జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
Published on Fri, 02/06/2026 - 09:40
టైటిల్: యుఫోరియా
నటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులు
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్
నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణ
రచన-దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: ఫిబ్రవరి 06, 2026
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్‌కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.

కథ
చైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్‌కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.
అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్‌గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్‌కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
2022 మే 28న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది.
ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్‌గా న్యూస్‌లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.
అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్‌లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..
'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్‌దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్‌రోల్‌లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది.
వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు.
Tags : 1