Breaking News

డెసర్ట్‌ టూర్‌: పర్యాటక మెరుపు వీచిక..!

Published on Mon, 11/10/2025 - 10:35

నగరాలలో చారిత్రక సౌందర్యం. కోటలలో నిర్మాణ నైపుణ్యం. రాజమందిరాల్లో శిల్పచాతుర్యం. థార్‌ ఎడారిలో రాజస లాంఛనం. రాజస్థాన్‌కు మణిమకుటాలు. చిత్రమైన పిచ్వాయ్‌ కృష్ణుడు. నాథ్‌ద్వారా స్టాచ్యూ ఆఫ్‌ బిలీఫ్‌. గోల్డెన్‌ సాండ్స్‌ టూర్‌ ఆకర్షణలు. పర్యటనలో మెరుపు వీచికలు.

హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఉదయ్‌పూర్‌ చేరడం. ఉదయ్‌పూర్‌లో హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావడం. లంచ్‌ తర్వాత సిటీప్యాలెస్, లేక్‌ పిచోలా సందర్శనం. బస ఉదయ్‌పూర్‌లో. లేక్‌ సిటీ విహారం ఉదయ్‌పూర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నగర చారిత్రక సౌందర్యం మెరుపు వీచికలుగా కనువిందు చేస్తుంటుంది. సిటీ ఆఫ్‌ లేక్స్‌ అని ఎందుకంటారో నగరంలో ఓ అరగంట ప్రయాణంలోనే తెలుస్తుంది. ఫతే సాగర్, పిచోలా, స్వరూప్‌ సాగర్, రంగ్‌ సాగర్, దూద్‌ తలాయ్‌ సరస్సులు ప్రధానమైనవి. ఈ సరస్సుల్లో కనీసం రెండయినా అరగంట ప్రయాణంలో కనిపిస్తాయి. వాటి మెయింటెనెన్స్‌ కూడా బాగుంటుంది. 

ఇక చారిత్రక కట్టడాల్లో ఆరు కిలోమీటర్ల సిటీ వాల్, నగరంలో ప్రవేశించడానికి సూర్జా΄ోల్, చాంద్‌΄ోల్, ఉదయ్‌΄ోల్, హాథీ΄ోల్, అంబా΄ోల్, బ్రహ్మపోల్, దిల్లీ గేట్, కిషన్‌పోల్‌ పేర్లతో ద్వారాలున్నాయి. ఇవి కూడా తారసపడతాయి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నగరంలో హోటల్‌ గదికి చేరే లోపే రెండు లేక్‌లు, రెండు ద్వారాలు, చేతక్‌ సర్కిల్‌ పర్యాటకులను చరిత్రయుగంలోకి తీసుకెళ్తాయి. పిచోలా సరస్సు ఒడ్డున సిటీ ప్యాలెస్‌. సరస్సు మధ్యలో లేక్‌ ప్యాలెస్, ఒక వైపుగా జగ్‌మందిర్, జగ్‌మోహన్‌ ప్యాలెస్‌లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. 

కొంతకాలంగా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్‌ ఐకాన్‌ గోమాత ప్రింట్‌. ఫ్యాషన్‌ డిజైనర్‌లు చీరలు, చుడీదార్‌ల మీద గోమాత బొమ్మను డిజిటల్‌ ప్రింట్‌ చేస్తున్నారు. ఈ గోమాత చిత్రలేఖనం జగ్‌మందిర్‌ గోడల మీద కనిపిస్తుంది. లేక్‌కు మరొక ఒడ్డున దర్బార్‌హాల్‌ ఉంది. బొమ్మలతో కొలువు దీరిన దర్బార్‌హాల్‌ నాటి రాజకొలువును తలపిస్తుంది.

2వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత సజ్జన్‌గఢ్‌ ఫోర్ట్‌ విజిట్‌. ఆ తర్వాత హల్దీఘాటీకి ప్రయాణం. మహారాణా ప్రతాప్‌ మ్యూజియం సందర్శనం తర్వాత నాథ్‌ద్వారాకు ప్రయాణం. స్టాచ్యూ ఆఫ్‌ బిలీఫ్‌ విజిట్‌ తర్వాత హోటల్‌ గదికి చేరడం. బస ఉదయ్‌పూర్‌లోనే.

