నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల
Breaking News
'చనిపోవడానికి అనుమతించండి’.. కలెక్టర్‌కు ఓ తండ్రి రాసిన లేఖ!
Published on Sun, 08/30/2026 - 09:26
‘ఓ పెద్దాయనా.. పెద్ద సారు రావడానికి చాలా టైం పడుతుంది. పోయి రేపు రా’ అన్న అటెండర్ మాటలతో ఆయన ఆ లోకంలోకి వచ్చాడు. వయసు 70 పైబడి ఉంటాయి.. ముఖంలో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, కళ్లజోడు, పెద్ద గళ్ల చొక్కా, పాతకాలపు ప్యాంటు, భుజాన గుడ్డ సంచి.. అందులో కొన్ని పేపర్లు, సుగర్, బీపీ ట్యాబ్లెట్లు.. నడిచినప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఊతకర్ర. ఇవే ఆయన ఆస్తి.
‘వస్తావ్.. వెళతావ్.. ఏనాడైనా టీ తాగమని పది రూపాయలైనా ఇచ్చావా? పైసల్లేకుండా పని ఎలా అవుతుందనుకుంటున్నావ్’ అన్న అటెండర్ మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఈ చేయి ప్రస్తుతం అదే సాయం కోసం దీనంగా అర్ధించే స్థితిలో ఉండటం చూసుకుని నిర్వేదం ఆవహించింది. కలెక్టర్ ఆఫీసులోని ఆ పాత గోడ గడియారం రెండు గంటల సమయాన్ని సూచిస్తోంది. ఇక చేసేదేమీ లేక భారంగా పైకి లేచి అంతే భారంగా అడుగులు బయటకు వేశాడు.
ఆయన పేరు రాఘవరావు. తహశీల్దార్ ఆఫీసులో క్లర్క్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఓ కూతురు, ఇద్దరు కొడుకుల బాధ్యతలు అన్నీ నెరవేర్చాడు. భార్య ఉన్నంత కాలం ఆయన జీవితం బానే గడిచింది. కానీ బ్లడ్ కేన్సర్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. తన సహ ధర్మచారిణిని కాపాడుకుందామని రాఘవరావు ఎంతగా తపించినా, బ్లడ్ కేన్సర్ ముందు ఓడిపోయాడు. ఆమె కాలం చేసినప్పటి నుంచి అందరూ ఉన్న అనాథయ్యాడు. ఎప్పుడో ఓసారి కూతురు నుంచి వచ్చే ఫోన్ పలకరింపు తప్ప ఇతర బంధాలేవీ ఆయన దరిదాపుల్లో లేవు.
ఇద్దరు కొడుకులు ఉన్నా తండ్రిని పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలనే బాధ్యత లేనట్టుగా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. దీంతో ఆయన జీవితంలాగే రోజులు కూడా చాలా భారంగా గడుస్తున్నాయి. నెలనెలా వచ్చే కాసిని పింఛను డబ్బులతోనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తినీ తినక అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.
కలెక్టరాఫీసు నుంచి బయటకు వచ్చిన రాఘవరావు.. కాస్త అలసటగా అనిపించి ఓ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాడు. జేబులో నుంచి రూ.20 నోటు తీసి ఇచ్చి వెళ్లబోయాడు. రాఘవరావులాగే చాలా ముడతలు పడి మాసిపోయి, చిరిగి ఉన్న నోటు వంక టీకొట్టు యజమాని తేరిపార చూసి, ‘ఈ నోటు మారదు మరొకటి ఇవ్వండి’ అంటూ వెనక్కి ఇచ్చాడు.
జేబు మొత్తం వెతికి చిల్లరంతా తీసినా కూడా రెండు రూపాయలు తగ్గింది. టీకొట్టు యజమాని వాటిని తీసుకుని.. ‘డబ్బుల్లేకుండా టీ ఎందుకు తాగుతారు’ అంటూ గొణుక్కున్నాడు.
రెండు రూపాయలు తగ్గాయని ఆ హోటల్ యజమాని ముఖం తిప్పుకునేసరికి రాఘవరావు మనసు చివుక్కుమంది. కళ్లలో వస్తున్న నీళ్లను బలవంతంగా అదిమి పెట్టుకుని రోడ్డు పైకి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. ఇంటికి నడిచి వెళ్లేంత ఓపిక అసలే లేదు. ఓ వైపు ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు తారు కరిగి కాళ్లను గుంజుతున్నట్లుంది.
