Breaking News

Bigg Boss 10: హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!

Published on Sun, 09/06/2026 - 15:34

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు.  ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్‌ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌ జాబితా, వారి నేపథ్యంతో  పాటు లాంచ్‌ ఎపిసోడ్‌ ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇదిగో...
బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే
1) దేబ్జానీ మోదక్‌
2) త్రిగుణ్‌
3) సింగర్‌ ఝాన్సీ
4) సుధీర్‌రెడ్డి
5) అమన్‌
6) చైత్ర రాయ్‌
7) రాంప్రసాద్‌
8) షాలిని
9) టెంపర్‌ వంశీ
10) సృష్టి
11) జబర్దస్త్‌ నరేశ్‌
12) చరణ్‌
13) కృష్ణుడు
14) వర్షిణి
15) రోహిత్‌
16 నిహర్‌ ముకేశ్‌

పదహారో కంటెస్టెంట్‌గా నిహర్‌ ముకేశ్‌
ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు.  16వ  కంటెస్టెంట్‌గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్‌ రయ్‌ రారా’ సాంగ్‌కు డ్యాన్స్‌ వేస్తూ పదహారో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు నిహర్‌ ముకేశ్‌. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా.  10 సంవత్సరాల కిందట యాక్టర్‌ అవ్వాలనుకున్నా.  ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్‌గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్‌బాస్‌లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.

ముఖేశ్‌ విషయానికి వస్తే..
రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.

గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్‌ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్‌గా 10వ సీజన్‌లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది
పదిహేనో కంటెస్టెంట్‌గా రోహిత్‌
పదిహేనో కంటెస్టెంట్‌గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్‌ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్‌కి టాస్క్‌ ఇచ్చారు. గ్లాస్‌ తీసుకెళ్లి హౌస్‌లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్‌ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్‌ చెప్పాడు. అనంతరం వైట్‌ గోల్డ్‌ మెడల్‌ తీసుకుని హౌస్‌లోకి వెళ్లాడు. 


పద్నాలుగో కంటెస్టెంట్‌గా వర్షిణి
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్‌ వేస్తూ బిగ్‌బాస్‌లోకి అడుగెపెట్టింది యాంకర్‌ వర్షిణి.  ‘ఇదొక మంచి ఫ్లాట్‌ఫాం. నేను ఇక్కడ ఫిట్‌ అవుతానని అనుకోలేదు.రోజు నిద్రపోయే ముందు నాకు నేను ప్రశ్నించుకున్నా. తర్వాత కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.


వర్షిణి విషయానికి వస్తే..
వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్‌లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.

అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్‌తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?


పదమూడో కంటెస్టెంట్‌గా కృష్ణుడు
తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్‌బాస్' హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా    అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్‌ అన్నీ హౌస్‌లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. 

 కృష్ణుడు విషయానికి వస్తే.. 
అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్‌గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!

వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్‌లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్‌ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.

కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?


పన్నెండో కంటెస్టెంట్‌గా చరణ్‌
ఆడియన్స్‌ ఓటింగ్‌ ప్రకారం బిగ్‌బాస్‌ హౌస్‌కి ఎంపికయ్యాడు చరణ్‌. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్‌ నాగార్జునతో తెలిపారు.  నాగార్జున లైవ్‌లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు.  వైట్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న అనంతరం చరణ్‌ హౌస్‌లోకి వెళ్లాడు. 

ఎవరీ చరణ్‌..
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్‌లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్‌లైన్ వీడియో ఎడిటింగ్‌ కూడా నేర్పిస్తుంటాడు.

చరణ్‌కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్‌లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.
పదకొండో కంటెస్టెంట్‌గా జబర్దస్త్‌ నరేశ్‌
పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్‌కి డ్యాన్స్‌ వేస్తూ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి నరేశ్‌ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్‌లో నరేశ్‌ అని వెతికితే బిగ్‌బాస్‌ నరేశ్‌ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. 