సినీ ప్యాలెస్‌
సజ్జన్‌గఢ్‌ ప్యాలెస్‌కు ప్రయాణం మొదలైన తరవాత ఉదయ్‌పూర్‌ నగర శివారు నుంచి మలుపు తిరగ్గానే జనసమ్మర్దం కొరవడుతుంది. దూరంగా కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తులో చిన్న నిర్మాణం కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అక్కడ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించడానికి జరిగిన ఏర్పాట్లు అర్థమవుతాయి. అటవీ ప్రదేశం మధ్యలో వాహనం వెళ్లడానికి మార్గం ఉంది. వెకేషన్‌కి వచ్చిన వాళ్లు ఒకరోజు ఈ ట్రెకింగ్‌కు కేటాయించవచ్చు. 

మేవార్‌ రాజు సజ్జన్‌సింగ్‌ ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం నిర్మించిన ప్యాలెస్‌ ఇది. సజ్జన్‌సింగ్‌ మరణం తర్వాత ఆ ఉద్దేశం నెరవేరలేదు. అటవీ ప్రదేశం నేపథ్యంలో ఒక కోట కేంద్రంగా కథ నడిచే సినిమాల్లో ఈ ప్యాలెస్‌ కనిపిస్తుంది. జేమ్స్‌ బాండ్‌ సినిమా అక్టోపసీ సినిమాలో రోజర్‌మూర్‌ ఈ కోట నుంచి పారిపోయే సన్నివేశం చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ద చీటా గర్ల్స్‌ వంటి మరికొన్ని సినిమాలకు కూడా ఈ ప్యాలెస్‌... విజువల్‌ రిచ్‌నెస్‌నిచ్చింది. 

రాణాప్రతాప్‌ పోరుగడ్డ
మేవార్‌ రాజ్యానికి మొఘల్‌ పాలకులకు మధ్య యుద్ధం జరిగిన పోరుగడ్డ హల్దీఘాటీ. మేవార్‌ రాజ్యం తరఫున రాణా ప్రతాప్, మొఘల్‌ సామ్రాజ్యం తరఫున మాన్‌సింగ్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌ నుంచి ఈ ప్రదేశానికి వెళ్లే మార్గం ఒక అడ్వెంచరస్‌ టూర్‌ని తలపిస్తుంది. కొండల నడుమ కనుమ గుండా దట్టమైన అడవి మధ్యలో సాగుతుంది ప్రయాణం. దాదాపుగా 30 కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిలో ఎర్రదనం తగ్గుతూ పసుపు చారలు మొదలవుతాయి. కొంతదూరం వెళ్లేసరికి నేల గోరంత పసుపురాసుకున్నట్లు ఉంటుంది. 

యుద్ధభూమికి చేరే లోపు చేతక్‌ స్మారకం పాలరాతి నిర్మాణం కనిపిస్తుంది. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం, ఎన్నో విజయాలను సాధించి పెట్టిన గుర్రం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడి నుంచి బరువెక్కిన గుండెతో హల్దీఘాటీకి చేరతాం. 

యుద్ధక్షేత్రానికి చేరే లోపే ఆకాశమంత ఎత్తులో ఠీవిగా సింహాసనం మీద ఆసీనుడైన రాణాప్రతాప్‌ కంచు విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నిర్మించిన భారీ మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్‌ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. హల్దీఘాటీలో జరిగిన యుద్ధంలో రాణాప్రతాప్‌ తన రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు. 

రాజస్థాన్‌ కృష్ణుడు
ఇక్కడ శ్రీకృష్ణుడిని శ్రీనాథ్‌గా పిలుచుకుంటారు. వల్లభాచార్యుడి సంప్రదాయం శుద్ధ అద్వైతాన్ని ఆచరిస్తారు. స్థానికులు గోవర్ధన గిరిధారి రూపంలో ఉన్న కృష్ణుడిని కొలవడమే కాదు, ఇక్కడ చిత్రకారులు కూడా ఈ రూపంలో కృష్ణుడి బొమ్మలో వేయడంలో నిష్ణాతులు. వీరిది ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రాలను పిచ్వాయ్‌ పెయింటింగ్స్‌ అంటారు. 

