విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
క్యాన్సర్‌పై ఢీకి.. ‘రెడీ’యేషన్
Published on Tue, 09/08/2026 - 16:57
రేడియేషన్ చికిత్సలకు ఉన్న చరిత్ర దాదాపు 130 ఏళ్లు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రేడియో యాక్టివ్ మెటీరియల్‌ను కనుగొన్నది 1986లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త. అంటే... ఈ ఏడాదికి 2026 ఏడాదికి ఖచ్చితంగా 130 ఏళ్లు నిండుతాయి. ఇక నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ – పోలోనియం, రేడియమ్ వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుగొన్నాక ఈ చికిత్స ప్రాధాన్యం మరింత పెరిగింది. దాదాపు ఈ దశాబ్దకాలంలో రేడియో యాక్టివ్ మెటీరియల్‌తో క్యాన్సర్‌కు చికిత్సలు చేయడంలో అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది.
1970లకు ముందున్న కాలంలో ఎక్స్–రేల రూపంలో వైద్యరంగానికి సేవలందించిన రేడియేషన్ 1970ల తర్వాత సీటీ, ఎమ్మారై లుగా... ఆ తర్వాత 1980లలో పెట్ స్కాన్ వంటి రూపాలలో వైద్యచికిత్సలకు తోడ్పడుతూ వచ్చింది. అటు తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ (ఐజీఆర్టీ) వంటి ఎన్నో కొత్త పద్ధతుల్లో ఈ రేడియేషన్ వైవిధ్య భరితమైన చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక రేడియేషన్చికిత్సల్లోని అనేక అంశాలను పరిశీలిద్దాం.
క్యాన్సర్ రంగంలో అత్యంత పురోగతి తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ వంటి అత్యాధునికమైన చికిత్స ప్రక్రియలు రాకముందే దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన చికిత్స ప్రక్రియలు శస్త్రచికిత్సలూ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు. ఇందులో రేడియేషన్ థెరపీలో అనేక రకాల అడ్వాన్స్మెంట్లు చోటు చేసుకున్నాయి. ఆ పురోగతులూ, వాటి ఫలితాలేమిటో చూద్దాం.
రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి?
శక్తిమంతమైన ఎక్స్–రే వంటి రేడియేషన్స్‌ను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలపై నిశితంగా ప్రసరించేలా చూసి, ఆ కణాన్ని పూర్తిగా తుదముట్టించే చికిత్స ప్రక్రియను ‘రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ఈ కిరణాలు కణాల్లోని డీఎన్ఏ లేదా కణాల్లోని మౌలికాంశాలను దెబ్బతీసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. దాంతో ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం వల్ల క్యాన్సర్ కూడా తొలగిపోతుంది.
తొలి నాళ్లలో రేడియేషన్ అనేది అది క్యాన్సర్ కణమా లేదా ఆరోగ్యకరమైన కణమా అన్న విచక్షణ లేకుండా తాను ప్రసరించిన చోట ఉన్న కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉండటంతో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను సంరక్షిస్తూ, వాటికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రంగంలో వచ్చిన ఆధునిక పురోగతితో కేవలం క్యాన్సర్ కణాలపైనే గురిపెట్టగలిగేంత నిశితంగా రేడియేషన్ ఇవ్వడం సాధ్యమవుతోంది.
రేడియేషన్ థెరపీలో కొన్ని ముఖ్యమైన రకాలివి...
క్యాన్సర్ కణాలు / క్యాన్సర్ గడ్డ (ట్యూమర్) అనేది గుండె, మెదడు, వెన్నుపాము వంటి అత్యంత సున్నితమైన అవయవాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు రేడియేషన్‌ను మరింత జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు మెదడులోని అనేక ప్రాంతాలు దేహంలోని అనేక అవయవాలను నియంత్రిస్తుంటాయి. శస్త్రచికిత్స చేసే సమయంలో మెదడులోని ఏదైనా కీలకమైన అవయవాన్ని నియంత్రించే భాగం దెబ్బతింటే... ఆ అవయవం అచేతనమయ్యే అవకాశముంటుంది. రేడియేషన్ ప్రసరించినప్పుడు కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ... అత్యంత నిశితంగా కేవలం క్యాన్సర్ కణాన్నే గురిపెట్టి దెబ్బతీసే సాంకేతికతా ఇప్పుడు అందుబాటులో ఉంది.
