ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
కాంట్ అవాయిడ్
Published on Sun, 03/22/2026 - 05:33
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...
కాన్సెప్ట్ పోస్టర్‌తోనే అంచనాలు
చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.
ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్‌లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు నాని. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్‌ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు.
మూడువేల మందితో...
‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్‌కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.
ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించారు. ఈ సెట్‌లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది.
మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో...
‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్‌ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
సలార్ 2లోనూ....
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.
ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్‌డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్‌ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.
అంతకు మించి...
‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్‌తో మేకోవర్ అయ్యారు.
ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పవర్‌ఫుల్ కల్ట్
విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మించారు.
ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.
‘ఫలక్‌నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
మాస్ జడల్
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్‌ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్.
మాస్ రణబాలి
హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్‌గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్‌లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రగ్డ్ డెకాయిట్
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్‌లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్‌లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్‌లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్‌గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది.
ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్‌డోర్‌లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు.
ఎ బ్లడ్ ఫెస్ట్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్‌లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.
– డేరంగుల జగన్ మోహన్
Tags : 1