టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
Breaking News
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
Published on Thu, 02/26/2026 - 19:31
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.
ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది.
పినరయిలోని మరో కోణం
కేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.
నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.
కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది.
ఇదే పంథాలో ప్రపంచ నాయకులు
భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్‌కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్‌లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.
కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్‌ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.
Tags : 1