ప్రధానంగా చెప్పాలంటే రేడియేషన్‌లో బయటి నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ), లోపలి నుంచి ఇచ్చే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీతో పాటు సిస్టమిక్ రేడియేçషన్ థెరపీ (ఎస్ఆర్టీ) అనే మరో రకమైన రేడియేషన్ ప్రక్రియలను చెప్పవచ్చు. ఈ రేడియేషన్ థెరపీలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని...
ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ)
త్రీడీ కన్ఫార్మల్ రేడియేషన థెరపీ – (3 డీసీఆర్టీ):
ఇందులో ముందుగా సీటీ వంటి స్కాన్ల సహాయంతో క్యాన్సర్ కణితి (ట్యూమర్) ఎంత పెద్దది, దాని ఆకృతి ఎలా ఉంది, అది దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది అని తెలుసుకుంటారు. ఆ కణితి ఆకృతికి తగ్గట్టుగా కేవలం దానికే తాకేలా రేడియేషన్ కిరణాలను పంపిస్తారు. మనకు కావాల్సిన మేరకే కాంతి ప్రసరించే ఒక పెన్టార్చ్ లాంటి దాన్ని ఊహిస్తే... ఈ పద్ధతిలో కేవలం మనకు కావాల్సిన చిన్న ప్రాంతంపైనే కాంతి పడినట్టే రేడియేషన్ కూడా పడుతుందని అనుకోవచ్చు.
దాంతో రేడియేషన్ అన్నది క్యాన్సర్ గడ్డపైనే పడుతూ... పక్కనున్న ఆరోగ్యకరమైన కణజాలానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తారు. మెదడు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి అనేక క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.
ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్టీ)
ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా జాగ్రత్తగా చూస్తూ ఇస్తారు. దేహంలో ఊపిరితిత్తులూ, డయాఫ్రమ్ లాంటివి నిత్యం కదులుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అలాంటి కదిలే అవయవాలకు రేడియేషన్ ఇవ్వడానికి ఈ ‘ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ’ ఉపయోగడుతుంది.
ఉదాహరణకు ఊపిరితీసుకునే సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతూ, ముడుచుకుంటూ... కదలికలతో ఉంటాయి. ఇలా కదిలే సమయంలో రేడియేషన్ అన్నది క్యాన్సర్ లేని మరో ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని తాకకుండా... అవయవం కదులుతున్నప్పటికీ... ఆ కదలికలకు అనుగుణంగా తన ప్రసరణను తానే నియంత్రించుకుంటూ కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశానికే రేడియేషన్ తాకేలా చూస్తుంది.
ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (ఐఎమ్ఆర్టీ)
ఇందులో వివిధ దిశల నుంచి అంటే రకరకాల కోణాలనుంచి రేడియేషన్ కిరణాలను క్యాన్సర్ కణితిపైకి పంపుతారు. ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో క్యాన్సర్ ఉన్నచోట తీవ్రమైన రేడియేషన్ తాకేలా, క్యాన్సర్ లేని చోట వీలైనంత తక్కువ రేడియేషన్ ప్రసరించేలా చూసే ఈ పద్ధతినే ‘ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డ మరో కీలకమైన ఆరోగ్యకరమైన అవయవానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు... ఆ ఆరోగ్యకరమైన అవయవానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (వీఎమ్‌ఏటీ)
అత్యంత ఖచ్చితమైన రీతిలో రేడియేషన్ ఇచ్చే ఈ ప్రక్రియలో రేడియేషన్ ఇచ్చే మెషిన్ క్యాన్సర్ బాధితుడి చుట్టూ తిరుగుతూ వివిధ కోణాల నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. దాంతో క్యాన్సర్ ఉన్న భాగానికి వీలైనంత ఎక్కువగానూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన అవయవాలకు వీలైనంత తక్కువ రేడియేషన్ తాకేలా చూస్తారు. ప్రోస్టేట్, కాలేయం, ప్రాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.
శరీరం లోపల నుంచే రేడియేషన్ ఇచ్చే పద్ధతులు
ఇప్పటివరకూ చెప్పిన పద్ధతులు కాకుండా... రేడియేషన్ వెలువడే పదార్థాన్ని శరీరంలోనే ఉంచి కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ దేహంలో ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. ఇలా రేడియేషన్ ఇవ్వడాన్ని ‘ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ’ అంటారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు.
