రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
Breaking News
చరిత్రతో చేతులు కలిపిన ప్రకృతి..
Published on Mon, 07/20/2026 - 10:11
కంబోడియాలోని సీయెమ్ రీప్ వద్ద ఉన్న అంగ్కోర్ వాట్‌ని మొదటిసారి చూస్తే గ్రాఫిక్స్ చేసిన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రతి గోపురం, ప్రతి మెట్టు, ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది.
సరస్సులో ఆలయ ప్రతిబింబం ఆంగ్కోర్ వాట్ ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యోదయం సమయంలో ఆకాశం రంగులు మారిపోతాయి. ఆ ప్రతిబింబం ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో పడటం చూస్తే కాలం కాసేపు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది. క్రీ.శ.12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహా కట్టడం నేటికీ వివిధ దేశాల నుండి వచ్చే సందర్శకులను తన వైపు ఆకర్షిస్తూ ఉంది. అయితే అంగ్కోర్ వాట్ నిజమైన అందం దాని పరిమాణంలో కాదు. దాని మధ్య నడిచే సమయంలో ఫీలయ్యే సైలెన్స్, అడవి చెట్ల వాసనలో, రాళ్ల మీద పడే వెలుగులో ఉంటుంది.

ఎంత గొప్ప కట్టడాలైన కాల గమనంలో కనుమరుగవుతుంటాయి. కానీ, కాలాన్ని కూడా అధిగమించి అలనాటి కథలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది ఆంగ్కోర్ వాట్ ఆలయం. ఇక్కడ చిన్న ఆకు సవ్వడి చేసినా వినిపించేంతటి నిశ్శబ్దం.. ఉదయం వెలుగులో మెరిసే గోపురాలు... రాళ్ల మీద సప్తవర్ణాలు లిఖించే సూర్యకిరణాలు.. ఎటు చూసినా పచ్చందనంతో అడవి మధ్యలో కాలం నిలిచి పోయిందా అనడానికి సజీవ సాక్ష్యంలా ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా విరాజిల్లుతోంది అంగ్కోర్‌వాట్.
సందర్శనీయ ప్రదేశాలు..
అంగ్కోర్ వాట్ ఆర్కియాలజీ ΄ార్క్ మొత్తం ఒక ఓపెన్ మ్యూజియంలా ఉంటుంది. స్థానికంగా బయోన్ టెంపుల్‌లో నవ్వుతున్న ముఖాలను చూస్తే ఆ శిల్పకారుల కలలో మనం కూడా చేరిపోతాం.
తాప్రోమ్ దగ్గర రాళ్ల మధ్యలో పెరిగిన చెట్లను చూస్తే ప్రకృతి, చరిత్ర మధ్య ఉన్న స్నేహం అర్థం అవుతుంది.
బాంటీ స్రే అనే చిన్న ఆలయంలో ఉన్న చిన్న పింక్ శాండ్‌స్టోన్ శిల్పకళ మనసును హత్తుకునేలా ఉంటుంది. నాటి కళాకారుల ఓపిక, వారి ప్రతిభను గుర్తు చేస్తుంది.
ప్రే ఖాన్, అంగ్కోర్ థామ్ మధ్య నడుస్తూ వెళ్తే ప్రతి మూలలో ఒక కొత్త దృశ్యం ఎదురవుతుంది. ఎక్కడ చూసినా శిల్పం, చెరువు, గోపురం.. అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.

ఏం చూడాలి?
అంగ్కోర్ వాట్ వద్ద సూర్యోదయాన్ని చూడటం ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. బయోన్ ఆలయంలో ఉన్న చిరునవ్వులు, తాప్రోమ్‌ను ఆక్రమించిన వృక్షాలు, అంగ్కోర్ థామ్ ద్వారాలు, ఎలిఫెంట్ టెర్రస్, బాంటీ స్రే శిల్పకళ ఇవన్నీ ప్రతీసారి కొత్తగా అనిపిస్తాయి.
సాయంత్రం ఫ్నోమ్ బాఖెంగ్ దగ్గర సూర్యాస్తమయంలో ఆకాశంలో రంగులు మెల్లగా మారడాన్ని చూసి ఆస్వాదించవచ్చు. చెరువుల్లో పడిన ఆ వెలుగు ప్రతిబింబం ప్రయాణాన్ని ఒక అందమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది.

రాళ్ల మధ్య సాగే ప్రయాణం..
అంగ్కోర్ వాట్‌లో గడిపే ప్రతి నిమిషం ఒక సినిమా సీన్ లా ఉంటుంది. ఉదయం వెలుగులో గోపురాలను ముద్దాడుతుంటే కెమెరా పక్కన పెట్టాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కేవలం అక్కడే నిలబడి ఆ మౌనాన్ని వింటేనే చాలు అనిపిస్తుంది.
సాయంత్రం చెరువుల పక్కన వీచే గాలిని ఫీలవ్వడం అనేది మాటలకు అందని అనుభవంగా మిగిలిపోతుంది. దూరంగా వినిపించే పక్షుల స్వరాలు, అడవి ఆకుల కదలికలుం ఈ ప్రదేశాన్ని ఇంకా లైవ్లీగా మార్చేస్తాయి. ఇక్కడ ప్రతి అడుగు చరిత్రతో కలిసి నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది.
ఇక్కడ సైకిల్ రైడ్ చేయడం, సన్ రైజ్‌ను నిశ్శబ్దంగా ఆస్వాదించడం, తాప్రోమ్ అడవిలో నడవడం, బయోన్ శిల్పాలను దగ్గరగా
గమనించడం, సాయంత్రం సాస్కృతిక నృత్య ప్రదర్శనలను చూడటం ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