నరేశ్‌ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్‌ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్‌ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్‌కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్‌లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.
పదో కంటెస్టెట్‌గా సృష్టి
మరో కంటెస్టెట్‌ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు.  సృష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్‌ గోల్డ్‌ మెడల్‌ అందించారు.  

తొమ్మిదో కంటెస్టెంట్‌గా టెంపర్‌ వంశీ
టెంపర్‌ సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు.  తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు.  సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్‌ చేశారు.

 వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్‌లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.

చూడటానికి రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్‌లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?

ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ
ఎనిమిదో కంటెస్టెంట్‌గా కామనర్స్‌ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్‌ .. దీపక్‌, హేమంత్‌, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి  చివరగా షాలినీని సెలెక్ట్‌ చేసినట్లు నవదీప్‌ ప్రకటించాడు. నవదీప్‌ సార్‌ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.


ఏడో కంటెస్టెంట్‌గా జబర్దస్త్‌ రాంప్రసాద్‌
రాంప్రసాద్‌కు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్‌ మూమెంట్‌ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. 



రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్‌కి రైటర్‌గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్‌లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసిపోయాడు. ఇతడి టీమ్‌లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఆరో కంటెస్టెంట్‌గా చైత్ర రాయ్‌ 
అష్టాచెమ్మా సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్‌. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్‌ కామెంట్‌ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చినట్లు తెలిపారు. 

చైత్ర విషయానికొస్తే..  సీరియల్స్‌తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ లాంచ్‌లో  తమిళ యాక్టర్స్‌ సూర్య, కార్తీ సందడి చేశారు.  సర్దార్‌2 మూవీ ప్రమోషన్స్‌ కోసం వాళ్లు బిగ్‌బాస్‌ షోకి వచ్చారు. 

ఐదో కంటెస్టెంట్‌గా అమన్‌
బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో 5వ కంటెస్టెంట్స్‌గా కామనర్స్‌ నుంచి అమన్‌ వెళ్లాడు. ఇతను ఆడియన్స్‌ ఓటింగ్‌ ద్వారా గెలిచి హౌస్‌లోకి వెళ్లాడు. 
సీక్రెట్‌ టాస్క్‌
హోస్ట్‌ నాగార్జున అమన్‌కు ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఒక రెడ్‌ బాక్స్‌ ఇచ్చి.. అందులో రెడ్‌ డాట్‌ ఉందని, హౌస్‌లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్‌కి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు నాగార్జున. అమన్‌ కోసం ఒక స్వీట్‌ మెమోరీ అంటూ  చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్‌ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్‌ మెడల్‌ అందిచారు. 


నాలుగో కంటెస్టెంట్‌గా సుధీర్‌ రెడ్డి
నాలుగో నాలుగో కంటెస్టెంట్‌గా సుదీర్‌ వచ్చారు.  సోషల్‌మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు.  ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్‌ మ్యాన్‌గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్‌లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్‌ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.

సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లో ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి?
 

మూడో కంటెస్టెంట్‌గా  సింగర్‌ ఝాన్సీ 
గోల్డేన్‌ టికెట్‌ సాధించి సింగర్‌ ఝాన్సీ మూడో కంటెస్టెంట్‌గా వచ్చారు. ‘మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా. అందరికీ తెలిసేలా నన్ను నేను నిరూపించుకునేందుకు  ‘బిగ్‌బాస్‌’కువచ్చా. అనుకోకుండా గోల్డెన్‌ టికెట్‌ సొంతం చేసుకున్నా.‘ అని తెలిపింది

ఝాన్సీ కోసం కొన్ని విషయాలు..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్‌తో గెలిచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?


రెండో కంటెస్టెంట్స్‌గా యాక్టర్‌ త్రిగున్‌ 
రెండో కంటెస్టెంట్స్‌గా యాక్టర్‌ త్రిగూన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్‌ మూవీలోని ఆయా షేర్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్‌కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్‌లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్‌ ఇచ్చారు. 



