భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
Breaking News
ఏఐ తోడవుతుందా? సినిమా ‘ఆడు’తుందా?
Published on Wed, 08/12/2026 - 04:41
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో సినిమాల పాత్ర కీలకం. అత్యాధునిక గేమ్స్ రూపకల్పనలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సినిమాలెన్నో భాగం అయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సినిమా పేరుతో గేమ్ విడుదల చేసే ట్రెండ్ భారత్‌లోనూ ఒక దశలో ఊపు మీద కనిపించింది. అయితే కాలక్రమంలో అరుదైపోయింది. దీనికి సదరు గేమ్స్‌కు లభించిన ఆదరణ స్థాయిలే కారణమనేది వేరుగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవలి కాలంలో సాంకేతికంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు... చేర్పులు మరోసారి గేమింగ్ రంగంపై సినిమాల ప్రభావంపై సానుకూల అంచనాలు రేకెత్తిస్తున్నాయి.
మార్కెట్‌కు ఊపు...
ఇటీవలి కాలంలో భారతదేశంలో గేమింగ్ మార్కెట్ బాగా పెరిగింది . ఇప్పుడు గేమ్స్ కేవలం పిల్లల వినోదం కోసం మాత్రమే కాదు... మొబైల్ గేమింగ్, ఎస్పోర్ట్స్, ఆన్‌లైన్ మల్టీప్లేయర్ వంటి విభిన్న మార్గాల వల్ల వినియోగ వర్గాలు బాగా విస్తృతం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను భారతీయ గేమ్ స్టూడియోస్ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గతంలో సినిమా విడుదలకు ముందు/తర్వాత ఒక చిన్న మొబైల్ గేమ్ తయారు చేసి ప్రమోషన్ లక్ష్యంగా వినియోగించారు. ఒక్క హిందీ ‘రా.వన్’ చిత్రం కోసమే 5 ప్లాట్‌ఫామ్స్‌కు గేమ్‌ను తీసుకెళ్లారు. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ గేమ్‌ల సందడి కనుమరుగైంది. ఇక తెలుగు సినిమాల ఆధారంగా అయితే పెద్ద సంఖ్యలో గేమ్స్ రాలేదు. ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధి చెందినది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది డౌన్‌లోడ్లు సాధించిందీ... తెలుగు సినిమా ఆధారిత గేమ్ ‘బాహుబలి’ మాత్రమే.
ఆశావహ అంచనాలు...
ఇక భవిష్యత్తులో నిర్మాతలు సినిమా – వెబ్ సిరీస్ – గేమ్– యానిమేటెడ్ కంటెంట్ – మర్చండైజ్... ఇలా తమ ప్రణాళికలను అమలు చేయవచ్చునని అంచనాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్క సినిమాను మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ యూనివర్స్‌గా మార్చేందుకు అవకాశాలు పెరిగాయన్న మాట. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్‌రియల్ ఇంజీన్ వంటి టెక్నాలజీలతో ఖర్చు తగ్గే అవకాశం కూడా ఈ అంచనాలను బలపరుస్తోంది. గతంలో 3డీ గేమ్ చేయాలంటే భారీ బడ్జెట్, పెద్ద డెవలప్‌మెంట్ టీమ్ అవసరం అయ్యేది. అయితే ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ డెవలప్‌మెంట్, మోడ్రన్ గేమ్ ఇంజీన్స్ వల్ల చిన్న చిన్న స్టూడియోస్ కూడా తక్కువ వనరులతోనే మంచి విజువల్స్ తయారు చేయగలుగుతున్నాయి.
అయితే ‘సినిమా తీస్తున్నాం కాబట్టి దానికి ఒక గేమ్ కూడా ఉండాలి’ అనే మూస విధానం ఇక వర్కవుట్ కాకపోవచ్చు. సినిమా కథను నేపథ్యంగా తీసుకుని ఒక పూర్తి కాన్సెప్ట్‌తో గేమ్ తయారు చేయాల్సి రావచ్చునని గేమింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ‘బాహుబలి’ గేమ్ కోసం సినిమా కథను మళ్లీ అదే విధంగా ఆడించడం కంటే మాహిష్మతి సామ్రాజ్యంలో మనమే ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి రాజ్యాన్ని నిర్మించుకోవడం, యుద్ధాలు చేయడం లాంటి అనుభూతిని అందించేలా రూపొందిస్తే ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్ గేమ్స్‌కు ఫుల్ ఛాన్స్...
