నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి?
Published on Sun, 09/20/2026 - 09:02
తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు బాగా ఫాలో అవుతుందేమో, సింహం అద్దం ముందు నిలబడి గడ్డం సవరించుకుంటూ దరహాసంతో ‘నేను సింహంలాంటి దాన్ని’ అనుకుంది.
వెంటనే, ‘ఛ... ఛ... నేను సింహంలాంటి దాన్నేమిటీ? నేనే సింహాన్ని’ ఆలోచనను సవరించుకుంది. ‘ఈ అడవికి రాజును. ఏనుగు నుంచి ఎలుకపిల్ల వరకు, మహావృక్షం నుంచి గడ్డిపరక వరకు, పక్షి నుంచి పారాడే పురుగు వరకు ప్రతిదీ నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!’
ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, గుహ బయటికి రావటానికి సమాయత్తమవుతుంటే, మనసుకు ఏదో సంకేతం అందుతున్నట్టు అనిపించింది.
ఏమిటది?
కొత్త ఉపద్రవమా?
అడవుల్లో వుండే జంతువులకి, పక్షులకి, ఇతర జీవచరాలకీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు జీవితమే! ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకనూ ఉపద్రవమే! క్రూర జంతువుల రూపంలో, వేటగాళ్ల రూపంలో. అయినా తను ఈ అడవికి రారాజు. తనకి ఎవరివల్ల ఉపద్రవం ఉంటుంది? తనే మిగిలిన జంతుజాలానికి ఉపద్రవం కాని. తనని తాను సమాధానపరచుకుంది సింహం.
ఆలోచిస్తూ గుహ బయటికి వచ్చి బోర విరుచుకు నిలబడి చుట్టూ ఒకసారి తేరిపార చూసింది. ఎదురుగా కుక్క, నక్క!
పుట్టుకతో బద్ధశత్రువులైన రెండూ అక్కడ ఒకదాని పక్క మరోటి నిలబడి వున్నాయి– అదీ పెళ్లి చేసుకున్న ఆనవాళ్లతో, అలంకరణలతో...
సింహాన్ని చూసి కుక్క అంది ‘మహారాజా, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.’
సింహం తన కళ్ళని తానే నమ్మలేక పోయింది.
‘పెళ్లా? మీరా?’ అన్నది పైకి.
‘చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? పరస్పరం కలహించుకునే రెండు జాతులు పెళ్లి చేసుకోవటం ఉపద్రవం కాక మరేమిటీ?’ మనసులో అనుకుంది.
‘అవును మహారాజా. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వదించండి’ ఈసారి నక్క అంది వినయంగా. దాని వినయం తెలుస్తూనే వుంది.
‘మీ ఇళ్లల్లో ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి?’
‘లేదు మహారాజా. విభిన్న జాతుల మధ్య ప్రేమను సమాజం ఎప్పుడూ సులభంగా అంగీకరించలేదు. అయినా మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. మా అభిప్రాయాలు కలిశాయి. మేము పెళ్లి చేసుకున్నాము. ఇతరులతో మాకు పనేముంది మహారాజా?’ అంది కుక్క.
‘అభిప్రాయాలు కలవటమా? అసలు మీ జాతులే వేరైనప్పుడు, అలవాట్లే వేరైనప్పుడు, అభిప్రాయాలు కలవటం వింతగా వుంది.’
‘అభిప్రాయాలు కలవటానికి, జాతులు వేరవటానికి సంబంధమేమిటి మహారాజా. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాల్లో చూళ్ళేదూ హీరో హీరోయిన్లు దెబ్బలాడుకుంటూనే ప్రేమలో పడటం. ఇదీ అంతే అనిపించింది.’
‘మనుషుల గురించి వదిలెయ్యండి. సృష్టిలో వాళ్ళని మించిన నమ్మక ద్రోహులు, స్వార్థపరులు మరెవరూ వుండరు. ఒక పని చేస్తే కొంత లాభం వస్తుందనుకుంటే స్వంత వాళ్లనే వదులుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి నీతి, జాతి లేని వాళ్ళతో– మనకి పోలికేమిటి?’ సింహం గర్జించింది.
ఆ అరుపుకు కుక్క, నక్క గాభరా పడ్డాయి.
