Breaking News

ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!

Published on Tue, 06/16/2026 - 06:17

ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్‌నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్‌ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..

 

విత్తన గుళికలు
తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. 

ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి.

కందకాలు
కురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది. అందుకు కందకాలు ఉపయోగపడతాయి. పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. 1 మీటరు లోతు, 1 మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున కందకం తవ్వాలి. రెండు కందకాల మధ్య 5 మీటర్లు ఖాళీ వదలాలి. తవ్విన మట్టిని కందకం లోతట్టు వైపు కట్టగా పోయాలి. 

ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఎర్ర చల్కా చేను సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. 

నల్ల రేగడి నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. 

ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సీనియర్‌ నేతలను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ – రిటైర్డ్‌): 98495 66009, 
మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ – రిటైర్డ్‌) 99638 19074.

ఎత్తు మడులు
సాగు చేసే పంట ఏదైనా సరే ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్‌డ్‌ బెడ్స్‌)పైనే పంటలు విత్తుకోవటమే రైతుకు అన్ని విధాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకుంటే రైతుకు ఆదాయ భద్రత చేకూరుతుందని ఆదిలాబాద్‌ వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. ప్రవీణ్‌కుమార్‌ రైతులకు సూచిస్తున్నారు. 

పత్తి + కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో పాటు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే అనావృష్టి / అతివృష్టి వంటి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుమడులపై పంటల సాగుపై అనేక ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అనుసరిస్తున్న రైతులు సైతం చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే ఒక పంట దెబ్బతింటే, మరో పంటైనా రైతును ఆదుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డా. ప్రవీణ్‌ కుమార్‌ను 91822 67666 నంబరులో సంప్రదించవచ్చు.

లాం ఫారంలో అమ్మకానికి మేలు రకం మిరప విత్తనాలు 
గుంటూరు సమీపంలోని లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఎల్‌.సి.ఎ–625, ఎల్‌.సి.ఎ–643 మిరప రకాల ఫౌండేషన్‌ విత్తనం అమ్ముతున్నట్లు లాం ఫారం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి. సుశీల తెలిపారు. 

ఎల్‌.సి.ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైనది. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకంలా ఉంటాయి. బెట్టను బాగా తట్టుకొంటుంది. కొంతవరకు జెమిని వైరస్‌ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతి ఉన్నా కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో అధిక దిగుబడినివ్వగలిగిన రకం.           

ఎల్‌.సి.ఎ–625 రకం ఎండు మిరపకు అనువైనది. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45,000–50,000 ఎస్‌.హెచ్‌.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఎ.ఎస్‌.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు చాలా తక్కువగా వస్తాయి.

లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ. 9 గం.–సా. 4 గం. లోపు రైతులు నేరుగా వచ్చి కొనుక్కోవచ్చు. ఒక్క రైతుకు 250 గ్రాముల విత్తనం మాత్రమే రూ. 300లకు అమ్ముతారు. 

ఇవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపితే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని డా. సుశీల విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్‌ నంబర్లు: 99898 09554 / 94405 92982

సేంద్రియ సేద్యంపై ‘అక్షయకల్ప’ ఫెలోషిప్‌
వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపు ణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ’అక్షయకల్ప –రెయిన్‌ మ్యాటర్‌ ఫెలోషిప్‌’ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, నాటు కోళ్ల పెంపకం,బయోగ్యాస్‌ ఉత్పత్తి, బయోడైజెస్టర్‌ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్‌ శిక్షణ, తరు వాత 6 నెలలు ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకార వేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యం. వివరాలకు.. 
89043 96761 / 91132 03476 / 70222 77155 / 89043 96761
 
నిర్వహణ: పంతంగి రాంబాబు,
సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?

మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..

చింతమనేనికి ఈడ్పుగంటి శ్రీనివాస్ మాస్ వార్నింగ్

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

Photos

+5

మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ

+5

తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు)

+5

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)