వైవిధ్యభరిత కథలు, అనూహ్యమైన కాన్సెప్ట్స్‌ను తెరకెక్కిస్తున్న టాలీవుడ్‌కు గేమ్స్ రూపకల్పనలో మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది. ‘బాహుబలి’ ఇప్పటికే నిరూపించుకోగా (‘బాహుబలి ది గేమ్’ రూపొందించిన మూన్‌ఫ్రాగ్ ల్యాబ్స్ వంటి సంస్థలకు భారీగా డౌన్‌లోడ్స్ లభించినట్టు ఓ నివేదిక వెల్లడించింది) ‘ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ, సలార్, దేవర’... వంటి వెరైటీ కథలతో ముందుకొస్తున్న టాలీవుడ్‌కు గేమ్స్ రంగంలో విస్తరించే అవకాశాలు బాగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మన భారతీయ సినిమా ఆడిన ఆటలు ఇవే...
భారతీయ సినిమాల ఆధారంగా పలు వీడియో గేమ్స్ విడుదలయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా పర్సనల్ కంప్యూటర్, ఆండ్రాయిడ్, ఏఓఎస్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం రూపొందాయి. వీటిని కూడా హాలీవుడ్‌లా భారీ స్థాయిలో కాకుండా ప్రధానంగా సినిమా ప్రచారంలో భాగంగా మాత్రమే విడుదల చేశారు. అలా ప్రసిద్ధమైన భారతీయ సినిమా ఆధారిత వీడియో గేమ్స్‌లో ఆమిర్ ఖాన్ నటించిన ‘గజని’ సినిమాపై ఆధారపడిన ‘గజని ది గేమ్’ (2008) మొదటిదిగా చెపొ్పచ్చు. ఆ తర్వాత షారుక్ ఖాన్ సూపర్‌హీరో చిత్రం ‘రా.వన్’ ఆధారంగా ‘రా.వన్ ది గేమ్’ (2011)లో ప్లే స్టేషన్, పి.సి, మొబైల్ వెర్షన్లు వచ్చాయి. అలాగే షారుక్ నటించిన ‘డాన్ 2’ ది గేమ్ (2011) ఆధారంగా మొబైల్ గేమ్ విడుదలైంది.
మళ్లీ షారుక్ చిత్రమే అయిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ (2013) – రన్నర్–స్టైల్ మొబైల్ గేమ్‌గా రూపొందింది. ఆ తర్వాత సూపర్ హీరో క«థతో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్ 3’ (2013) సినిమా ఆధారంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్ రూపొందింది. అనంతరం బైక్ రేసింగ్/యాక్షన్ గేమ్‌గా ‘ధూమ్ 3 ది గేమ్’ (2013), అజయ్ దేవగణ్ పోలీస్ పాత్ర ఆధారంగా ‘సింగమ్ ది గేమ్’ (2014), రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందించిన రన్నర్ గేమ్ ‘కొచ్చాడియాన్ కింగ్‌డమ్ రన్’ (2014), బాక్సింగ్ యాక్షన్ గేమ్‌గా ‘బ్రదర్స్ ది గేమ్’ (2015), సల్మాన్ ఖాన్ రెజ్లింగ్ సినిమా ఆధారంగా ‘సుల్తాన్ ది గేమ్’ (2016), ధోనీ బయోపిక్ ప్రచారంలో భాగంగా విడుదలైన క్రికెట్ గేమ్ ‘ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ అండ్ వరల్డ్ క్రికెట్ బాష్’ (2016) తెలుగు సినిమా ‘బాహుబలి’ ఆధారంగా ‘బాహుబలి ది గేమ్’ (2017), క్లాసిక్ ‘షో’లే సినిమా ఆధారంగా రూపొందించిన ఆర్కేడ్ గేమ్ ‘షోలే ది గేమ్’ వంటివి మార్కెట్‌లోకి వరుసగా వచ్చాయి.
– సత్యబాబు
Tags : 1