₹8 నుంచి ₹28875... 5 ఏళ్లలో 31,900% రిటర్న్ !
Breaking News
సముద్రఖని, గౌతమ్ మీనన్ సినిమా విడుదలపై బిగ్ ప్లాన్
Published on Thu, 03/05/2026 - 19:35
సౌత్ ఇండియా ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కార్మేని సెల్వం. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ చక్రి తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.
ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు.
Tags : 1