మేవార్‌లో విస్తరించిన చిత్రలేఖనాల శైలి ఇది. ఈ టూర్‌ గుర్తుగా ఒక పెయింటింగ్‌ కొనుక్కోవడం మరువద్దు. నాథ్‌ద్వారాకు మరొక టూరిస్ట్‌ అట్రాక్షన్‌ స్టాచ్యూ ఆఫ్‌ బిలీఫ్‌ శివుడి విగ్రహం. విశ్వాస స్వరూపం పేరుతో 369 అడుగుల శివుడి విగ్రహాన్ని 2022లో ప్రతిష్ఠించారు. ప్రపంచంలోని శివుడి విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన రూపం ఇదే.

3వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ త్వరగా ముగించుకుని గది చెక్‌ అవుట్‌ చేసి జయ్‌ సల్మేర్‌కు బయలుదేరాలి. జయ్‌సల్మేర్‌లో డెసర్ట్‌ క్యాంప్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి భోజనం, బస అక్కడే.

జీవిస్తున్న కోట
జయ్‌సల్మేర్‌ కోట ఒక ఊరంత... కాదు, పట్టణమూ కాదు, ఓ మోస్తరు నగరమంత ఉంటుంది. ఈ కోటను క్రీ.శ 12వ శతాబ్దంలో రాజపుత్ర పాలకుడు రావల్‌ జయ్‌సల్‌ నిర్మించాడు. అందుకే ఈ కోటకు జయ్‌సల్మేర్‌ అని పేరు. ఇది మన వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి కాలానిది. యునెస్కో ఈ రెండింటినీ వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌లుగా గుర్తించింది. 

జయ్‌సల్మేర్‌ కోట లివింగ్‌ ఫోర్ట్‌. అంటే ఈ కోటలో జనజీవనం కొనసాగుతోంది. జనజీవితం కొనసాగుతున్న ప్రాచీన కోటలు అరుదుగా ఉంటాయి. జయ్‌ సల్మేర్‌ కోట గోడలు పసుపురంగు రాతితో నిర్మించడంతో దీనిని గోల్డెన్‌ ఫోర్ట్రెస్‌ అంటారు. ఈ కోటలోని పాలరాతి ఆలయాలు, రాజమందిరాల గోడలకు చెక్కిన గవాక్షాల డిజైన్‌లను ఎంత సేపు చూసినా ఇంక చాలు అనే సంతృప్తి కలగదు. 

ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది. కలంకారీ అద్దకాలు, స్క్రీన్‌ ప్రింటింగ్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కనిపించే ట్రెండింగ్‌ డిజైన్‌లు ఈ గోడల మీదవే. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి గొప్ప లొకేషన్‌ ఇది. హమ్‌ దిల్‌ దే చుకే సనమ్, షోలే, ద ఫాల్, భజరంగ్‌ భాయీ జాన్‌తోపాటు తెలుగు సినిమా కొండపల్లి రాజాలో ఒక పాట చిత్రీకరణ జయ్‌సల్మేర్‌ కోటలో జరిగింది.

ఎడారిలో ఓ రాత్రి
రాజపుత్రుల రిచ్‌ లైఫ్‌స్టైల్‌ని ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలంటే  థార్‌ ఎడారి డెసర్జ్‌ క్యాంప్‌లో గడపాలి. సాయంత్రం నీరెండలో బంగారు రజను రాశిపోసినట్లున్న ఎడారి ఇసుకలో జీప్‌ సఫారీ ఒక రకమైన సంతోషం. ఒంటె మీద విహారం లయబద్ధంగా కదులుతూ ముందుకు సాగుతుంటే మరో లెవెల్‌ ఎంజాయ్‌మెంట్‌. ఇక ఎడారిలో ఆధునిక సౌకర్యాలతో గుడారాలు, చలిమంట, నాటలు, డాన్సులు, రాజస్థానీ రుచులతో చక్కటి భోజనాలు పూర్తయిన తర్వాత గుడారంలో నిద్ర. తెల్లవారే సరికి అంతా కలలోలాగ గడిచిపోతుంది.

