చువల్ కేస్ స్టడీస్ వంటివి వైద్య విద్యను అభ్యసించే రెసిడెంట్లకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, కష్టమైన ఎయిర్‌వే, మాసివ్ హీమరేజ్, కార్డియాక్ అరెస్ట్ వంటి పరిస్థితులను సురక్షితమైన సిమ్యులేషన్ వాతావరణంలో అభ్యసించవచ్చు.
అలాగే... ఒక కేస్ తాలూకు సారాంశాలు, పరిశోధన, డేటా విశ్లేషణ, థీసిస్ తయారీకి కూడా ఏఐ ద్వారా సహాయం ΄÷ందే అవకాశముంటుంది. అయితే ఈ విషయంలో ఏఐని గుడ్డిగా నమ్మకుండా ఆ వైద్య సమాచారం తాలుకు ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించాల్సిన అవసరం తప్పనిసరి.
అనేక రకాల మందులతో ఇప్పుడు ఆధునికమైన ‘మల్టీమోడల్ పెయిన్ మేనేజ్‌మెంట్’...
నొప్పిని తగ్గించే చికిత్సలో ఇప్పుడు ఒకే రకమైన మందుపై ఆధారపడకుండా, వివిధ పద్ధతులను కలిపి ఉపయోగించే ‘మల్టీమోడల్ పెయిన్ మేనేజ్‌మెంట్’ ప్రాధాన్యం పెరుగుతోంది. అల్ట్రాసౌండ్ సహాయంతో నర్వ్ బ్లాక్స్ చేయడం, పేషెంట్ అవసరాలకు తగినట్లుగా అనస్థీషియా ప్రణాళిక రూ΄÷ందించడం వంటి పద్ధతులిప్పుడు వైద్యరంగంలో కీలకంగా మారుతున్నాయి.
చివరగా... ఇప్పటికే అనస్థీషియా రంగం చాలా అభివృద్ధి చెందినప్పటికీ... ఇదింకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మందుల మోతాదును మరింత ఖచ్చితంగా నియంత్రించడం, పేషెంట్ కండిషన్‌కు అనుగుణంగా మత్తు మోతాదును నిర్ణయించడం, పర్యవేక్షించడం, ఆపరేషన్ తర్వాతి నొప్పినీ, వికారాన్నీ వీలైనంతగా తగ్గించడం, పేషెంట్ వీలైనంత త్వరగా కోలుకునేలా చేయడం వంటి అంశాలపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి.
అలాగే అల్ట్రాసౌండ్ సహాయంతో నరాలను, వాటి స్థానాలను నిశితంగా గుర్తించి, మందును సరైన ప్రదేశానికి చేరేలా అందించడం, వివిధ రకాల నొప్పి నివారణ పద్ధతులను కలగలిపి వాడటం, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా చికిత్సనూ, మత్తు ప్రణాళికను రూ΄÷ందించడం వంటివి ఇప్పటికే అనుసరిస్తున్నారు. ఇక ఈ రంగంలోనూ ఇంకా మరికొన్ని ప్రక్రియలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సరికొత్తవి అమల్లోకి వస్తున్నాయి. అయితే అవన్నీ పేషెంట్లందరికీ సమానంగా వర్తించకపోవచ్చు. ఏవి ఎవరికి అవసరమన్నది అనస్థసిస్ట్‌లు నిర్ణయిస్తారు.
- డాక్టర్ కృష్ణారెడ్డి పింగిళి, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్
నిర్వహణ : యాసీన్
ఇదీ చదవండి: డబ్బున్నోళ్లకే గుండె జబ్బుల ముప్పు!
Tags : 1