AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
లగాన్@25 : క్రికెట్ ఆటతో చరిత్ర సృష్టించిన ఆమిర్ ఖాన్!
Published on Mon, 06/15/2026 - 08:33
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘లగాన్’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఆమిర్ ఖాన్, గ్రేసీ సింగ్, రెచల్ షెల్లీ, పాల్ బ్లాక్‌థోర్న్ ప్రధాన తారాగణంగా అశుతోష్ గోవారీకర్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా 2001 జూన్ 15న విడుదలైంది. ఈ సినిమా రిలీజై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన హాలీవుడ్ నటుడు పాల్ బ్లాక్‌థోర్న్ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి రావడం విశేషం.
(చదవండి: ఆ సినిమాను ఇంత లేట్‌గా చూడడం నా తప్పే)
‘‘భారతీయ సినిమాపై, ఇక్కడి ప్రేక్షకులపై నాకు ఉన్న అమితమైన ప్రేమే పాతికేళ్ల తర్వాత కూడా నేను ముంబై రావడానికి కారణమయ్యాయి’’ అని పాల్ పేర్కొన్నారు. ఇంకా ఈ వేడుకలకు ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, ఆమిర్ ఖాన్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న గౌరీ స్ప్రాట్ సైతం హాజరయ్యారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్, కుమార్తె ఐరా సందడి చేశారు. అలాగే ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్, కాజోల్, కరీనా కపూర్, జూహీ చావ్లా... ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు.
రూ. 25 కోట్ల బడ్జెట్‌తో...
‘లగాన్’ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 25 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 70 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఎనిమిది జాతీయ అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకున్న మూడో భారతీయ చిత్రంగా ‘లగాన్’ చరిత్ర సృష్టించింది. ‘లగాన్’ సినిమాకు ముందు ‘మదర్ ఇండియా, సలామ్ బాంబే’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమిర్ ఖాన్ నిర్మించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఆమిర్ నిర్మించిన తొలి సినిమా ఇదే.
లగాన్ కథేంటంటే..
బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని చంపానేర్ అనే గ్రామం నేపథ్యంలో ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’ సాగుతుంది. 1893లో చంపానేర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడంవల్ల ఆ గ్రామవాసులు బ్రిటిష్‌వారికి భూమి పన్ను చెల్లించలేకపోతారు. తమ గ్రామ రాజు పూరణ్ సింగ్‌ను పన్ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అయితే బ్రిటిష్ సైన్యాధికారి ఆండ్రూ రస్సెల్ ఆ గ్రామ ప్రజలకు ఓ సవాల్ విసురుతాడు.
బ్రిటిష్ క్రికెట్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడి, చంపానేర్ క్రికెట్ టీమ్ గెలిస్తే పన్ను మాఫీ చేస్తానని చెబుతాడు. ఓడిపోతే మూడు రెట్లు అదనంగా పన్ను కట్టాల్సి ఉంటుందని కూడా షరతు విధిస్తాడు. ఆండ్రూ చేసిన ఈ సవాల్‌ను చంపానేర్ గ్రామవాసి యువకుడు భువన్ స్వీకరిస్తాడు. క్రికెట్ అంటేనే తెలియని భువన్ అండ్ టీమ్ బ్రిటిష్ జట్టుపై ఎలా విజయం సాధించింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
Tags : 1