వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
పాత న్యూస్ పేపర్లు పడేయకండి.. ఇలా చేస్తే స్టైలిష్ బ్యాగ్స్ రెడీ!
Published on Sat, 09/26/2026 - 09:26
ఉదయం లేచిన నుంచి .. పాలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్, కూరగాయలకు ప్లాస్టిక్ కవర్, పండ్లకు ప్లాస్టిక్ కవర్.. బేకరీకి వెళ్తే ప్లాస్టిక్ కవర్.. ఇలా ప్రతీ అవసరానికి మనం ఒకరోజులో 5 నుంచి 10 వరకు ప్లాస్టిక్ కవర్‌లను వాడిపడేస్తూనే ఉంటాం. అలా కోట్లాది ప్లాస్టిక్ కవర్‌లు ప్రతి రోజూ భూమి, నీరుని కలుషితం చేస్తూనే ఉన్నాయి. పర్యావరణానికి భారంగా మారుతూనే ఉన్నాయి. అందుకే ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగ్‌లను ఉపయోగిస్తే పర్యావరణానికి మనం ఎంతో మేలు చేసినవారమవుతాం.
కాస్త సృజనాత్మకత, కొద్దిగా ఓపిక ఉంటే చాలు.. ఇంట్లోని వేస్ట్ మెటీరియల్‌తోనే వండర్స్ క్రియేట్ చేయవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, షాపింగ్ నుంచి గిఫ్ట్ ప్యాకింగ్ వరకు అన్నింటికీ ఉపయోగపడే స్టైలిష్ పేపర్ బ్యాగులను ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పాత న్యూస్ పేపర్లు, చార్ట్ పేపర్లు, క్రాఫ్ట్ పేపర్లతో తక్కువ సమయంలోనే ముచ్చటైన సంచులను తయారుచేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు
పాత న్యూస్ పేపర్లు, క్రాఫ్ట్ పేపర్లు, మందపాటి చార్ట్ పేపర్లు, కత్తెర, గమ్ లేదా డబుల్ సైడ్ టేప్, పంచ్ మెషిన్ (హ్యాండిల్స్ కోసం రంధ్రాలు చేయడానికి), పాత తాళ్ళు, రిబ్బన్లు లేదా జనపనార దారం– హ్యాండిల్స్ కోసం.
క్లాసిక్ న్యూస్ పేపర్ గ్రాసరీ బ్యాగ్
ఇది రోజువారీ కూరగాయలు, కిరాణా సామాగ్రి కోసం ఉపయోగించే సాధారణ బ్యాగ్.
- విధానం: రెండు లేయర్ల వార్తాపత్రికను తీసుకోండి (మందంగా ఉండటానికి). దీనిని దీర్ఘచతురస్రాకారంలో మడిచి, అంచులను గమ్‌తో అతికించి ఒక సిలిండర్ ఆకారాన్ని తయారు చేయండి. కింద ఉన్న భాగాన్ని కనీసం 2–3 అంగుళాలు పైకి మడిచి, త్రిభుజాకారపు అంచులతో బాక్స్ లాంటి అడుగు భాగాన్ని తయారు చేసి గమ్‌తో గట్టిగా అతికించండి. పైభాగాన్ని కొద్దిగా లోపలికి మడిచి, పంచ్ మెషిన్ సహాయంతో రంధ్రాలు చేసి పాత తాళ్ళను హ్యాండిల్స్‌గా కట్టండి.
ఫ్లాట్ బాటమ్ షాపింగ్ బ్యాగ్
బరువులను మోయగల షాపింగ్ బ్యాగ్ ఇది.
- విధానం: ఒక పెద్ద చార్ట్ పేపర్ తీసుకుని దానిని సగానికి మడిచి, చివరలను అతికించండి. బ్యాగ్ ఇరుపక్కల లోపలికి మడతలు పెట్టండి, దీనివల్ల బ్యాగ్ వెడల్పు పెరుగుతుంది. అడుగు భాగాన్ని చతురస్రాకారంలో మడిచి, దానికి స΄ోర్ట్ కోసం ఒక చిన్న గట్టి కార్డ్‌బోర్డ్ ముక్కను లోపల అడుగున అతికించండి. పైన రిబ్బన్లు అమరిస్తే అందమైన షాపింగ్ బ్యాగ్ సిద్ధం.
గిఫ్ట్ ప్యాకింగ్ ఎన్వలప్ బ్యాగ్
పెళ్ళిళ్ళు లేదా పుట్టినరోజు వేడుకల్లో బహుమతులు ఇవ్వడానికి హ్యాండిల్స్ లేని ఈ బ్యాగులు బాగుంటాయి.
- విధానం: రంగుల క్రాఫ్ట్ పేపర్ లేదా డిజైనర్ పేపర్‌ను తీసుకోండి. ఒక కవర్ (ఎన్వలప్) ఆకారంలో వచ్చేలా మూడు వైపులా మడిచి అతికించండి. పైభాగాన్ని త్రిభుజాకారంలో లేదా వంపుగా కట్ చేసి, వస్తువు లోపల పెట్టిన తర్వాత కిందకు మడిచి క్లోజ్ చేసేలా ఒక అందమైన స్టిక్కర్ లేదా బో అతికించండి.
డీ–కట్ హ్యాండిల్ బ్యాగ్
తాళ్ళు కాకుండా పేపర్‌లోనే పట్టుకోవడానికి వీలుగా రంధ్రం ఉండే మోడల్ ఇది.
- విధానం: మందపాటి పేపర్‌తో సాధారణ బ్యాగ్ తయారు చేయండి. పైభాగాన్ని లోపలికి రెండు సార్లు మడిచి.. పట్టుకున్నప్పుడు చిరిగి΄ోకుండా ఉండటానికి గట్టిగా అతికించండి. ఇప్పుడు పైభాగం నుంచి ఒక అంగుళం కిందగా ‘డి’ ఆకారంలో కత్తెరతో కట్ చేయండి. ఇప్పుడు తాళ్ళ అవసరం లేకుండా నేరుగా చేతితో పట్టుకోవడానికి వీలైన హ్యాండిల్ బ్యాగ్ తయారవుతుంది.
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఖాళీ సమయంలో పిల్లలతో కలిసి ఇలాంటి పేపర్ బ్యాగులను తయారు చేయడం వల్ల వారికి పర్యావరణ స్పృహ కలుగడమే కాకుండా సృజనాత్మకత కూడా పెరుగుతుంది.
ఇదీ చదవండి: రెస్ట్ అంటే గంటల తరబడి కాదు.. ఈ చిన్న బ్రేక్ చాలు!
Tags : 1