‘అవసరం కోసం మనుషులు ఎంతకిందికైనా దిగజారతారు. డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారు. అలాంటి వాళ్ళు అంతకంటే మంచి సినిమాలు తియ్యలేరులే. అయినా– సినిమాలు చూసే మీరు ఇవన్నీ చేశారా?’ సింహం అడిగింది.
‘అవును, కాదు’ల మధ్యగా రెండూ తల ఊపాయి.
‘అయినా ఒక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. రేపు మీ పిల్లల్ని తోటి సమాజం సంకర జాతి అని హేళన చెయ్యదా?’
రెండూ తలలు వంచుకున్నాయి– తప్పు చేసిన వాళ్ళలా.
‘దానికంటే ముఖ్యంగా’ సింహం కుక్కని చూసి, ‘విశ్వాసానికి ప్రతీకగా నిన్నూ’ అని నక్క వైపు చూసి, ‘వంచనకు, అతి వినయానికి గుర్తుగా నిన్నూ చెప్తారు కదా. రేపెప్పుడైనా ఈ అడవిలో మిగిలిన జంతువులు మిమ్మల్ని ఒకరి గురించి మరొకరి ముందు అలా అవహేళన చేస్తే మీరు తట్టుకోగలరా?’
సమాధానం ఏం చెప్పాలో తెలీక కుక్కా, నక్కా రెండూ మౌనంగా ఉండిపోయాయి.
సింహమే అంది ‘రేపు మీ పిల్లలకి మీ అసలు బుద్దులు తారుమారై.. నక్క విశ్వాసం, కుక్క వినయం వస్తే, మిగిలినవి వాటిని ఎగతాళి చేస్తే వాటి చిన్ని మనసుకు గాయం అవ్వదా?’
‘మహారాజా, క్షమించండి. దాని గురించి మేము ఇంకా ఆలోచించలేదు కానీ, విషయం అంతదాకా వస్తే, మా పిల్లలు ఈ అడవిలోనే, ఈ జంతువుల మద్యే ఉండాలన్న నియమమేమీ లేదు కదా. రేపు మా పిల్లలు మెరుగైన జీవితం కోసం, దేశంలోని ఇంకో అడవికో, మరోదేశానికో వలస పోవచ్చు. మనుషులు కూడా అలానే దేశాంతరం వెళుతున్నారు కదా?’ ప్రశ్నించింది నక్క.
సింహానికి ఇది వాదనలతో తెగే వ్యవహారంలా అనిపించలేదు. ‘మూర్ఖులతో వాదించటమంత మూర్ఖత్వం లేదు’ అనుకుంది.
చివరగా అంది ‘సరే అయిందేదో అయింది. ఇద్దరూ కుటుంబ సమస్యలతో వీధికెక్కకుండా నడుచుకోండి. ఇప్పటి ఏకాభిప్రాయాలు రేపటి అభిప్రాయభేదాలు కానివ్వకండి. అలాటిదేదైనా ఉంటే, ఇద్దరూ సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోండి. జంతు సమాజం మొత్తం కళ్లన్నీ మీమీదే ఉంటాయి. రేపేదైనా జరిగితే మీ బతుకు ఎగతాళి అవుతుంది. జాగ్రత్తగా మసలుకోండి. నా అవసరం మీకు రాకూడదనే కోరుకుంటున్నా. ఒక వేళ వస్తే మాత్రం నాకు కబురుపెట్టి కలవండి.’
దీవించినట్టు చెయ్యెత్తింది సింహం. కుక్క, నక్క కృతఙ్ఞతలు చెప్పి బయలుదేరాయి. ఆ ఇద్దరూ వెళ్లిపోయాక అడవి మళ్లీ నిశ్శబ్దమైంది.
కానీ ఆ నిశ్శబ్దంలో ఒక గడ్డిపరక మాత్రమే వంగి నిలబడింది. ఏడురోజులుగా అది నీటిని తాకలేదు; సూర్యరశ్మిని కూడా స్వీకరించలేదు. బాగా వడలిపోయివుంది. దాని సమస్యేమిటో ఎవ్వరికీ తెలీదు. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలీక అది కూడా సతమతమవుతోంది. ఈ విషయం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్ట ఒకటి గమనించింది. దాన్ని రారాజు సింహం వేగుగా నియమించుకుంది. రాజ్యంలోని క్షేమసమాచారాల్ని రాజుకు విన్నవించటమే దాని పని. సరిగ్గా– రెండురోజుల తర్వాత సింహం నుంచి గడ్డిపరకకు పిలుపొచ్చింది. గడ్డి భయంభయంగానే రాజు దగ్గిరకి పయనమయ్యింది.