బ్రాకీథెరపీ : ఈ ప్రక్రియలో రేడియోధార్మిక పదార్థాలను అతి చిన్న మోతాదులో దేహంలోని క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపి క్యాన్సర్ గడ్డకు అతి దగ్గరగా ఉండేలా చూస్తారు. ఈ అత్యంత చిన్న మోతాదులో ఉండే రేడియో యాక్టివ్ పదార్థాలు సాధారణంగా చిన్న ‘సీడ్స్’ (విత్తనాల్లాంటి చిన్న పదార్థాలు) రూపంలో ఉంటాయి. అవి అవి క్యాన్సర్గడ్డకు అతి దగ్గరగా ఉండటంతో ఆ రేడియేషన్ ప్రధానంగా క్యాన్సర్ ఉన్న ప్రాంతంలో ప్రభావవంతంగా ప్రసరిస్తూ, గడ్డను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), ఎండోమెట్రియంతో పాటు కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో దీనిని ఉపయోగిస్తారు.
ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ (ఐఓఆర్టీ)
ఇది కొంచెం ప్రత్యేకమైన పద్ధతి. క్యాన్సర్గడ్డకు శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలోనే రేడియేషన్ కూడా ఇస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బయటకు కనిపించేలా చేశాక... ఆ ప్రాంతానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తారు. అదే సమయంలో పక్కనున్న ఆరోగ్యకరమైన అవయవాలను రక్షించడానికి ప్రత్యేక రక్షణాత్మకమైన ప్రక్రియలను అనుసరిస్తారు. జీర్ణవ్యవస్థలోని కొన్ని క్యాన్సర్లతోపాటు శస్త్రచికిత్స చేయడం కష్టమైన కొన్ని ఇతర రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్)
పేరుకు ఇందులో రేడియోసర్జరీ అని ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స కానే కాదు. ఇందులో కత్తితో కోయడం ఉండదు. కాకపోతే ఇందులో చిన్న చిన్న రేడియేషన్ కిరణాలను ఒకేచోట కేంద్రీకృతంగా పడేలా ప్రయోగిస్తారు. దాంతో చాలా ఎక్కువ మోతాదులో తీక్షణంగా పడేలా చేయడంతో క్యాన్సర్ ప్రాంతంపై అత్యంత ఖచ్చితంగా / నిశితంగా కేంద్రీకరించేలా కిరణాలు ప్రసరిస్తాయి.
కీలకమైన మెదడు, తల, మెడ ప్రాంతాల్లోని కొన్ని కణుతులకు ఇది ఉపయోగపడుతుంది. మెదడులోని గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్), పిట్యుటరీ ట్యూమర్స్, మెనింజియోమాస్, అకాస్టిక్ న్యూరోమాస్ వంటి కణుతుల్లో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.
బయటే ఉండే మెషిన్ నుంచి రేడియేషన్ ఇవ్వగల మరికొన్ని ఆధునిక ప్రక్రియలివి...
ప్రోటాన్ థెరపీ : ఇందులోని సాంకేతికత సాధారణ రేడియేషన్ ప్రక్రియ కంటే కాస్తంత వేరుగా ఉంటుంది. ఇందులో ఎక్స్–రేస్ కాకుండాప్రోటాన్లతో రేడియేషన్ ఇస్తూ... ఈ ప్రోటీన్ బీమ్‌ను క్యాన్సర్ గడ్డ తాలూకు ఆకృతికీ, అది లోపల ఎంత లోతు ఉందో అంతే లోతు వరకు ప్రసరించేలా చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ కంటే లోతులో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ ప్రసరించకుండా జాగ్రత్త తీసుకోడానికి వీలవుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, అన్నవాహిక, మెదడు వంటి క్యాన్సర్లలో దీన్ని ఉపయోగిస్తారు.
అయితే ప్రోటాన్ థెరపీ అన్నది ప్రతి క్యాన్సర్ బాధితులకూ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పడానికి కుదరదు. ఏ క్యాన్సర్ గడ్డకు ఏ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని డాక్టర్లు క్యాన్సర్ గడ్డ తాలూకు రకం, ఆ గడ్డ పరిమాణం, దాని ఆకృతి వంటి అనేక అంశాలపై ఆధారంగా నిర్ణయిస్తారు.
ఎమ్మారై లీనియర్ యాక్సిలరేటర్ :
ఇది మరింత ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రక్రియ. ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలోనే ఎమ్మారై ద్వారా కణితిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అంటే... ఇందులో... ఎమ్మారై సహాయంతో గడ్డను చూస్తూ ఉంటూనే అవసరాన్నిబట్టి రేడియేషన్ ఇస్తున్న తీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మృదువైన కణజాలంలో (సాఫ్ట్ టిష్యూ)లలో ఉండే క్యాన్సర్లకు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.
