Breaking News

భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్‌ గెలిచిన రచయిత కథ!

Published on Sun, 08/30/2026 - 08:39

యిదేళ్ళ కిందట నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్న బ్రిటిష్‌–జాంజిబార్‌ నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా అప్పటికే, యూరపియన్‌ దేశాల్లో స్థిరపడిన ఆఫ్రో–ఆసియన్‌ దేశాల రచయితల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందివున్నారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌లో సభ్యులుగా వున్న ఎనిమిది వందలమంది ‘శిష్టుల్లో‘ గుర్నా ఒకరు. అబ్దుల్‌ రజాక్‌ గుర్నా రచనల్లో పాత్రలుండవు– రక్తమాంసాలతో తిరుగాడే మనుషులే కనిపిస్తారు వాటిల్లో.

గుర్నా రచనల్లో కనిపించే మనుషుల్లో అత్యాధునిక భావాలు– ఆదిమ స్వభావాలూ ఏకకాలంలోనే దర్శనమిస్తాయి. ఆ విలక్షణ లక్షణం రచయిత స్వభావంలోనే కనిపిస్తుంది, చూడగలిగిన వారికి. ఈ లక్షణాన్నే, ‘సామ్రాజ్యవాద పర్యవసానాల గురించి ఆయనది రాజీపడని స్వభావమ’నీ, ‘భిన్న ఖండాల నుంచి వచ్చిన శరణార్థులు విభిన్న సంస్కృతుల మధ్య వున్న అగాధం కారణంగా అనుభవించిన ఆవేదన విషయంలో గుర్నాది ఉదార స్వభావమ’నీ అభివర్ణించింది స్వీడిష్‌ ఎకాడెమీ. ఈ లక్షణం, బహుశా, అబ్దుల్‌ రజాక్‌ గుర్నా చారిత్రక నేపథ్యం నుంచే ఆయనకు సంక్రమించి వుంటుంది!

అబ్దుల్‌ రజాక్‌ పుట్టిందీ, పదహారేళ్ళు పెరిగిందీ, జాంజిబార్‌ ద్వీపసమూహంలో. గత ఇరవైవేల సంవత్సరాలుగా ఆ గడ్డపై మానవ సమాజం వర్ధిల్లుతోందని పురాచరిత్ర చెప్తోంది. సోమాలియా, అరేబియా, ఇరాన్‌ (పర్షియా), ఒమాన్, యెమెన్, భారతదేశం తదితర ఆఫ్రో– ఆసియా దేశాలనుంచి నావికులూ, వర్తకులూ, చేతివృత్తులవాళ్ళూ, కూలీలూ, వారందరినీ పోషించే రైతులూ జాంజిబార్‌ గడ్డపై చేరి స్థిరపడ్డారు. పదిహేనో శతాబ్దిలో పోర్చుగీస్‌ సామ్రాజ్యవాదులు జాంజిబార్‌ ద్వీపసమూహాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు పెత్తనం చెలాయించారు.

పదిహేడో శతాబ్ది మొదలుకొని జాంజిబార్‌ దాదాపు నూరేళ్ళపాటు ఒమానీ సుల్తానత్‌ పెత్తనంలో నలిగిపోయింది. ఆ తర్వాత, ఈ ద్వీపసమూహం రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం ‘కాపుదల రెక్కల‘ కిందకు చేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఇలాంటి ‘బాధ్యతలు’ మోయలేని భారాలుగా మారాయి. ఆ నేపథ్యంలో 1964లో, జాంజిబార్‌ స్వాతంత్య్రం సాధించుకుంది. (అంతకు 17 సంవత్సరాల ముందు స్వతంత్రమైన మన దేశం కథ కూడా దీనికి పెద్దగా భిన్నమైందేం కాదు!) కొద్దికాలానికే, జాంజిబార్‌ పొరుగున వున్న టాంజానికాతో కలిసిపోయి, టాంజానియా రిపబ్లిక్‌గా అవతరించింది. అది నచ్చని జాంజిబార్‌ పౌరులు ఎందరో అప్పుడే బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని శరణుకోరి ఆశ్రయించారు. అబ్దుల్‌ రజాక్‌ గుర్నా అలాంటి శరణార్థుల్లో ఒకరు.

