భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
పిల్లలకు తరచూ జలుబా? ఈ 54321 ఫార్ములా ట్రై చేయండి!
Published on Sun, 10/18/2026 - 12:35
చిన్నారులు తరచూ జలుబు, దగ్గు, జ్వరం అంటూ మంచం పడుతుంటే తల్లిదండ్రుల టెన్షన్ మామూలుగా ఉండదు. వెంటనే ‘బిడ్డకు ఇమ్యూనిటీ తక్కువైపోయిందేమో!’ అనే అనుమానంతో పాటు, ఇమ్యూనిటీ సిరప్ కోసం వెతుకులాట మొదలవుతుంది. కానీ ప్రతి జలుబుకి కారణమేమిటి? ఎప్పుడు ఆందోళన చెందాలి? ఏం చేయాలి? అనే విషయాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం..
చిన్నారులకు తరచూ జలుబు వస్తోంది అంటే కేవలం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందనే అనుకోవాల్సిన అవసరం లేదు. మూడేళ్ల వయసు పిల్లలు ఇంట్లో కూర్చోవడం కంటే ప్లేస్కూల్, డేకేర్, పార్క్‌లు, బర్త్‌డే పార్టీలు అంటూ తోటి పిల్లలతో ఎక్కువగా కలుస్తుంటారు. ఒకరి చేతిలోని బొమ్మ మరొకరి చేతిలోకి.. ఒకరి చేతిలోని బిస్కెట్ మరో నోట్లోకి.. ఇలా వైరస్‌లకు ప్రయాణ మార్గాలు బోలెడన్ని!
అందుకే ఈ వయసులో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా తరచూ రావచ్చు. ఆరోగ్యంగా ఉన్న చిన్నారులకు సంవత్సరంలో సుమారు 68 జలుబులు కూడా రావచ్చు. డేకేర్‌లో ఉన్నవారికి ఇంకా ఎక్కువ రావచ్చు. అలాగే, సరైన నిద్ర లేకపోవడం, రోజూ ఒకే రకమైన ఆహారానికే పరిమితం కావడం కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే, అనవసరమైన యాంటీబయాటిక్ మందులను సొంతంగా వాడటం. సాధారణ వైరల్ జలుబుకు యాంటీబయాటిక్స్ పనిచేయవు.
పది బలమైన అడుగులు!
చాలాసార్లు చిన్నారుల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి వారి రోజువారీ జీవనశైలే అసలు బలం. అయితే, రోగనిరోధక శక్తి ఒక్కరోజులో పెరగదు. ఒక్కో అడుగు అధిగమిస్తూ ఆరోగ్యాన్ని సాధించాలి.
1. ప్లేట్లో రంగుల ఆహారం: రోజూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు/పప్పుదినుసులు, గుడ్డు/పాలు/పెరుగు, అవసరానికి అనుగుణంగా చేప/మాంసం వంటి ప్రోటీన్ వనరులను మార్చి మార్చి ఇవ్వాలి.
2. ప్రతి భోజనంలో ప్రొటీన్: ప్రతి చిన్నారికి తగిన ప్రొటీన్ వారి పెరుగుదలకు, రోగనిరోధక వ్యవస్థకు అవసరం. ప్రతి రోజూ ఆహారం ద్వారా ప్రొటీన్ అందేలా చూడాలి.
3. పండ్లు కూరగాయలు తప్పనిసరి: రోజులో పలు రకాల రంగుల పండ్లు, కూరగాయలు ఇవ్వండి. జ్యూస్ కంటే పండు ముక్కలు/మొత్తం పండు మంచిది.
4. తగిన నిద్ర: 3 ఏళ్ల పిల్లలకు సాధారణంగా 24 గంటల్లో సుమారు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేయండి.
5. రోజూ చురుకైన ఆట: బయట సురక్షితంగా పరుగెత్తడం, ఆడటం, సైకిల్/బంతి ఆటలు వంటి శారీరక చలనం పిల్లల మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది.
6. చేతులు కడుక్కోవడం నేర్పండి: తినే ముందు, టాయిలెట్ తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, దగ్గు/తుమ్ము తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయండి.
7. టీకాలు మిస్ కాకూడదు: జాతీయ టీకా షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు పూర్తి చేయడంతో పాటు పిల్లల వయస్సు, ఆరోగ్య పరిస్థితికి తగిన సిఫారసు చేయబడిన టీకాల గురించి బాల వైద్యుడిని అడగండి.
8. పొగ రహిత ఇల్లు: సిగరెట్/బీడీ పొగతో పాటు ఇతర పొగ, ధూళి, వాయు కాలుష్యాన్ని తగ్గించండి. ఇంట్లో ఎవరూ పిల్లల దగ్గర పొగ తాగకూడదు.
9. జబ్బుపడినప్పుడు విశ్రాంతిద్రవాలు: జలుబు వచ్చినప్పుడు బలవంతంగా తినిపించడం కంటే తగిన ద్రవాలు, విశ్రాంతి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వడం ముఖ్యం.
10. సిరప్ కోసం పరుగెత్తకండి: వైద్యుడు సూచించని మల్టీవిటమిన్లు, జింక్, ప్రోబయోటిక్స్ లేదా హెర్బల్/ఇమ్యూనిటీ బూస్టర్లను ప్రతిరోజూ ఇవ్వడం అవసరం కాదు. లోపం ఉంటే దాన్ని గుర్తించి సరిచేయడం ముఖ్యం.
వైద్యుడిని సంప్రదించాలి?
కొన్ని లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వాటిల్లో ముఖ్యంగా పిల్లాడి బరువు, ఎత్తు వయసుకు తగ్గట్టు పెరగకపోవడం లేదా బరువు తగ్గడం, పదేపదే న్యుమోనియా రావడం, తీవ్రమైన చెవి లేదా సైనస్ ఇన్ఫెక్షన్లు తిరిగి రావడం. నోరు లేదా చర్మంపై పదేపదే తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇవ్వాల్సిన రావటం, దీర్ఘకాలిక విరేచనాలు వంటి సమస్యలున్నా నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీళ్లు తాగలేకపోవడం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
తల్లిదండ్రులకు ఈ ఫార్ములా!
ఇమ్యూనిటీకి పెద్ద పెద్ద నియమాలు గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. ఈ చిన్న ‘54321 ఫార్ములా’ గుర్తుంటే చాలు! 5 అంటే రోజూ రకరకాల పండ్లు, కూరగాయలకు ప్లేట్లో చోటివ్వాలి. 4 అంటే భోజనం, ఆట, నిద్ర, పరిశుభ్రత.. ఈ నాలుగింటికీ క్రమబద్ధమైన అలవాటు ఉండాలి. 3 అంటే రోజువారీ ఆహారంలో మూడు పోషక స్తంభాలు.. ప్రొటీన్ , పండు లేదా కూరగాయ, తగిన ధాన్యం లేదా ఆరోగ్యకరమైన కొవ్వు. 2 అంటే జంక్‌ఫుడ్, అధిక చక్కెరతో పాటు అనవసరమైన మందులనూ తగ్గించాలి. ఇక 1 పిల్లల ఎదుగుదల, టీకాలు, తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లను గమనిస్తూ వైద్యుడితో ఎప్పటికప్పుడు సమీక్ష చేయించాలి. ఇమ్యూనిటీకి ఇదే అసలైన ‘బూస్టర్ ప్యాక్’!
డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్
ఇదీ చదవండి: మెగ్నీషియం సప్లిమెంట్‌ని డాక్టర్లు చెప్పకుండా ఎడాపెడా వాడొద్దు!
Tags : 1