Breaking News

అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!

Published on Sun, 08/02/2026 - 08:30

మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్‌ ఇన్‌ హేలర్‌ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్‌ హేలర్‌ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్‌ హేలర్‌ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?
– సుమలత, విజయవాడ.

ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్‌ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్‌ హేలర్‌ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్‌హేలర్‌ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్‌ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్‌ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్‌ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.

ఇన్‌ హేలర్‌ అంటే స్టెరాయిడ్స్‌ మందా? అది ప్రమాదకరమా?
కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్‌ హేలర్‌లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్‌ హేలర్‌ పూర్తిగా సురక్షితమైన చికిత్స.

ఒకసారి ఇన్‌ హేలర్‌ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?
అసలు కాదు. ఇన్‌ హేలర్‌ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.

వీజింగ్‌ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్‌ హేలర్‌ అవసరమా?
అన్ని వీజింగ్‌లూ ఆస్తమా కావు. వైరస్‌ ఇన్‌ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్‌ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్‌ హేలర్‌ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.

లంగ్‌ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?
పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్‌ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్‌ హేలర్‌ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్‌ హేలర్‌ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.

ప్రతి దగ్గుకూ ఇన్‌ హేలర్‌ అవసరమా?
లేదు. దగ్గు రావడానికి వైరస్‌ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్‌ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్‌ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. 

పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?
అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.

వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్‌ హేలర్‌ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్‌ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్‌ హేలర్‌ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.

- డా. కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

  • మేనిమాట..
    నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్‌ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే!

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)