మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
నార్త్ బ్లాక్‌లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ
Published on Fri, 01/16/2026 - 14:52
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్‌లోనే కొనసాగనుంది.
కొత్త భవనంలో లేని సౌకర్యం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్‌లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్ బిల్డింగ్‌లోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రెస్‌లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్ రోడ్డులోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్ బ్లాక్‌లోని ప్రత్యేక ప్రెస్‌కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.
రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రత
బడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్ బ్లాక్‌లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.
త్వరలో ‘హల్వా వేడుక’
బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
Tags : 1