∙∙
పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్లు, నక్కలు, జింకలు, పాములు, పక్షులు, చెట్టు, పుట్ట సహా అడవిలోని ప్రతి ప్రాణి, జీవి ఈ సమావేశానికి హాజరు కావలసిందే అని సింహం హుకుం జారీచేసింది. అన్నీ వచ్చి ఆసీనులయ్యాయి.
సమావేశం ప్రారంభమయింది. క్షేమసమాచారాలయ్యాక– సింహం గడ్డిపరకని ఎగాదిగా చూసి ‘ఏమిటి నీ సమస్య?’ అడిగింది.
‘వ్యక్తిగతంగా అయితే నాకు ఏ సమస్యా లేదు మహారాజా. ఇది మా సమూహం మొత్తం సమస్య. సమస్యలు ఎవరూ తమ దృష్టికి తీసుకురావటంలేదు అంటే దానర్థం సమస్యల్లేవని కాదు మహారాజా. పరిష్కారం లభిస్తుందో లేదోనని’ అర్ధోక్తిలో ఆపుచేసింది గడ్డిపరక.
‘పరిష్కారం లేని సమస్యలేమీ వుండవు. కాకపోతే, చిత్తశుద్ధే కావాలి. ముందసలు నీ సమస్యేమిటో చెప్పు, పరిష్కరించ టానికి ప్రయత్నిస్తా’ అంది సింహం.
‘మహారాజా, మా సమస్యలు రెండు. ఒకటి ఆత్మగౌరవం. రెండు సామాజికం.’
సింహం ఆశ్చర్యంగా చూసింది.
గడ్డిపరక చెప్పటం మొదలెట్టింది.
‘అవును మహారాజా, అందరూ... ముఖ్యంగా మనుషులు మమ్మల్ని ‘గడ్డిపరక’ అంటూ హేళనగా మాట్లాడతారు. మేము వారికి ఎంత సేవ చేస్తామో, ఎంతగా ఉపయోగపడతామో తమకు మాత్రం తెలీదా? అందరూ పలుచన చేస్తున్నట్టు మేమంతా విడివిడిగా పరకలమే కావొచ్చు కానీ, ఐకమత్యంగా ఏనుగునే బంధించిన మా చరిత్ర గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం వింత కాదు, కొత్త కూడా కాదు.’
గడ్డిపరక గతవారం రోజుల్నించి ఆహారంగా కనీసం నీటిని కూడా పీల్చుకోకపోవటాన వచ్చిన నీరసంతో ఆగింది. క్షణం తర్వాత తిరిగి కొనసాగించింది.
‘సమస్త భూమండలంలో మనుషులకి, పక్షులకి, జంతువులకి మాత్రమే కాదు, మాకు కూడా ప్రాణం ఉంటుంది మహారాజా. ఆ మాటకొస్తే అన్నిటికంటే అల్పప్రాణులం మేమే. ఈ సృష్టిలో మిగతా ఎవ్వరికీ అపకారం తలపెట్టని జాతి అంటే మాదే. మనుషులు ప్రకృతిని, మిగిలిన ప్రాణుల్ని నాశనం చేస్తారు. కొన్ని క్రూర జంతువులు వేటాడి మరీ అవతలివాటిని చంపుతాయి. ప్రకృతి సిద్ధమైన నీరు ఇళ్లనీ, ఊళ్ళనీ ముంచేస్తుంది. నిప్పు దేన్నయినా తగలబెడుతుంది. గాలి ఎంతటి దాన్నయినా చెదరగొడుతుంది. మేమొక్కళ్ళమే– కేవలం మేమొక్కళ్ళమే ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా మా బతుకేదో మేం బతుకుతుంటాము. అలాంటిది మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు మహారాజా.