అప్పుడే ఆ రోడ్డుపై నుంచి పోలీస్ జీపు వస్తోంది. అందులో ఉన్న ఎస్సైని రాఘవరావు గుర్తుపట్టారు. ఆయన ఉండేది తమ కాలనీలోనే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎస్సైకి తెలిసిన వాళ్ల ఫైల్ ఒకదానిని త్వరగా పరిష్కరించి సహాయం చేసిన సంగతి గుర్తొచ్చింది. దీంతో లిఫ్ట్ ఇస్తారేమో ఆశతో.. ‘సార్.. కాస్త ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా?’ అని చేయి ఊపాడు. కానీ ఆ ఎస్సై కనీసం జీపు ఆపలేదు సరికదా, కళ్లద్దాల వెనుక నుంచి ఒక చులకన భావంతో చూస్తూ స్పీడుగా వెళ్లిపోయాడు. జీపు వెదజల్లిన ధూళి రాఘవరావు కళ్లల్లో పడింది. అయితే, ఆ బాధ కంటే ఆ ఎస్సై చూసిన చూపు తీవ్రమైన బాధ కలిగించింది.
అలా అతికష్టమ్మీద నాలుగడుగులు వేశాడు. ఓ వైపు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వయసు సహకరించడం లేదు. గొంతు ఎండిపోతోంది. శ్వాస భారమైంది. కంటి చూపు మసకబారుతోంది. రోడ్డు పక్కన ఎవరైనా నీళ్లు ఇస్తారేమోనని చూశాడు. కానీ ఎవరి బిజీలో వాళ్లున్నారు. ఆ నడిరోడ్డుపైనే ఆయన కాళ్లు తడబడ్డాయి. చేతిలోని ఊతకర్ర జారిపోయింది. భుజాన ఉన్న గుడ్డ సంచితో సహా రాఘవరావు అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ మసకబారుతున్న చూపుల వెనుక.. ఆయన జీవితం మొత్తం సినిమా రీలులా గిర్రున తిరిగింది.
తహశీల్దార్ ఆఫీసులో రోజంతా ఫైళ్లతో నడుము విరగ్గొట్టుకుని పనిచేసి, సాయంత్రం కాగానే విశ్రాంతి ఎరుగకుండా మరొక చిన్న ఉద్యోగం కోసం పరుగెత్తిన రోజులు గుర్తొచ్చాయి. ‘పిల్లలకు లోటు రాకూడదు.. వాళ్ల చదువులు ఆగకూడదు.. రేపు వాళ్లు గొప్ప స్థాయికి వెళ్లాలి’ అనే తపనతో ఎంత కష్టపడ్డాడో సగం తెరిచిన కళ్లలో కదలాడింది.
సాయంత్రాలు టీ కొట్టు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే స్నేహితులు గుర్తొచ్చారు. ‘రారా రాఘవా.. కాసేపు కూర్చో’ అని పిలిచినా, ‘లేదురా.. అర్జెంట్ పని ఉంది’ అంటూ నవ్వుతూ దాటవేసిన క్షణాలు కళ్లముందు కదిలాయి. రూపాయి రూపాయి కూడబెట్టే ఆ తాపత్రయంలో ఏనాడూ తనకోసం, తన సంతోషం కోసం ఆయన బతకలేదు. పిల్లలే ముఖ్యమనుకుని, వారి కోసమే జీవితం మొత్తం అంకితమయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఆత్మీయులు, స్నేహితులు ఒక్కరొక్కరుగా దూరమయ్యారు. ఆనాడు పిల్లల భవిష్యత్తు కోసం స్నేహాన్ని, సరదాలను త్యాగం చేస్తే, ఈనాడు కనీసం ‘బాగున్నావా’ అని పలకరించడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని నిశ్శబ్దం మిగిలింది.
కొడుకులు, కూతురు చిన్నతనంలో తన భుజాలెక్కి ఆడుకున్న రోజులు కనిపించాయి. ‘నాన్నే నా హీరో’ అన్న పెద్దోడి మాటలు చెవుల్లో రింగుమన్నాయి. ‘నాన్నా! నేను పెద్దయ్యాక నిన్ను మహారాజులా చూసుకుంటా’ అన్న చిన్నోడి మాటలు ఇంకా మరచిపోలేదు. వారి ముద్దుముద్దు మాటలకు ఎంతో మురిసిపోయిన రాఘవరావు– రెక్కలు ముక్కలు చేసుకుని వారిని ప్రయోజకులను చేశాడు. కానీ వారు మాత్రం పెద్దయి, పెళ్లిళ్లు చేసుకున్నాక కన్న తండ్రిని పూర్తిగా పక్కన పెట్టేశారు.
