Breaking News

పశ్చిమాసియా పరిస్థితులే దిక్సూచి

Published on Mon, 05/25/2026 - 01:25

ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు ఇకపై దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాలు చూద్దాం..         

గత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు నాలుగో త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌ దాదాపు ముగింపునకు రావడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లను ఇకపై పశ్చిమాసియా పరిస్థితులు నిర్దేశించనున్నాయి. యూఎస్, ఇరాన్‌ మధ్య రోజుకోతీరుగా మారుతున్న యుద్ధ వాతావరణం లేదా చర్చలపై అవకాశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

వారాంతన యూఎస్‌ అత్యున్నత అధికారి మార్కో రూబియో రెండు దేశాల మధ్య చర్చులు పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మరోపక్క ఇటీవలే ముగిసిన యూ ఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌  చైనా పర్యటన ప్రకటనలవరకే ఫలవంతమైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా కొన్నేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

4 రోజులే ట్రేడింగ్‌ 
బక్రీద్‌ సందర్భంగా గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌సహా పలు రంగాల ముడివ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐతోపాటు.. ఫెడరల్‌ రిజర్వ్‌(యూఎస్‌) తదితర పలుదేశాల కేంద్ర బ్యాంకుల పరపతి విధానాలు కఠినతరమయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది రుణాలకు డిమాండును తగ్గించడంతోపాటు.. కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరిగేందుకు కారణంకానున్నట్లు అంచనా వేశారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  

రూపాయి ఎఫెక్ట్‌ 
భారత్‌ దిగుమతుల బిల్లును ప్రధానంగా చమురు, పసిడి ధరలు పెంచే సంగతి తెలిసిందే. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారి చూపుతోంది. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలన్నీ కొద్ది రోజులుగా దేశీ కరెన్సీని దెబ్బతీస్తు న్నాయి. దీంతో డాలరుతో మారకంలో రూపా యి ఏకంగా 96 స్థాయికి పడిపోయింది. ఆర్‌బీఐ చర్యల కారణంగా వారాంతాన కొంతమేర బలపడినప్పటికీ 94–95 స్థాయిలో కదులుతోంది. కాగా.. వా రాంతాన ఆర్‌బీఐ కొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్‌ ప్రకటించడం సానుకూల అంశమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 

ఇన్వెస్టర్ల ఫోకస్‌  
యూఎస్, ఇరాన్‌ మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్మూడి ఆర్‌. పేర్కొన్నారు. ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌ ప్రభుత్వ వ్యయాలకు దన్నునివ్వవచ్చని, లిక్విడిటీని పెంచే వీలున్నదని మిశ్రా అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బలహీనపడటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఏప్రిల్‌–జూన్‌(క్యూ1) ఫలితాలపై అంచనాలు, మరింత నిర్మాణాత్మక మార్కెట్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు.

గతవారం అక్కడక్కడే 
గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 177 పాయింట్లు(0.23 శాతం) బలపడి 75,415 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్లు(0.32 శాతం) పుంజుకుని 23,719 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 1 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది.  

సాంకేతికంగా చూస్తే.. 
సుమారు రెండు వారాలుగా దేశీ స్టాక్‌మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ గత వారం సైతం పరిమితుల మధ్యే కదిలాయి. వెరసి సమీప భవిష్యత్‌లో మార్కెట్ల కదలికలపై స్పష్టమైన సంకేతాలు అందడంలేదని సాంకేతిక నిపుణులు చెబుతునన్నారు. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు అటు ఎగువముఖంగా లేదా ఇటు దిగువ ముఖంగా బ్రేక్‌ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 23,860–23,250 పాయింట్ల మధ్యే కదులుతోంది. 24,000 పాయింట్ల సమీపంలో రెసిస్టెన్స్‌ ఎదురవుతోంది. దీనిని అధిగమిస్తే 24,300వరకూ బలపడవచ్చు. 23,250 దిగువకు బలహీనపడితే.. 22,750– 22,350 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. సెన్సెక్స్‌ 76,000–74,000 పాయింట్ల మధ్య కదులుతోంది. ఈ శ్రేణిని ఛేదించవలసి ఉంది. ఎగువన 77,000 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్, దిగువన 73,000 వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చు.

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)