ఏనుగుల్లాంటి బలమైన జంతువులు ఒకసారి మా మీద కాలేస్తే అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. కొన్ని కొన్నిసార్లు పునర్జన్మ అంటూ కూడా ఉండదు. మేకలు, గొర్రెలు, కుందేళ్లు తమతమ కోర పళ్లతో కొరికి పరపరా నములుతుంటే మా బాధ వర్ణనాతీతం. అదైనా పర్లేదు మహారాజా, పుట్టి నాల్రోజులు కూడా కాని పచ్చటి పసికందు పసరికల్ని కూడా వదలకుండా అలానే తింటుంటే, మా కళ్ళముందే అవి నిర్జీవమై పోతుంటే, మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మహారాజా. తలచుకుంటుంటేనే కడుపు తరుక్కుపోతుంది.’ గడ్డిపరక కన్నీరు పెట్టుకుంది.
సింహానికి జాలేసింది. కానీ, దాని బాధ విచిత్రంగా అనిపించింది. ఏనుగులాంటివి నడుస్తుంటే గడ్డి నలగదా? కుందేళ్ళ ఆహారమే పసిరిక ఐతే వాటిని తినకూడదా? మరి జంతువులు నడవకూడదా? మేకలు పస్తులుండాలా? సృష్టిలోని ప్రతి జీవి మనుగడకి ప్రకృతి కొన్ని దిశానిర్దేశాలు చేసింది కదా. అది కాకూడదంటే ఎలా? ఆ మాటే గడ్డిపరకతో అంది.
‘గడ్డీ! నీ కోరికెందుకో విచిత్రంగా అన్పిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకారం పులులు, సింహాలకి మిగిలిన జంతువులే ఆహారం.
గద్దలకి కోడిపిల్లలు ఆహారం. పాములకు కప్పలు ఆహారం. అలాగే నువ్వూ కొన్నిటికి ఆహారం. పెద్దపెద్ద జంతువులు నడుస్తుంటే నువ్వే కాదు, కొన్ని వేల జీవరాశులు కంటికి కనిపించనివి మరణిస్తుంటాయి. అంత మాత్రం చేత అవన్నీ నిషిద్ధమైతే ఎలా? అయినా– నీ బాధేమిటో నాకు స్పష్టంగా అర్థం కావటం లేదు. ఇంకొంచం వివరంగా చెప్పు.’
‘అదే మహారాజా, నేనూ అక్కడికే వస్తున్నా. ప్రకృతి ధర్మం ఎప్పుడూ బలవంతుల వైపే ఉంటుంది. ఎందుకంటే– అది తయారుచేసేది బలవంతులు, అధికారం ఉన్నవాళ్ళే కదా. అల్పప్రాణులమైన మాలాంటి వాళ్ళు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. అంతెందుకు మహారాజా, ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పండి. ఒక మనిషి కారులో వెళుతున్నాడనుకోండి. ఒక సైకిలో, స్కూటరో తెలిసో, తెలియకో ఆ కారుకి అడ్డంగా వస్తే అతడెంత కోప్పడతాడు? వీలైతే ఒకసారి తొక్కిస్తే, జీవితంలో ఇంకెప్పుడూ ఇలా ఎవరికీ అడ్డుపడకూడదనే గుణపాఠం నేర్పించాలనుకుంటాడా లేదా? మరి అదే మనిషి కారుకి ఏ లారీనో, బస్సో ఎదురుగా వస్తే ఏమనుకుంటాడు? మనసులో వాళ్ళను తిట్టుకున్నా ‘వాడితో మనకెందుకులే గొడవ? పక్కకి జరిగి వెళితే మనకే మంచిది’ అనుకుంటాడు కదా.
ఒకే మనిషి ఒకే సందర్భంలో రెండు రకాలుగా ఎందుకు ఆలోచించాడు? తనకంటే బలహీనమైన సైకిలువాణ్ణి చూస్తే ఎందుకు కొట్టాలనిపించింది? బలవంతుణ్ణి చూస్తే శాంతం దానంతట అదే ఎందుకు, ఎలా వచ్చింది? అంటే – మనిషి ఆలోచన, ధర్మం.. సందర్భాన్ని బట్టి మారాయి తప్ప ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం కాదు కదా? ఐతే – ఇక్కడ నేను మనిషి ఆలోచనా విధానం గురించి ఎందుకు చెప్పానంటే, మనలో చాలామంది ఇప్పుడు మానవుల్లాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మహారాజా, నా ప్రశ్న న్యాయమైనదా కాదా? పరిష్కరించవలసిందా కాదా?’