‘ఇలా రెండు ఉద్యోగాలు చేస్తూ సరిగా తిండి కూడా తినకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి’ అంటూ ప్రేమతో కోప్పడే భార్య గుర్తొచ్చింది. ‘నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. అందుకే వారికి ఏ లోటూ రాకూడదని ఇంత కష్టపడుతున్నా. రేపు వాళ్లు పెద్దయ్యాక మన ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు’ అంటూ భార్యతో అన్న మాటలు గుర్తొచ్చి, ఆయన కళ్లల్లో నుంచి చివరి కన్నీటి చుక్క చెంపల మీదుగా జారి రోడ్డుపై పడి ఆ వేడికి ఆవిరైపోయింది.
మరుక్షణం తన తండ్రి వెంకటరామయ్య గుర్తొచ్చారు. ఆయన అవసాన దశలో తాను సరిగా చూసుకోని సంగతులు లీలగా మెదిలాయి. ‘ఒరేయ్.. రాఘవా? ఈ మధ్య అస్సలు నువ్వు నాతో మాట్లాడటంలేదురా.. ఏం అడిగినా బిజీ, టైం లేదు అంటున్నావ్. కళ్ల ముందే మీరంతా ఉన్నా ఒంటరితనం బాధిస్తోందిరా. చేవలేని ఈ ముదిమి వయసులో చేతికర్రలా ఉండాల్సిన నువ్వు.. కనీసం నా ముఖం కూడా చూడటంలేదనే బాధ నా గుండెను పిండేస్తోంది. ఈ వయసులో మాకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదురా.. నాన్నా ఎలా ఉన్నావు అనే ఆత్మీయమైన పిలుపు. మీ అనురాగాలు మాత్రమే. మీ అమ్మ అదృష్టవంతురాలు.. నా కంటే ముందే వెళ్లిపోయింది.
ఇంకా ఈ కట్టె ఎన్నిరోజులు ఇలా ఉండాలో’ అంటూ మథనపడిన సంగతి గుర్తొచ్చింది.
ఇక కన్నీటి చుక్కలు రావడానికి ఆయన ఒంట్లో నీళ్లు కూడా లేవు. ఆ వయసులో తన తండ్రి అనుభవించిన బాధే ఇప్పుడు తాను అనుభవిస్తున్నా అని అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే తాను.. ఎందుకు ఇలా చేశానా అనే పశ్చాత్తాపం మూసుకుపోతున్న కళ్లల్లో కనిపించింది. బలవంతంగా కళ్లు తెరిచి ఆకాశంలో ఎక్కడో ఒకచోట ఉండే తండ్రికి క్షమాపణ చెప్పాలని రాఘవరావు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ఆ కళ్లు అలా నెమ్మదిగా మూతపడ్డాయి.
త్యాగానికి నిర్వచనమైన ఓ సగటు తండ్రి ఆఖరి శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.
క్షణాల మీద అక్కడ జనం చేరారు. ‘అయ్యో.. ఎవరో పెద్దాయన పాపం శోష వచ్చి పడిపోయినట్టున్నాడు. పక్కన కూర్చోబెట్టి నీళ్లివ్వండి’ అని గుంపులో ఎవరో అన్నారు.
‘వడదెబ్బ తగిలినట్టుంది.. అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి’ అని మరొకరు.. ఇలా మాటలు చెబుతున్నారే తప్ప ఎవరూ ముందుకు రావడంలేదు.
ఇంతలో ఆ గుంపులోకి ఒక జేబుదొంగ చొరబడ్డాడు. ఓ పెద్దాయన లాల్చీ జేబులో నుంచి పర్సు కొట్టేశాడు. ఈ రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటూ.. ఇంకా ఎవరి దగ్గరైనా కొట్టేసే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నాడు. అప్పుడే ఆ టీకొట్టు యజమాని అక్కడ జనాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవరావు ముఖం చూడగానే షాక్ అయ్యాడు. ‘అయ్యో.. ఇందాకే నా కొట్టు దగ్గర టీ తాగాడు. రెండు రూపాయలు తక్కువయ్యాయని కాస్త గింజుకున్నాను. ఆ చిల్లరంతా నేను తీసుకోకుండా ఉంటే బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేవాడేమో..’ అన్న భావన అతని గుండెను పిండేసింది.
అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్సై జీపు జనాలను చూసి ఆగింది. కాసేపటి క్రితం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్లిన అదే ఎస్సై జీపు దిగి గంభీరంగా జనాన్ని తోసుకుంటూ వచ్చాడు. రాఘవరావు శవాన్ని చూసి, ‘అరే.. ఇందాక లిఫ్ట్ అడిగింది ఈయనే కదా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చనిపోయేవాడు కాదేమో’ అని మనసులో ఉలిక్కిపడ్డాడు.
సరిగ్గా అదే సమయానికి సైరన్ మోగుతూ కలెక్టర్ కారు వచ్చి ఆగింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కలెక్టర్ స్వయంగా కారు దిగి వచ్చారు. జనమంతా పక్కకు తప్పుకున్నారు. రాఘవరావు అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. పక్కనే పడి ఉన్న గుడ్డసంచి, అందులోంచి రోడ్డుపై పడిన కాగితాలు కలెక్టర్ దృష్టిని ఆకర్షించాయి. ఒక తెల్లటి కాగితంపై పెద్ద అక్షరాలతో ‘అర్జీ’ అని రాసి ఉంది.
కలెక్టర్ వంగి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించారు:
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి...
అయ్యా,
నా పేరు రాఘవరావు. రిటైర్డ్ క్లర్క్.
ఒకప్పుడు నా సంతకం పడితే కానీ ఆఫీసుల్లో ఫైళ్లు ముందడుగు వేసేవి కావు. కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చేశాను. రెక్కలు ముక్కలు చేసుకుని, తినీ తినక పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశాను. సంపాదించినదంతా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ వారికి రెక్కలొచ్చాక తల్లిదండ్రులనే భావన కూడా వారికి లేకుండా పోయి అనాథల్లా వదిలేశారు.
నా భార్య కాలం చేశాక, ఆకలి కంటే ఈ ఒంటరితనమే నన్ను రోజురోజుకూ నమిలి మింగేస్తోంది. ఎంతో ఆశగా పెంచి పెద్ద చేసిన నా పిల్లల ఇళ్లలోనే కాదు.. వారి మనసులో కూడా నాకు చోటు లేదు. వారి సమయాన్ని, ప్రేమను కొనుక్కోవడానికి నా దగ్గర ధనం లేదు.
నేను బతికి ఉన్న ప్రతి క్షణం వారికి భారంగా మారింది. నా పింఛను డబ్బులు నా పొట్ట నింపగలవేమో కానీ, నా మనసు పడే ఆక్రందనను ఆపలేకపోతున్నాయి. రోజంతా ఖాళీ గోడల వైపు చూస్తూ బతుకును భారంగా ఈడుస్తున్నాను. ఏనాడైనా ఎవరో ఒకరు నా తలుపు తట్టి ’బాగున్నావా నాన్నా’ అని అడగరా అని ఎదురుచూసి చూసి అలసిపోయాను.
అందరికీ బరువుగా ఉన్న ఈ జీవితం నాకు అంతకుమించిన భారంగా అనిపిస్తోంది. చావలేక బతుకుతున్న నేను.. ఇలా బాధలు పడుతూ చస్తూ బతకడం కంటే చనిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టినప్పటి నుంచి చట్టాన్ని గౌరవిస్తూ.. ఒక్క తప్పు పని కూడా చేయలేదు. ఆత్మహత్య చేసుకోవడం నేరమని తెలుసు. అందుకే ఆ తప్పు కూడా చేయకూడదనే భావనతో ఈ అర్జీ పెట్టుకుంటున్నాను.
అక్కడి వరకు చదివిన కలెక్టర్‌కు ఆపై అక్షరాలు కాస్త మసకబారినట్టు అనిపించాయి. కళ్లజోడు తీసి, కళ్లలో నుంచి ఉబికివస్తున్న నీళ్లను తుడుచుకుని.. మళ్లీ దానిని చదవడం ప్రారంభించారు.
ఒక పౌరుడిగా, ఒక నిస్సహాయ తండ్రిగా, అంతకంటే బాధ్యతాయుతమైన మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను... నేను చనిపోవడానికి చట్టబద్ధమైన అనుమతి ప్రసాదించండి. కారుణ్య మరణం పొందడానికి వీలు కల్పించండి. ఈ వయసులో ఇంతకుమించి నేను ఏమీ అడగలేను. మీ అనుమతి కోసం.. ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.
ఇట్లు,
ఆకలితో కాదు.. అనురాగానికి అలమటించి చనిపోతున్న ఒక నిస్సహాయ తండ్రి రాఘవరావు.