4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత డెసర్ట్‌ క్యాంప్‌ బస నుంచి చెక్‌ అవుట్‌ అయి జయ్‌ సల్మేర్‌ కోటకు ప్రయాణమవ్వాలి. కోట తర్వాత పట్వోన్‌ కీ హవేలీ, గాడిసర్‌ లేక్‌ విహారం తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, డిన్నర్, బస జయ్‌సల్మేర్‌ సిటీలో.

శిలకు పూచిన పూలు
జయ్‌ సల్మేర్‌ కోటలో ఒక ఆర్కిటెక్చురల్‌ అద్భుతం ఈ హవేలీ. దూరం నుంచి చూస్తే గోడల నిండుగా పెయింటింగ్స్‌ ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే అవన్నీ గోడకు పూసిన పూలే. కొన్ని శిలకు చెక్కిన విరిశిల్పాలు, మరికొన్ని కట్టడంలో గోడకు పూలతీగలు, విరిసిన పూలను నిర్మించారు. వాటికి రంగులద్దారు. భవనంలో విరిసిన ఉద్యానవనం విరిసినట్లుంది. ఈ హవేలీ క్రీ.శ 18వ శతాబ్దం నాటి నిర్మాణకౌశలానికి నిలువెత్తు నిదర్శనం. 

5వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత జో«ద్‌పూర్‌కు ప్రయాణం. మెహరాన్‌గఢ్‌ కోట వీక్షణం తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, డిన్నర్, రాత్రి బస జోద్‌పూర్‌లో.విజయద్వారాల కోటఉదయ్‌పూర్‌ నగరంలో ద్వారాలున్నట్లే ఇక్కడ కూడా ద్వారాలున్నాయి. అయితే ఇవి కోట నిర్మాణ సమయంలో కట్టినవి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో నిర్మించినవి. 

జయ్‌΄ోల్‌ను జయ్‌పూర్, బికనీర్‌ రాజ్యాలతో యుద్ధం చేసి గెలిచిన సందర్భంలో మహారాజా మాన్‌సింగ్‌ కట్టాడు. మొఘలుల మీద గెలిచినప్పుడు ఫతేపోల్‌ నిర్మాణం జరిగింది. లోహ΄ోల్‌ దగ్గర గోడ మీద మహిళల చేతి ముద్రలను చూడగానే మనసు బరువెక్కుతుంది, స్త్రీలకు జరిగిన అన్యాయానికి సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన నేపథ్యం అది. భర్తను కోల్పోయిన రాణులు, యువరాణులు సతిలో పాల్గొనే ముందు తమ చేతిముద్రలను గోడకు అద్దేవారు. 

నాటి దురాచానికి నిదర్శనంగా ఆ ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. మెహరాన్‌గఢ్‌ కోటలోపల మోతీమహల్, ఫూల్‌ మహల్, శీష్‌ మహల్‌లు అందమైన నిర్మాణాలు. ఇక్కడ మ్యూజయంలో బంగారు పల్లకి ఉంది. కోట పై భాగంలో పెద్ద ఫిరంగిని చూడగానే కొద్దిగా భయం వేస్తుంది. మనసు కుదుటపరుచుకున్న తర్వాత అక్కడి నుంచి చూస్తే నగరం వ్యూ అందంగా ఉంటుంది.

6వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి బయలుదేరాలి. ఉమైద్‌ భవన్‌ ΄్యాలెస్‌ మ్యూజయం వీక్షణం తర్వాత మధ్యాహ్నం జో«ద్‌పూర్‌ ఎయిర్‌΄ోర్టులో డ్రాప్‌ చేస్తారు. విమానం సాయంత్రం ఐదున్నరకు బయలుదేరి ఏడున్నరకు హైదరబాద్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది.

ఉపాధి హామీ భవనం
రాజపుత్రుల కోటలు, ప్యాలెస్‌లలో ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ కొత్తదనే చెప్పాలి. ఇది 20వ శతాబ్దపు నిర్మాణం. ఇది అత్యంత ఆధునికమైన నిర్మాణం. క్రీ.శ 1929లో మొదలై, 1943లో పూర్తయింది. అప్పటికే దేశంలో బ్రిటిష్‌ వలస పాలన వేళ్లూనుకుని ఉంది. వలస పాలకులు వద్దంటూ స్వాతంత్య్రం కోసం పోరాటం కూడా ఊపందుకుని ఉంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్మాణం చేపట్టడానికి కారణం అనావృష్టి. అవును వరుసగా మూడేళ్లుగా వర్షాలు లేక పంటలు వేసే అవకాశం లేక పొలాలు బీళ్లుగా మారాయి. 