అన్ని ప్రాణులు ఆశ్చర్యంగా చూస్తుంటే, గడ్డిపరక చేతులు జోడించి ‘మహారాజా, ఇప్పుడు మీరు చెప్పబోయే పరిష్కారం భవిష్యత్ తరాలకు, మాలాంటి అల్ప జీవులకు ఒక వేదం కావాలి. దయచేసి అన్నీ అలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం’ వినమ్రంగా అంది.
మిగిలిన జంతువులు, పక్షులు అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నాయి. ఇన్నాళ్లూ తాము ఎప్పుడూ ఈ కోణంలోంచి ఆలోచించలేదు. ఏదో పుట్టాం... తింటున్నాం... బతుకుతున్నాం... అనుకుంటున్నామే గానీ, మొదలేదో తుదియేదో తెలీని అంత అల్పప్రాణి గడ్డిపోచలో ఇంత ఆలోచన ఉందా? దాని గుండెల్లో ఇంత విషాదం గూడుకట్టుకుని ఉందా?
రాజైన సింహం దానికి ఏం సమాధానం చెప్పబోతుందో అని జంతువులు, పక్షులు, మిగిలిన జీవజాలం అన్నీ చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా వున్నాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ అందుకోసం ఎదురుచూస్తున్నాయి.
ఇప్పుడు సింహం చెప్పబోయే సమాధానం భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం అవుతుంది. చరిత్ర పుస్తకంలో అది ఒక పాఠమవుతుంది. ఎన్నో ఒడిదుడుకులు చూసి, జీవితాన్ని కాచి వడబోసిన సింహం దీనికి ఏం సమాధానం చెబుతుంది?
ఇన్ని రోజులూ ఒకెత్తు! ఇక మీదట మరోఎత్తు! సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంటుంది. అవతలి వాళ్ళని బాధపెట్టి, వారి బలహీనతల్ని సోపానాలుగా మార్చుకుని పైకెదిగే, ఎదగాలనుకునే వాళ్ళ ఆలోచనలకు ఇపుడు సింహం ఇవ్వబోయే తీర్పు ఒక చెంపపెట్టు కావాలి. అన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సింహం కూడా ఆలోచనలో పడింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కోణం ఇది. ఎప్పుడూ ఎదుర్కోని ప్రశ్న. ప్రశ్న చాలా చిన్నదే. కానీ, జవాబు చాలా పెద్ద చిక్కే. ఏం సమాధానం చెప్పాలి? ఎదో ఒక తీర్పయితే చెప్పొచ్చు, కానీ అది ఎవ్వరినీ నొప్పించకూడదు. అందరినీ ఒప్పించగలగాలి. చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోయేటప్పుడు అన్ని విషయాలూ కూలంకషంగా ఆలోచించాలి.
తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యను అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించాలి. రేప్పొద్దున ఎవరూ తనని గాని, తానిచ్చిన తీర్పుని గాని వేలెత్తి చూపకూడదు. దానికి గానూ, సింహానికి తనకున్న అనుభవం చాలదనిపించింది. దీని గురించి తన మంత్రులతో, న్యాయ కోవిదులతో, మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకు గానూ కొంత సమయం పడుతుంది.
ఆ మాటే చెప్పింది ‘ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గడ్డిపరక చిన్నదే కానీ, అదడిగిన ప్రశ్న భూమండలమంత పెద్దది. అంతపెద్ద సమస్యకి సమాధానం ఒక నిమిషంలో వెల్లడించతరం కాదు. దానికిగానూ నాక్కొంత సమయం కావాలి. నాలుగోరోజు ఉదయం తిరిగీ మనందరం ఇక్కడే కలుద్దాం. అప్పటికి నేను దీనికి ఒక న్యాయసమ్మతమైన పరిష్కారం కనుగొనగలనని భావిస్తున్నాను. అందరూ సహకరించగలరని విజ్ఞప్తి.’