ఉత్తరం చదవడం ముగిసేసరికి కలెక్టర్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. గాలికి కలెక్టర్ చేతిలోని కాగితం ఎగిరి అక్కడే ఉన్న 10 ఏళ్ల పిల్లాడిపై పడింది. అతడు దానిని తీసుకుని పైకి చదవడం ప్రారంభించాడు. అది పూర్తయ్యే సరికి అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది.
మొదటగా టీకొట్టు యజమాని కళ్లు రాఘవరావు నెరసిన జుట్టు వైపు చూశాయి. అతనికి ఊళ్లో ఉన్న తన ముసలి తండ్రి గుర్తొచ్చాడు. ‘నా తండ్రి కూడా ఇలాగే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడేమో? నేను డబ్బు సంపాదనలో పడి నాన్నను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనిపించి అతని గుండె బరువెక్కింది. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి, వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ నాన్న నంబర్‌కు డయల్ చేశాడు.
ఎస్సై ఆ అర్జీ వైపు, రాఘవరావు చేతికర్ర వైపు చూశాడు. అతని కళ్లముందు తను నిర్దాక్షిణ్యంగా జీపు పోనిచ్చిన దృశ్యం కదిలింది. ‘నన్ను పెంచి పెద్ద చేసి, పోలీస్ ఆఫీసర్‌ను చేసిన నా తండ్రి కూడా ఇవాళ ఊళ్లో ఒంటరిగా ఉంటున్నారు. నేను హోదా పెరిగాక బిజీబిజీ అంటూ ఆయనతో మాట్లాడటమే మానేశాను. ఇకపై నేను ఇలా ఉండకూడదు’ అని మనసులో అనుకుని.. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు.
ఇక దొంగ ఆ మందు బిళ్లల వైపు చూశాడు. అతడికి జబ్బుతో మంచాన పడ్డ తన తండ్రి గుర్తొచ్చాడు. ‘దొంగ సొమ్ము మంచిది కాదురా.. కష్టపడి పనిచేసి సంపాదించినదాంట్లో ఎంతో తృప్తి ఉంటుందని పదేపదే చెప్పే నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇక దొంగతనాలు ఆపేసి నాన్న చెప్పినట్టే చేయాలి’ అని కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. తాను కొట్టేసిన పర్సును మళ్లీ ఆ పెద్దాయన జేబులో పెట్టేసి గుండెల నిండా తృప్తితో ఇంటికి పరుగెత్తాడు. నాన్నతో మాట్లాడాలనే ఆరాటం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.
చివరగా కలెక్టర్ ఆ అర్జీని పిల్లాడి దగ్గర నుంచి తీసుకుని తన డైరీలో భద్రపరచుకున్నారు. ఈ పెద్దాయన చావుకు కారణం ఎవరు? ఆస్తులన్నీ పంచుకుని గుప్పెడు అనురాగాన్ని కూడా పంచకుండా ఆయన్ను అనాథలా వదిలేసిన కన్నపిల్లలా? ఇలాంటి కొడుకులను సరిగా గాడిలో పెట్టలేకపోతున్న ఈ వ్యవస్థా? బంధాలు, అనుబంధాలను చాలా తేలికగా తీసుకుంటున్న నేటి తరం ఆలోచనలా? అని మథనపడ్డారు. ఇలాంటి పెద్దలను ఆదుకోవడానికి ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
అలాగే.. ఆ క్షణంలో తాను చేసిన తప్పేంటో గుర్తొచ్చి కుమిలిపోయారు. వెంటనే ఫోన్ తీసి.. ఓ నెంబర్ డయల్ చేశారు. అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న అవతల వ్యక్తి ఫోన్ తీయగానే.. కలెక్టర్ నోటి నుంచి వచ్చిన మాట.. ‘నాన్నా..’
ఈలోగా అంబులెన్స్ వచ్చింది. కలెక్టర్‌తో పాటు ఎస్సై, టీకొట్టు యజమాని అంతా కలిసి రాఘవరావు భౌతికకాయాన్ని అందులోకి ఎక్కించారు. బతికుండగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాఘవరావు.. ఇప్పుడు చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
అప్పుడు వెంకట రామయ్య... ఇప్పుడు రాఘవరావు.. రేపు రాఘవరావు కొడుకులు...!!
- కొండ్రెడ్డి సత్యకిషోర్
ఇవి కూడా చదవండి: దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
Tags : 1