అడవి ఒడిలో.. మహా కట్టడం
12వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తి 2వ సూర్యవర్మన్ నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం మొదటిగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. తరువాత బుద్ధ సంప్రదాయంలో ప్రముఖ ఆరాధన కేంద్రంగా మారింది.
సమయం మారినా, కాలం గడిచినా, శతాబ్దాల ΄ాటు అడవి ఈ మహా కట్టడాన్ని తన ఒడిలో దాచుకున్నా.. దాని వైభవం మాత్రం నేటికీ తగ్గలేదు.
ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న అంగ్కోర్ వాట్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు.. మానవ సృజనాత్మకత శక్తికి, కళ, ఆధ్యాత్మిక భావన, చరిత్ర కలిసిన ఒక సజీవ మహాకావ్యం.
ఆసక్తికరమైన విషయాలు
అంగ్కోర్ వాట్ అనేది 1992 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది.
అంగ్కోర్ వాట్ ఆలయం కంబోడియాలోని సియేమ్ రీప్ ప్రావిన్స్ దగ్గర అంగ్కోర్ ఆర్కియాలజికల్ ΄ార్క్‌లో ఉంది.
ఖ్మేర్ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళ, నిర్మాణానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి సియేమ్ రీప్ వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ బ్యాంకాక్, కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌తో చేరుకోవచ్చు.
ప్రయాణం మధ్యలో ఆకాశం నుంచి కనిపించే పచ్చని పొలాలు, మెకాంగ్‌ప్రాంతం దృశ్యాలు జర్నీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.
విజయవాడ నుంచి వెళ్లాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా అంతర్జాతీయ విమానాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుండి సియేమ్ రీప్ నగరం వరకు ప్రయాణం తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.
నగరం నుంచి అంగ్కోర్ ఆర్కియాలజీ ΄ార్క్ చేరేటప్పుడు రోడ్ పక్కనే కనిపించే చెట్లు, చెరువులు, గ్రామ జీవితం ప్రయాణాన్ని ఇంకా అందంగా మార్చేస్తాయి.
ఎక్కడ ఉండాలి?
సియేమ్ రీప్‌లో బోటిక్ హోటల్స్, హెరిటేజ్ రిసార్ట్స్, గార్డెన్ స్టేస్ చాలా అందంగా ఉంటాయి. పూల్ పక్కనే నెలకొన్న నిశ్శబ్దం, పచ్చని చెట్లు, ట్రెడిషనల్ ఖ్మేర్ ఆర్కిటెక్చర్ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.
ఉదయం కాఫీతో నుంచి సాయంత్రం దీ΄ాల వెలుగులో గార్డెన్స్‌లో కూర్చుని సమయం గడిపే వరకు ఈ గ్రామంలో మీకు ఎక్కడా బోర్ కొట్టదు.
లగ్జరీ రిసార్ట్స్ నుండి సింపుల్ గెస్ట్ హౌస్ వరకు ప్రతి స్టేలో కంబోడియా ప్రజల మంచి మనసు, వారి సింప్లిసిటీ స్పష్టంగా కనిపిస్తుంది.

ఏం తినాలి?
కంబోడియా భోజనంలో ఫ్రెష్‌నెస్ ప్రతి బైట్‌లో మీరు ఫీల్ అవ్వవచ్చు. ఫిష్ అమోక్ అనే స్థానిక ట్రెడిషనల్ కర్రీ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా మధురంగా ఉంటుంది. ఖ్మేర్ కర్రీ, ఫ్రై డ్ రైస్, ట్రాపికల్ ఫ్రూట్స్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, స్టికీ రైస్ డెజర్ట్స్ ప్రతి భోజనాన్ని మరింత రుచికరంగా మార్చుతాయి.
స్ట్రీట్ కేఫ్స్‌లో దొరికే లోకల్ కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫుడ్ మార్కెట్‌లో ఉన్న వాతావరణం ఇవన్నీ కంప్లీట్ ఫుడ్ ఫ్లేవర్‌ను అందిస్తాయి.
యాత్రా, బడ్జెట్ వివరాలు
హైదరాబాద్ నుండి 5 రోజుల అంగ్కోర్ వాట్ ప్రయాణం బడ్జెట్ కేటగిరీలో ΄్లాన్ చేసుకుంటే ప్రతి వ్యక్తికి సుమారు రూ.55,000 నుండి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ ట్రిప్ కోసం రూ.80 వేల నుంచి రూ.1 లక్షా 10 వేల మధ్య ఖర్చు అవుతుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.1 లక్షా 40 వేల నుండి రూ.2 లక్షల వరకు ΄్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను బట్టి కొంచెం అదనపు ఖర్చు అవుతుంది.
స్టే చార్జెస్ బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. స్టాండర్డ్ హోటల్స్ రూ.6,000 నుండి రూ.10,000 వరకు, ప్రీమియం రిసార్టులు రూ.15,000 పైన ఉంటాయి. భోజనానికి ప్రతీ రోజు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య ఖర్చు చేస్తే సరిపోతుంది.
లోకల్ గైడెడ్ హెరిటేజ్ వాక్స్, టుక్ టుక్ రైడ్స్, సన్ రైజ్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్, కల్చరల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయే అనుభవంగా మార్చేస్తాయి.
వీసా ఎలా?:
భారతీయ ప్రయాణికులకు కంబోడియా వీసా అనేది ఆన్ అరైవల్‌తో ΄ాటు ఈ–వీసా రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని స్వయంగా వెరిఫై చేసుకుని ΄్లాన్ చేసుకోగలరు.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
Tags : 1