జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
Breaking News
ఉంచాలా తీసేయాలా.. ఫస్ట్ నన్ను అడగాలి
Published on Sun, 01/11/2026 - 07:05
కెరీర్‌లో తొలిసారి రవితేజ.. తన 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తీసేసి, రెమ్యునరేషన్ అందుకోకుండా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మంగళవారం(జనవరి 13) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్.. రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సినిమాతో అలరించలేకపోయాం. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ తీస్తా అని మాటిచ్చారు.
'ఈ సినిమాకు రవితేజ అన్నయ్య.. మాస్ మహారాజ్ టైటిల్ తీసేయండి అని అన్నారట. ఆ టైటిల్ పెట్టింది నేను. దాన్ని పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నీ తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మాస్ మహారాజ్ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. అది జరిగే పనికాదు. మిరాపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే 'నేనింతే'లో పూరీ జగన్నాథ్ పెట్టారు'
(ఇదీ చదవండి: 'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్)
'సినిమా ఎలా ఉన్నాసరే ఆడిందా ఊడిందా అనేది రవితేజ ఏం పట్టించుకోడు. తర్వాత రోజు షూటింగ్‌కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకురా' అని అర్థం. ఆయన పరిచయం చేసిన దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ.. ఈరోజు స్టార్ డైరెక్టర్స్ పొజిషన్‌లో ఉన్నారు. మా గత సినిమా సరిగా ఎంటర్‌టైన్ చేయలేదు. డిసప్పాయింట్ చేశాం. కానీ మేం అక్కడితో అలా ఆగిపోము. రవితేజతో మళ్లీ బ్లాక్‌బస్టర్ తీస్తా' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.
హరీశ్ శంకర్ కెరీర్ చూసుకుంటే.. ఇరవైళ్లలో ఎనిమిది సినిమాలు తీశాడు. వీటిలో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి. చివరగా 2024లో 'మిస్టర్ బచ్చన్' అనే రీమేక్ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. ఇది దళపతి విజయ్ 'తెరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. దీని వల్ల మూవీపై అస్సలు బజ్ లేదు. ఈసారి హిట్ కొడితేనే హరీశ్ శంకర్‌కి ప్లస్ అవుతుంది. మరెం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఏపీలో రవితేజ, నవీన్ సినిమాలకు టికెట్ ధరలు పెంపు)
Tags : 1