రైతులకు పని లేదు. అలాంటి సమయంలో ఉపాధి కల్పన కోసం మహారాజా ఉమైద్‌ సింగ్‌ ఈ నిర్మాణాన్ని తలపెట్టాడు. రోజూ రెండు నుంచి మూడు వేల మంది పని చేసేవారు. మఖరానా మార్బుల్, బర్మా టేకుతో నిర్మాణపరంగా ప్రత్యేకమైనదే. ప్రస్తుతం ఇది తాజ్‌ హోటల్స్‌ నిర్వహణలో ఉంది. కోటలో కొంత భాగం, మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతిస్తారు.

ప్యాకేజ్‌ పేరు: గోల్డెన్‌ సాండ్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌.
ప్యాకేజ్‌ కోడ్‌: ఎస్‌హెచ్‌ఏ 20. ఇందులో ప్రధానంగా ఉదయ్‌పూర్, జై సల్మీర్, జోద్‌పూర్‌ కవర్‌ అవుతాయి.

టారిఫ్‌ ఇలా: సింగిల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 49,650 రూపాయలు, డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 38 వేలు, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో 36,550 రూపాయలు. 

ప్రయాణం ఎప్పుడు? 
ఆరు రోజుల ఈ పర్యటన నవంబర్‌ 22వ తేదీన మొదలయ్యి 27వ తేదీతో ముగుస్తుంది. ఇదే టూర్‌ 23 నుంచి మరొక ట్రిప్‌ మొదలవుతుంది. అది 28వ తేదీ పూర్తవుతుంది. 

22వ తేదీ ఉదయం 8.45 గంటలకు 6ఈ 846 విమానం హైదరాబాద్‌లో మొదలవుతుంది. 10. 25 గంటలకు ఉదయ్‌పూర్‌కి చేరుతుంది (23వ తేదీ ట్రిప్‌కి కూడా ఇదే నంబరు విమానం, ఇదే టైమ్‌)

తిరుగుప్రయాణం 27వ తేదీన జో«ద్‌పూర్‌ నుంచి 6ఈ 6816 విమానం సాయంత్రం 17. 30 గంటలకు బయలుదేరి, 19.25 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.

ప్యాకేజ్‌లో ఏమేమి వర్తిస్తాయి?
విమానం టికెట్‌లు (హైదరాబాద్‌ నుంచి ఉదయ్‌పూర్, జోద్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌) 

హోటల్‌ బస(4 రోజులు), డెసర్ట్‌ క్యాంప్‌ బస (ఒకరోజు) 

బ్రేక్‌ఫాస్ట్‌లు 5, లంచ్‌ 1, డిన్నర్‌లు 5 n సైట్‌ సీయింగ్‌కి (ఐటెనరీలో ప్రకటించిన ప్రదేశాలకు మాత్రమే) ఏసీ బస్సు 

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ 

ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌

ప్యాకేజ్‌లో ఇవి వర్తించవు!
భోజనంలో మెనూలో లేకుండా అదనంగా ఆర్డర్‌ చేసుకున్న పదార్థాలు, పానీయాలు 

ఫ్లయిట్‌లో ఆర్డర్‌ చేసుకున్న ఆహారం 

సైట్‌ సీయింగ్‌లో ఇతర ప్రదేశాల వీక్షణం వంటివి (ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆలయాలు, ప్రార్థనమందిరాలు, ఆసక్తి కలిగించే ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి రవాణా, ఎంట్రీ టికెట్‌లు, దర్శనం టికెట్‌ల వంటివి ప్యాకేజ్‌లో వర్తించవు) 

టిప్‌లు, గైడ్, లాండ్రీ ఖర్చులు 

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మొదలై హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌తో ముగుస్తుంది. కాబట్టి హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కి చేరడానికి, ఎయిర్‌పోర్ట్‌ నుంచి రవాణా ఇందులో వర్తించవు. 
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!)

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)