త్రిగున్‌ నేపథ్యం ఇదే.. 
తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.

ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్‌గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్‌బాస్‌లోకి వస్తున్నాని త్రిగున్‌ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్‌ చేశానని.. ఇకపై త్రిగున్‌ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.

మొదటి కంటెస్టెంట్‌ దేబ్జానీ మోదక్
‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్‌గా  దేబ్జానీ మోదక్ వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. నా గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఫన్‌ లవింగ్‌, నిజాయతీ, డే డ్రీమర్‌ను. నేను ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా.  ఎక్కడ వర్క్‌ చేసినా, రాత్రయితే ఇంటికి వచ్చేయాల్సిందే’ అని అన్నారు. దేబ్జానీకి నాగార్జున టాస్క్ ఇచ్చారు. హౌస్‌లోకి వచ్చే వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్లకు పేర్లు పెట్టాలని కొన్ని బ్యాడ్జ్‌లను అందించారు.

ఎవరీ దేబ్జానీ మోదక్ 
కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అడుగుపెట్టింది.


ఓ మ్యాజిక్‌ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్‌బాస్‌ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 10’ ఎట్టకేలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్‌ నాగార్జున తనదైన స్టైల్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్‌ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్‌లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. 

బుల్లితెరపై బిగ్‌ బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్‌తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్‌ 6) బిగ్‌బాస్‌ 10 ప్రారంభం కానుంది. 

బిగ్‌బాస్‌ 10 ప్రోమో వచ్చేసింది
బిగ్‌బాస్‌ సీజన్‌ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌  ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్‌ గ్రాండ్‌గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్‌బాస్‌ హోస్టులు(విజయ్‌ సేతుపతి, మోహన్‌ లాల్‌, సుదీప్‌) నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.

‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్‌’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్‌ కాదు.. ఆటే సవాల్‌ అంటూ ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమోలు సీజన్‌ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్‌తో సరికొత్త సర్‌ప్రైజ్‌లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్‌ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్‌ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్‌ 10పై భారీ చర్చ జరుగుతోంది.

తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడి
బిగ్‌గాస్‌ 10 లాంచింగ్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. ఈ సారి అనేక సర్‌ప్రైజ్‌లతో లాంచింగ్‌ ఎపిసోడ్‌ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్‌బాస్‌ హోస్టులంతా తెలుగు బిగ్‌బాస్‌ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.

గెస్టులుగా కార్తీ, ఆనంద్‌ దేవరకొండ
బిగ్‌బాస్‌ 10 గ్రాండ్‌ లాంచ్‌కి తమిళ హీరో విజయ్‌తో పాటు టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్‌ సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరోయిన్‌ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్‌ దేవరకొండ స్టేజ్‌పైకి రాబోతున్నారు. ఇక సర్దార్‌ 2 మూవీ ప్రమోషన్స్‌ కోసం కార్తీ కూడా బిగ్‌బాస్‌ షోకి వచ్చారట.

బిగ్‌బాస్‌ 10లోకి 16 మంది
ఈ సారి హౌస్‌లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.

హౌస్‌లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?
సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్‌బాస్‌ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్‌ ఇదే. 
1) ఆటో రాంప్రసాద్‌
2) టెంపర్‌ వంశీ
3) దేబ్జానీ మోదక్‌
4)యాంకర్‌ వర్షిణి
5) ముఖేష్‌ గౌడ
6)చైత్రా రాయ్‌
7) నటుడు కృష్ణుడు
8) జబర్దస్త్‌ నరేశ్‌
9) టెంపర్‌ వంశీ
10)యాంకర్‌ సుధీర్‌ రెడ్డి

అగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 
1) ఝాన్సీ
2) రోహిత్‌ నాయుడు
3)శ్రష్టి
4) చరణ్‌
5)అమన్‌ మసూద్‌
6)షాలిని పటేల్‌

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)