నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
Published on Sun, 09/20/2026 - 08:22
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.
ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.
పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.
కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.
పాటల్లో పలికే రైతు జీవితం..
ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.
- రమా జంబుల
ఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
Tags : 1