10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
Published on Mon, 03/09/2026 - 16:55
మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో మారుతున్న యుద్ధ సమీకరణాలు సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపే దశకు చేరాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, వంటగ్యాస్ కొరత పెరిగినట్లు కొందరు భావిస్తున్నారు.
వేచి ఉండే సమయం పెంపు.. పెరిగిన ఆందోళన
గ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వినియోగదారులు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సరుకు రవాణాలో ఆలస్యం కారణంగా బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే డీలర్ల వద్ద బుకింగ్‌లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో డీలర్ అవుట్‌లెట్ల వద్ద క్యూ కడుతున్నారు.
కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేత
హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేశారు. ‘కనీసం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లు అయినా అందుబాటులో ఉన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్స్ తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి’ అని ఒక సబర్బన్ డీలర్ పేర్కొన్నారు. దీనివల్ల హోటల్ యజమానులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన ధరలు.. కొత్త నిబంధనలు
సంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం మోపినట్లయింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై దేశీయ వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో ఇది 15 రోజులుగా ఉండేది. గతంలో ఉన్న సరళమైన బుకింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం నియంత్రించడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో భయాందోళనలు
ముంబయిలోని అంధేరీ వంటి రద్దీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే వినియోగదారులు డీలర్ల కార్యాలయాలకు పరుగులు తీశారు. ‘గ్యాస్ అయిపోకముందే ఒక సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. యుద్ధం ఎటు దారితీస్తుందో, సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’
Tags : 1