గుర్నా సాహిత్యం విషయానికి వస్తే– మొదట్లో, ఓ అరడజను కథానికలు రాశారాయన. కారణం స్పష్టంగా తెలియదు కానీ, ఆయన క్రమంగా నవలా రచన వైపు మళ్ళిపోయారు; ముప్ఫైతొమ్మిదో యేట, గుర్నా వెలువరించిన తొలినవల ‘నిష్క్రమణ స్మృతులు.’ వాస్తవానికి ఈ నవల గుర్నా తొలి కథల సారాంశమని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏడేళ్ళకు వెలువడిన ‘స్వర్గం’ నవలతోనే, గుర్నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆ నవల అటు బుకర్‌ పురస్కారానికీ, ఇటు విట్‌ బ్రెడ్‌ పురస్కారానికీ జరిగిన ఎంపికలో గట్టిపోటీనే ఇచ్చింది కానీ విజేతగా నిలవలేక పోయింది.

2001లో గుర్నా వెలువరించిన ‘కడలి ఒడ్డున’ నవల లాస్‌ ఏంజెలిస్‌ టైమ్స్‌ బుక్‌ ప్రైజ్‌ కోసం కడదాకా బరిలో నిలవగలిగిందే కానీ దాన్ని గెల్చుకోలేక పోయింది. అలాగే, 2005లో గుర్నా వెలువరించిన ‘ఉద్వాసన’ నవల కూడా కామన్వెల్త్‌ రైటర్స్‌ ప్రైజ్‌ కోసం కడదాకా పోటీపడిందే తప్ప బహుమతి పొందలేకపోయింది. ఒక్కముక్కలో చెప్పుకుంటే, 2021లో నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకునేంత వరకూ అబ్దుల్‌ రజాక్‌ గుర్నా చెప్పుకోదగిన విజయమేదీ సాధించలేదనే చెప్పాలి. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు! 

మొదటి కారణం గుర్నా నవలల్లో వాడేభాష. గుర్నా మాతృభాష స్వాహిలి. అలాగే, సాంప్రదాయికంగా వాళ్ళ కుటుంబాల్లో వాడే భాష అరబిక్‌. ఇంగ్లీషు చదువులు మొదలుపెట్టక ముందు గుర్నా నేర్చుకున్న భాష జెర్మన్‌. అయితే, ఆయన ఆ మూడు భాషల్లో ఏ ఒక్కదానిలోనూ రచనలు చేయలేదు. సాహిత్య మాండలికంగా గుర్నా స్వీకరించినది ఈ మూడు భాషల కలగలుపు భాష. అలా చెయ్యడం రచయితగా గుర్నా హక్కు. కానీ, స్వేచ్ఛా స్వాతంత్య్రాల జపం చేసే పాశ్చాత్య ప్రచురణకర్తలు గుర్నా భావప్రకటన స్వేచ్ఛను గౌరవించలేదు.

ఆంగ్లేతర పదాలను ‘ఇటాలిక్స్‌’లో సూచించమనీ, వాటన్నిటితో ఓ పదకోశాన్ని రూపొందించి అనుబంధంగా ఇవ్వమనీ రచయితకు ఉచిత సలహాలు ఇచ్చారు ఈ అర్ధాక్షరాస్యులు. వాటిని గుర్నా– సహజంగానే – ఖాతరు చెయ్యలేదు. దాంతో అతని భాషకు ‘ప్రవాసీ భాష’గా ముద్రకొట్టి, గుర్నా రచనలను పక్కనపెట్టారు. గుర్నా పాశ్చాత్య ప్రపంచంలో పెద్దగా గుర్తింపుకు నోచుకోకపోవడానికి మరో కారణం కూడా వుంది. అది, గుర్నా రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపించే సామ్రాజ్యవాద– వలసవాద వ్యతిరేకత! 1987లో అబ్దుల్‌ రజాక్‌ వెలువరించిన తొలి నవల ‘నిష్క్రమణ స్మృతులు మొదలుకొని ప్రతి ఒక్క రచనలోనూ ఈ స్వరం, అదే శ్రుతిలో వినిపిస్తూ వుంటుంది. 

2021లో నోబెల్‌ సాహిత్యపురస్కారం పొందిన తర్వాత కూడా గుర్నా రచనల్లో అదే స్వరం– అదే శ్రుతీ కొనసాగాయి. కానీ, అప్పుడది పాశ్చాత్య ప్రచురణకర్తలకు అభ్యంతరకరం కాకుండా పోయింది. ప్రచురణ హక్కుల కోసం వారు తమలో తాము పెనుగులాడి రచయిత నెత్తిన పాలుపోశారు. అలా, ‘తలవంచని ఉదారవాది’ అబ్దుల్‌ రజాక్‌ గుర్నా పాశ్చాత్య ప్రపంచంలో ప్రముఖుడు కాగలిగారు!

- మందలపర్తి కిషోర్‌

ఇవి కూడా చదవండి: డిగ్రీ కాదు.. స్కిల్స్‌ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!

Videos

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)