సింహం లేచింది. అన్ని జంతువులూ అక్కణ్ణించి నిష్క్రమించాయి. ఆ రాత్రి అడవిలో ప్రతి జీవి ఒకే ప్రశ్నతో నిద్రపోయింది– గడ్డిపరకకు న్యాయం జరుగుతుందా?
∙∙
అయితే– రేపు తీర్పు అనగా, ముందురోజు రాత్రి. చిన్నగా ప్రారంభమైన వర్షం పెనుతుఫానుగా మారింది. చెట్లు నేల కూలాయి, రాళ్లు విరిగి పడ్డాయి, కొండలమీది నుంచి ప్రవహించిన నీరు అడ్డొచ్చిన ప్రతి ఊరునీ, వాడనీ తనలో కలిపేసుకుని సముద్రంలో లీనమైంది. అడవిలోని జంతువులు చెల్లాచెదురయ్యాయి. మిగిలిన జీవరాశులు కకావికలమయ్యాయి. ఎన్ని బతికాయో, ఎన్ని చనిపోయాయో ఎవరికీ తెలీదు. సింహం గుహ మొత్తం కూలబడింది. ఆ అర్ధరాత్రిలో, ఆ నిశీధిలో ఎవరు ఎటువైపు వెళ్లాలో తెలీక పక్షుల అరుపులు, జంతువుల రోదనలు, హాహాకారాలు... వెరసి అదొక శ్మశానాన్ని తలపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా – నేనే బలవంతుడినని గర్వపడిన ఏనుగుల్లేవు.
రాజునని అహంకరించిన సింహాల్లేవు. పరులని మోసగించే నక్కల్లేవు. పక్షులకి గూళ్ళులేవు. పాములకు బొరియల్లేవు.
పులులూ, అడవి దున్నలూ, జింకలూ, కొమ్ములు విసిరే ఎద్దులూ– ఏవీ లేవు. దేని జాడా తెలియటం లేదు. ఉన్నదల్లా నిర్జనమైన అడవి, నిర్వీర్యమైన ప్రకృతి, శ్మశాన నిశ్శబ్దం!
అప్పడు, ఆ దృశ్యం ‘ఎంతటి బలవంతుడైన ప్రకతి ముందు దిగదుడుపే’ అన్న జీవిత సత్యాన్ని చెబుతుంది.
తెలుసుకున్న వాళ్లకి తెలుసుకున్నంత.
తెల్లవారింది.
ఆ నిర్జనారణ్యంలో, ఆ శ్మశాన సమాధుల్లో, అల్లకల్లోలాల మధ్యలో... కొండాకోనల వెనకనించి దిక్కుల్ని చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యకిరణాలు.!
భూమి బద్దలైనా, ఆకాశం తలక్రిందులైనా, సముద్రాలు ఉప్పొంగినా... అలుపెరగని సైనికుడిలా, నిద్రావస్థ నుంచి ప్రపంచాన్ని జాగృతం చేయటానికి అప్పుడప్పుడే భూమిపైకి వస్తున్న తొలి రవికిరణాలు! వాటినే చూడటానికన్నట్టు ధీటుగా నిలబడ్డ గడ్డిపోచ ఒకటి! నడుము మీద చెయ్యేసి, రొమ్ము విరగదీసి సూర్యుడికి అభిముఖంగా, దమ్ము చూపిస్తూ నిటారుగా నిలబడ్డ ఆ గడ్డి పరక... ఏం పాఠం చెబుతుంది?
కొన్నిసార్లు తగ్గటమే– నెగ్గటం – ప్రపంచంలో అయినా, జీవితంలో అయినా!
‘ప్రకృతికి, పరమాత్ముడికి ఎంతటి వీరుడైనా, ధీరుడైనా తలవంచాల్సిందే’ అర్థం చేసుకున్నోళ్లకి అర్థం చేసుకున్నంత!!
తనను తాను బ్రహ్మంగా భావించిన సింహం కనుమరుగైంది. బ్రహ్మంలో తానొక భాగమని తెలుసుకున్న గడ్డిపరక మాత్రం నిలిచింది.
అహం బ్రహ్మాస్మి!!
సడ్డా సుబ్బారెడ్డి
ఇదీ చదవండి: ‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!
Tags : 1