బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి
Published on Sun, 02/15/2026 - 08:37
‘‘హే భగవాన్’ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. స్టోరీ లెవల్ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు.
సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్.. అందుకే ‘హే భగవాన్’ టైటిల్ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్‌గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.
దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ మూవీస్ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌గా మార్చి 6న రిలీజ్ చేస్తున్నాను. సత్యదేవ్‌తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్‌ని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈటీవీ విన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు.
Tags : 1