ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
2026లో ఉంటూనే.. 1996 అనుభూతుల కోసం వెతుకులు..
Published on Fri, 08/21/2026 - 08:01
తరం మారేకొద్దీ మార్పులు సహజం. కాని ఇప్పుడున్న జెన్ జీలు అన్నింటినీ ట్రై చేస్తున్నారు. 90ల కాలాన్ని నిజంగా అనుభవించినవాళ్లు ఇప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు జేసుకుంటుంటే, ఆ రోజుల్ని ఎప్పుడూ చూడని ఈ తరం జెన్ జీలు ఓసారి ప్రయత్నించి చూస్తే పోలా అన్నట్టు వైఖరి మార్చుకుంటున్నారు. ప్రముఖ పత్రిక ది గార్డియన్ చేసిన పరిశోధనలో జెన్ జీల గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. ఫోన్ లో చాటింగ్, గేమింగ్, సర్ఫింగ్‌కు సెలవు చెప్పి డిజిటల్ వరల్డ్ నుంచి డిటాక్స్ అవుదామని ప్రయత్నిస్తున్నారు.
ఒకప్పుడు సాయంత్రమైతే చాలు... ప్రతి ఖాళీ స్థలమూ ఓ చిన్నసైజు స్టేడియంలా తయారయ్యేది. ఆటలంటే ఆసక్తి లేకపోతే సైకిల్‌లో స్నేహితుడిని ఎక్కించుకుని వాక్‌మెన్ లో ఇయర్ బడ్స్‌ను ఇద్దరు చెరొకటి తగిలించుకుని పాటలు వింటూ సూరీడు పొద్దు పొడిచేదాకా షికార్లు చేసేవారు. ఇప్పుడు జెన్ జీలు అదే రకపు జీవనశైలిని తమదైన శైలిలో తిరిగి సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ వైరల్ అవుతోంది.
నోస్టాలజీకి వెల్‌కమ్
సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని జెన్ జీలు భావించడం లేదు. తమ ఇష్టాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించాలనుకుంటున్నారు. టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రాంలో వేలాదిమంది యువత 90ల కాలం నాటి అలవాట్లు, వేషధారణతో కనిపిస్తూ ఆ కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. యూఎస్‌లో అయితే యువత ఐఫోన్ ను పక్కన పెట్టి డిజిటల్ కెమెరాలు, స్పాటిఫైకి బదులు ఐపోడ్స్, మ్యూజిక్ కీబోర్డ్‌కి బదులు సంగీత వాయిద్యాలు, నోట్స్ యాప్స్‌కి బదులు కాగితంపై రాతలు, గ్రూప్ చాట్స్‌కి బదులు ఉత్తరాలు, ఆన్ లైన్ రీడింగ్‌కు బదులు పుస్తకాలు, క్రాస్ వర్డ్స్, స్కెచ్ బాక్సులు, వినైల్ ప్రింటింగ్‌లు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా..2026ని కాస్తా 1996లో మార్చేసుకుంటూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఈ ట్రెండ్‌ను ’అనలాగ్ బ్యాగ్’ అంటూ పరిగణిస్తున్నారు.
అగ్రదేశాలలో..
అమెరికాలో ఈ అనలాగ్ బ్యాగ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లో ఓ మొబైల్ రహిత కార్యక్రమం నిర్వహించారు. ఆఫ్‌లైన్ డేటింగ్ నుంచి చిన్నచిన్న కళల వరకు నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అక్కడ పాఠశాలలో మొబైల్ అనుమతులపై పెద్ద చర్చ జరుగుతోంది. జపాన్ లో కూడా రెట్రో సంస్కృతి మరో రూపం దాల్చింది. అక్కడ డిజిటల్ కెమెరాలను వదిలి ఫిల్మీ కెమెరాల వైపు ఆసక్తి చూపుతున్నారు. వస్త్రధారణలో కూడా రెట్రో స్టైల్æను అనుసరిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఈ మార్పు కూడా సోషల్ మీడియా ద్వారానే వేగం పుంజుకుంటోంది. అంటే డిజిటల్ ప్రపంచమే అనలాగ్ హాబీలకు కొత్తతరం అభిమానులను తీసుకొస్తోందన్నమాట.
మనదేశంలో..
మనదేశంలో కూడా జెన్ జీల లైఫ్ స్టైల్‌లో మార్పు కనిపిస్తోంది. ఆఫ్‌లైన్ మీటింగ్స్, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, 90ల కాలాన్ని రీక్రియేట్ చేస్తూ అప్పటి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం, పుస్తకం పఠనం, పాత వస్తువులను కొత్తగా అలంకరించడం, ఎంబ్రైడరీ, బేకింగ్, క్లే పాట్ వర్క్స్ వంటి పనులపై ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా ఆఫ్‌లైన్ మీటింగ్ క్లబ్స్, థీమ్ పార్టీలు, ప్రత్యక్ష పరిచయాలపై యువత ఆసక్తి చూపుతోంది.
డిజిటల్ వరల్డ్‌లో నిరంతర నోటిఫికేన్లు, రోజుకో ఏఐ టూల్‌తో వచ్చే ప్రయోగాలు, ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉండాల్సిన ఒత్తిడి, యువతలో పెరుగుతున్న అసంతృప్తి వాళ్లను 90ల కాలం వైపు ఆసక్తిచూపేలా చేశాయి. డిజిటల్‌గా కనెక్ట్ అవ్వచ్చు కాని ఎప్పుడూ మొబైల్ స్క్రీన్ కే పరిమితం కావాల్సిన పనిలేదని యువత చెప్పకనే చెబుతోంది.
Tags : 1