పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
Breaking News
సాగుకు ముందస్తు భరోసా
Published on Sat, 03/21/2026 - 11:22
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యత
దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.
ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్‌సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్‌లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.
ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలు
జూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.
మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)
| ఎరువు రకం | ప్రస్తుత నిల్వలు (2026) | గతేడాది నిల్వలు (2025) |
|---|---|---|
| యూరియా | 61.14 | 55.22 |
| డీఏపీ | 24.24 | 11.85 |
| కాంప్లెక్స్ | 57.21 | 34.44 |
| ఎస్ఎస్పీ | 24.8 | 23.15 |
| ఎంఓపీ | 12.65 | 14.13 |
వ్యూహాత్మక అడుగులు
యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
Tags : 1