స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (ఎస్‌బీఆర్‌టీ) :
ఇది కూడా చాలా ఖచ్చితమైన రీతిలో / చాలా నిశితంగా రేడియేషన్ ఇవ్వగల ప్రక్రియ. దాంతో ఇందులో రేడియేషన్‌ను చాలా ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డపైనే కేంద్రీకృతమయ్యేలా చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడం కుదరని పేషెంట్లకూ లేదా శస్త్రచికిత్సకు అనువుగా ఉండని బాధితులకు ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఊపిరితిత్తులు, కాలేయం, ప్రాంక్రియాస్ క్యాన్సర్లతోపాటు ఎముకలకు వ్యాపించిన మరికొన్ని క్యాన్సర్లలో దీన్ని ఉపయోగించవచ్చు.
హైపర్ ఆర్క్‌తో అనేక క్యాన్సర్ కణుతులకు చికిత్స:
స్టీరియోటాక్టిక్ రేడియేషన్ విధానాల్లో హైపర్ ఆర్క్ రేడియోథెరపీ వంటి అత్యాధునికమైన ప్రక్రియలో ఇప్పుడు మంచి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇందులో... మెదడులోని పలు కణుతులను లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. మొత్తం మెదడుకు కాకుండా... ఒక్కో కణితిని లక్ష్యంగా చేసుకుని అవసరమైన మోతాదులో రేడియేషన్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి స్కాన్ల ఆధారంగా ఈ చికిత్స ప్రణాళికను రూపొందించాక... ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ దిశల నుంచి రేడియేషన కిరణాలు కణితిపై కేంద్రీకృతమయ్యేలా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు.
చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!
కణితిపై అవసరమైన రేడియేషన్ మోతాదు ప్రసరించాక... ఇక దాని బయట ఉండే చోట్ల రేడియేషన్ కిరణాల వేగం తగ్గేలా ఇందులో చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. ఫలితంగా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలంపై రేడియేషన్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇవీ రేడియేషన్ థెరపీలోని కొన్నిప్రాథమికమైన అంశాలలో కొన్ని ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల తమ కుటుంబంలోని క్యాన్సర్ పేషెంట్ల విషయంలో వారి బంధుమిత్రులకూ, పేషెంట్ తాలూకు అటెండెంట్లకూ ఉండే చాలా అపోహాలూ, సందేహాలూ తొలగిపోయే అవకాశాలెక్కువ.
రేడియేషన్‌పై ఆధాపడాల్సిన అవసరమేమిటి?
క్యాన్సర్ కణం తన ఉనికి, మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తుంటుంది. పైగా ఆ కణం చాలా చిన్నదిగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు కేవలం ఒక చిన్న కణం మిగిలిపోయినా... అది మళ్లీ పెరిగిపోయే ముప్పు ఉండనే ఉంటుంది. అందుకే రేడియేషన్ ద్వారా కొంత ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతిన్నప్పటికీ, ఏ చిన్నకణమూ మిగిలిపోకుండా సమూలంగా నిర్మూలించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో... శస్త్రచికిత్సకు ముందుగా కూడా రేడియేషన్ / కీమో ఉపయోగించి ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉండేంత చిన్నదయ్యేలా చేశాకే సర్జరీ చేస్తుంటారు. ఇలా కూడా రేడియేషన్ ఉపయోగపడుతుంది.
ఎవరికీ ఏ రేడియేషన్, ఎంత ఇవ్వాలో నిర్ణయించడమెలా...
క్యాన్సర్ బాధితుల్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన వారిలో ఇది చాలా కీలకమైన అంశం. క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన రేడియేషన్ థెరపీ ఇవ్వడం కుదరదు. అనేక అంశాల ఆధారంగా ఏ తరహా క్యాన్సర్ గడ్డకూ లేదా ఏ బాధితుడికి ఏ తరహా రేడియేషన్ ఇవ్వాలనేది అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు (రేడియేషన్ ఆంకాలజిస్టులు) నిర్ణయిస్తారు. వారు చూసే అంశాలివి...
అది ఏరకమైన క్యాన్సర్ గడ్డ
దాని పరిమాణం ఎంత (ఎంత పెద్దది)
దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది
చుట్టుపక్కల ఉన్న అవయవాలేమిటి
గడ్డ ఎంతవరకు వ్యాపించి ఉంది
బయాప్సీ రిపోర్టులో ఏముంది
సీటీ, ఎమ్మారై, పెట్ స్కాన్లలో ఉన్న సమాచారమేమిటి
క్యాన్సర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి... వంటి అనేక అంశాలను పరిశీలించి ఇవ్వాల్సిన రేడియేషన్‌ను నిర్ణయిస్తారు.
డాక్టర్ వినితా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్
నిర్వహణ: యాసీన్
Tags : 1